ముగాబే విషాదయోగం | Robert Mugabe's tragedy | Sakshi
Sakshi News home page

ముగాబే విషాదయోగం

Published Fri, Nov 17 2017 12:35 AM | Last Updated on Fri, Nov 17 2017 12:35 AM

Robert Mugabe's tragedy - Sakshi - Sakshi

బ్రిటిష్‌ వలస పాలకులకు రెండు దశాబ్దాలపాటు నిద్ర లేకుండా చేసిన గెరిల్లా... నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలాకు మాత్రమే సాటి రాగల నేపథ్యం... వలసపాలకులను తరిమికొట్టాక పదేళ్లపాటు శ్రమించి దేశాన్ని ఆఫ్రికా ఖండంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చిన సమర్ధత – ఇవన్నీ బుధవారం సైనిక తిరుగు బాటులో పదవీచ్యుతుడైన జింబాబ్వే అధినేత రాబర్ట్‌ ముగాబే గురించే. దేశాన్ని దాదాపు నాలుగున్నర దశాబ్దాలు పాలించిన ముగాబే తొలి పదేళ్ల పాలనాకాలం తర్వాత తన చరిత్రను తానే తుడిచేసుకునే పనిలోబడ్డారు. భిన్నాభిప్రాయాన్ని సహించలేకపోవడం, ప్రశ్నించినవారిని ఖైదు చేయడం లేదా కాల్చి చంపడం ముగాబే పాలన సారాంశం. వీటన్నిటిలో చేదోడు వాదోడుగా ఉండి ఆయన అధికార పీఠాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఉపాధ్యక్షుడు ఎమర్సన్‌ నంగాగ్వాతో ముగాబేకు విభేదాలు రాకపోయి ఉంటే  శేష జీవితంలో కూడా ఆయనే దేశాధ్యక్షు డిగా కొనసాగేవారు. కానీ 93 ఏళ్ల వయసులో ముగాబే తన వయసుకు మించిన సాహసానికి ఒడిగట్టారు. తన జీవిత భాగస్వామి 52 ఏళ్ల గ్రేస్‌కు అధికార పీఠం అప్పగించాలనుకున్నారు. ఆమె దేశాధ్యక్షురాలు కావాలంటే ముందు ఉపాధ్యక్షురాలి పదవిలో ఉండాలి గనుక అది కట్టబెట్టే సన్నాహాలు చేశారు.

అందుకోసం సుదీర్ఘ కాలంపాటు తన కళ్లూ చెవులుగా పనిచేసిన ఎమర్సన్‌పై కత్తిగట్టి ఉపాధ్యక్ష పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలికారు. దీంతో సర్వమూ తారుమారైంది. సొంత పార్టీ జాను–పీఎఫ్‌లో సైతం ముగాబేపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇప్పుడాయన తన అధ్యక్ష భవనంలోనే బందీ. తిరుగుబాటు జరిపి ఆయన్ను పదవి నుంచి తప్పించా మని సైన్యం ఒప్పుకోవడం లేదు. పైగా దీన్ని ‘ప్రక్షాళన ప్రక్రియ’గా దబాయిస్తోంది. ఆయన చుట్టూ చేరిన నేరగాళ్ల ముఠాను తప్పించి వ్యవస్థను సరిచేయడమే తాము చేస్తున్న పని అని సంజాయిషీ ఇస్తోంది. ఆ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగిందని అటు ఆఫ్రికా ఖండ దేశాల సంస్థ ఆఫ్రికన్‌ యూనియన్‌(ఏయూ) కూడా చెప్ప దల్చుకోలేదు. అలా చెబితే జింబాబ్వేను సంస్థ నుంచి సస్పెండ్‌ చేయాల్సి వస్తుంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన స్థానంలో ఎమర్సన్‌ను అధ్యక్షుడిగా ప్రకటించి అంతా సుఖాంతమైందని ప్రకటిస్తారా లేక అధికారం రుచి మరిగిన సైన్యం అక్కడే తిష్ట వేస్తుందా అన్నది చూడాలి.   

