Zimbabwe President
-
జింబాబ్వే అధ్యక్షుడిపై హత్యాయత్నం
బులవాయో: జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మునగాగ్వా(75) బాంబు దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. శనివారం బులవాయోలో జరిగిన అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్–పేట్రియాటిక్ ఫ్రంట్ (జాను–పీఎఫ్)పార్టీ ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, దేశ ఉపాధ్యక్షుడితోపాటు మరికొందరు నేతలు, ప్రజలు గాయపడ్డారు. ప్రసంగం ముగిసిన అనంతరం అధ్యక్షుడు మునగాగ్వా వేదిక దిగి వస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు కెమో మొహాది, జాను–పీఎఫ్ ఉపాధ్యక్షురాలు, క్యాబినెట్ మంత్రి ఒప్పా ముచింగురి–కషిరి, పార్టీ కార్యదర్శి ఎంగెల్బర్ట్ రుగెజె గాయపడ్డారని అధికార మీడియా తెలిపింది. అధ్యక్షుడు లక్ష్యంగానే ఈ దాడి జరిగిందనీ, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని హోం మంత్రి ఒబెర్ట్ ముఫొఫు తెలిపారు. ఘటన అనంతరం అధ్యక్షుడిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. జూలై 30వ తేదీన జరిగే దేశాధ్యక్ష ఎన్నికలకు గాను అధ్యక్షుడు శనివారం బులవాయోలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఇథియోపియా ప్రధానిపై కూడా.. అడిస్అబాబా: ఇథియోపియా ప్రధాని శనివారం గ్రెనేడ్ దాడి నుంచి త్రుటిలో బయటపడ్డారు. సంస్కరణల వాదిగా పేరున్న ప్రధాని అబియ్ అహ్మద్(42) శనివారం రాజధాని అడిస్అబాబాలో జరిగిన భారీ ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఆయన్ను వెంటనే భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 83మంది గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘ఇది పథకం ప్రకారం జరిగిన దాడి. ప్రజలను విడదీయటానికి జరిగే ప్రయత్నం విజయవంతం కాబోదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. గత ఏప్రిల్లో అధికార పగ్గాలు చేపట్టిన అహ్మద్.. జైళ్లలో ఉన్న వేలాది మంది ఖైదీలను విడుదల చేశారు. ప్రభుత్వ కంపెనీల్లో ప్రైవేట్ పెట్టుబడులకు దారులు తెరిచారు. -
‘చైనాపై ఆధారపడుతున్న అమెరికా’
డర్బన్: తమది పేద దేశం కాదని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే అన్నారు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా తర్వాత తమదే అభివృద్ధి చెందిన దేశమని పేర్కొన్నారు. ఆర్థికంగా చైనాపై ఆధారపడిన అమెరికా పేద దేశమని వ్యాఖ్యానించారు. తమది విఫలదేశం కాదనడానికి 90 శాతం అక్షరాస్యత నమోదు కావడమే నిదర్శనమన్నారు. సుదీర్ఘ కాలంగా జింబాబ్వేకు అధ్యక్షుడిగా ఉన్న ముగాబే పాలనలో ఇటీవల కాలంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ‘మాది పేద దేశం కాదు. దుర్భర దేశం కాదు. అమెరికాను దుర్భర దేశంగా పిలుస్తాను. ఎందుకంటే చైనాపై అమెరికా ఎక్కువగా ఆధారపడుతోంది. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా తర్వాత మాదే అత్యంత అభివృద్ధి చెందిన దేశమ’ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్యానల్ డిస్కసన్లో ముగాబే అన్నారు. 2000 సంవత్సరం నుంచి జింబాబ్వే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. నిరుద్యోగం ఆకాశాన్నంటింది. -
జింబాబ్వే అధ్యక్షుడిగా మళ్లీ ముగాబే ప్రమాణం
హరారే: జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే(89) మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 1980 నుంచి జింబాబ్వేకు ముగాబేనే నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారమిక్కడ ఘనం గా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాది మంది ముగాబే అభిమానులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విపక్ష నేత మోర్గాన్ స్వాన్గిరాయ్కు చెందిన పార్టీ బహిష్కరించింది.