![Zimbabwe's president calls for peace after stadium blast attack - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/24/iethipia.jpg.webp?itok=38LtTZK_)
జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మునగాగ్వా, ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్
బులవాయో: జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మునగాగ్వా(75) బాంబు దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. శనివారం బులవాయోలో జరిగిన అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్–పేట్రియాటిక్ ఫ్రంట్ (జాను–పీఎఫ్)పార్టీ ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, దేశ ఉపాధ్యక్షుడితోపాటు మరికొందరు నేతలు, ప్రజలు గాయపడ్డారు. ప్రసంగం ముగిసిన అనంతరం అధ్యక్షుడు మునగాగ్వా వేదిక దిగి వస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు కెమో మొహాది, జాను–పీఎఫ్ ఉపాధ్యక్షురాలు, క్యాబినెట్ మంత్రి ఒప్పా ముచింగురి–కషిరి, పార్టీ కార్యదర్శి ఎంగెల్‌బర్ట్ రుగెజె గాయపడ్డారని అధికార మీడియా తెలిపింది. అధ్యక్షుడు లక్ష్యంగానే ఈ దాడి జరిగిందనీ, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని హోం మంత్రి ఒబెర్ట్ ముఫొఫు తెలిపారు. ఘటన అనంతరం అధ్యక్షుడిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. జూలై 30వ తేదీన జరిగే దేశాధ్యక్ష ఎన్నికలకు గాను అధ్యక్షుడు శనివారం బులవాయోలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.
ఇథియోపియా ప్రధానిపై కూడా..
అడిస్‌అబాబా: ఇథియోపియా ప్రధాని శనివారం గ్రెనేడ్ దాడి నుంచి త్రుటిలో బయటపడ్డారు. సంస్కరణల వాదిగా పేరున్న ప్రధాని అబియ్ అహ్మద్(42) శనివారం రాజధాని అడిస్‌అబాబాలో జరిగిన భారీ ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఆయన్ను వెంటనే భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 83మంది గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘ఇది పథకం ప్రకారం జరిగిన దాడి. ప్రజలను విడదీయటానికి జరిగే ప్రయత్నం విజయవంతం కాబోదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. గత ఏప్రిల్‌లో అధికార పగ్గాలు చేపట్టిన అహ్మద్.. జైళ్లలో ఉన్న వేలాది మంది ఖైదీలను విడుదల చేశారు. ప్రభుత్వ కంపెనీల్లో ప్రైవేట్ పెట్టుబడులకు దారులు తెరిచారు.
Comments
Please login to add a commentAdd a comment