 స్వాతంత్య్రానికి ముందు రొడీషియాగా పేరున్న జింబాబ్వే మిగిలిన ఆఫ్రికన్‌ దేశాల్లాగే ప్లాటినం, బొగ్గు, ముడి ఇనుము, బంగారం, వజ్రాలు వంటి సహజ సంపదలున్న దేశం. జలవనరులుండటం వల్ల వ్యవసాయం కూడా మెరుగ్గానే ఉంది.  కానీ శతాబ్దానికి పైగా పాలించిన బ్రిటన్‌ పాలకులు ఆ దేశాన్ని నిలువునా కొల్లగొట్టారు. నల్లజాతీయులపై స్వారీ చేశారు. అడుగడుగునా అక్కడ జాత్యహం కారం తాండవించేది. అలాంటిచోట ముగాబే 1980లో అధికారం చేపట్టి తొలి దశాబ్దంలో అనేక విజయాలు సాధించారు. ఉన్న జలవనరులను వినియోగించుకుని దేశానికి ‘ఆఫ్రికా ఖండ ధాన్యాగారం’ అనే పేరు తెచ్చారు. విద్య, వైద్యం వంటి అంశాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించారు. ఆఫ్రికా ఖండంలో 99 శాతం అక్షరాస్యత సాధించిన దేశం అదే. అయితే తనకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు కుట్రలు పన్నుతున్నాయని ఆయన శంకించడం ప్రారంభించారు. ముఖ్యంగా తనతో కలిసి దేశ స్వాతంత్య్రానికి పోరాడిన జాషువా ఎన్‌కోమో వంటి నాయకులు తనకు వ్యతిరేకంగా మారడం వెనక వాటి హస్తమున్నదని అనుమానించారు. అంతేగాక తమకున్న పలుకుబడితో అవి ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వంటి సంస్థల నుంచి సహకారం అందకుండా అడ్డుపడుతున్నాయని భావించారు. అందుకు ప్రతీకారంగా ఆయన క్రమేపీ నియంతృత్వ పోకడలను పెంచుకున్నారు. 

జనాభాలో శ్వేత జాతీయులు ఒక శాతమే అయినా, వారి అధీనంలో 70 శాతం పంట భూములున్నాయని 1995లో జరిగిన ఒక సర్వే తేల్చింది. దేశంలో వలస పాలన పోయినా ఆర్ధిక స్వాతంత్య్రం రాలేదని ప్రకటించి నల్లజాతీయులను రెచ్చ గొట్టి ఆ భూముల నుంచి శ్వేత జాతీయుల్ని వెళ్లగొట్టే పని ప్రారంభించారు.  శ్వేత జాతీయులు భూములు వదిలి పరారు కావడం, నల్లజాతీయులకు వ్యవసాయ క్షేత్రాల నిర్వహణలో అనుభవం లేకపోవడం పర్యవసానంగా అవి బీళ్లయ్యాయి. ఫలితంగా ఖజానా నిండుకుంది. నిరవధిక సమ్మెలతో పారిశ్రామిక రంగం పడ కేసింది. ప్రభుత్వం నుంచి నెలల తరబడి జీతాలు రాకపోవడంతో ప్రభుత్వోద్యో గులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు సమ్మెలు చేశారు. ఇవన్నీ ముగాబే పరపతిని దెబ్బతీశాయి. 2000 సంవత్సరంలో కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయడంపై రిఫరెండం నిర్వహిస్తే ముగాబేకు తొలిసారి ఓటమి ఎదురైంది. 2008 మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్‌లో ఆయన ప్రత్యర్థి సాంగిరాయ్‌ విజయం సాధించారు. అయితే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరో పించి ఆయన రెండో రౌండ్‌ పోటీలో పాల్గొనలేదు. దాంతో ముగాబే గెలిచా ననిపించుకున్నారు. ఆ మరుసటి నెలలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కోల్పోవడంతో సాంగిరాయ్‌ పార్టీ ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకోక తప్పలేదు. కానీ సాంగిరాయ్‌ త్వరలోనే దేశం విడిచిపోవాల్సి వచ్చింది. 2013 మేలో ఎన్నో అక్రమాలకు పాల్పడటం వల్ల ముగాబే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించ గలిగారు. 

సోషలిస్టు సిద్ధాంతాలతో మార్క్సిస్టు–లెనినిస్టుగా రాజకీయ జీవితం ప్రారం భించిన ముగాబే చరమాంకం ఇలా సైనిక తిరుగుబాటుతో ముగుస్తుందని ఎవరూ అనుకోలేదు. నమ్మే సిద్ధాంతం ఏదైనా నియంత పోకడలకు పోతే, ప్రజలను విశ్వా సంలోకి తీసుకోకుండా పరిపాలన సాగిస్తే ఎంతటివారికైనా గడ్డు పరిస్థితులు ఏర్ప డక తప్పదని వర్తమాన జింబాబ్వే హెచ్చరిస్తోంది. ఒకప్పుడు ముగాబే పేరు వింటే పులకించిన దేశం ఇప్పుడాయన బందీగా మారాడని తెలిసినా నిర్లిప్తంగా ఉండి పోయిందంటే అది ఆయన చేజేతులా చేసుకున్నదే. ప్రజాస్వామిక విలువలను కాల రాసే వారంతా ముగాబే జీవితాన్ని గుణపాఠంగా తీసుకోక తప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement