![farewell party tragedy intermediate girl student died in Mahabubabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/Mahabubabad-Tragedy.jpg.webp?itok=o9ZjhChO)
నృత్యం చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని
టెన్త్ విద్యార్థుల ఫేర్‌వెల్ పార్టీలో విషాదం
డీజే సౌండ్‌తో పాటలు, నృత్యాలు
ఎంతో ఆనందంగా వీడ్కోలు పార్టీకి వెళ్లిన ఆ అమ్మాయి విగతజీవిగా మారిపోయింది. చదువు చెప్పిన గురువుల ముందు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసిన ఆ విద్యార్థిని అర్థాంతరంగా తనువు చాలించింది. అప్పటివరకు ఆడిపాడిన అమ్మాయి ఆస్పత్రి బెడ్‌పై నిర్జీవంగా కనిపించడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో ముగినిపోయారు. అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్ అంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు.
పాఠశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో (ఫేర్‌వెల్ పార్టీ) ఒక విద్యార్థిని నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలింది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల (ఈఎంఆర్‌ఎస్)లో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలివి. సీరోలు ఈంఎఆర్‌ఎస్ పాఠశాల/కళాశాలలో పదో తరగతి విద్యార్థులకు ఫేర్‌వెల్ పార్టీ (farewell party) కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డీజే సౌండ్ (DJ Sound) బాక్స్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటర్ విద్యార్థినులు సైతం నృత్యాలు చేశారు.
ఈ క్రమంలో మరిపెడ మండలం తానంచర్ల (Tanamcherla) శివారు సపావట్ తండాకు చెందిన సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16).. వేదికపై నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను లేపేందుకు ప్రయత్నించారు. ఆమెను 108 వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఈఎంటీ గాంధీ సీపీఆర్ చేశారు. చివరికి మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు కుమార్తె మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు.
విచారణ లేకుండా సస్పెండ్ చేశారని..
ములుగు/వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండల కేంద్రంలోని తన అద్దె గృహంలో మంగళవారం ఉదయం వెంకటాపురం అంగన్‌వాడీ ప్రాజెక్టు సీడీపీఓ ధనలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై కనీసం విచారణ లేకుండానే ఏకపక్షంగా సస్పెండ్ చేశారని మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితురాలి వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.
గతంలో ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న తతంగంపై కలెక్టర్‌కు విన్నవించినా పట్టించుకోలేదని, ప్రస్తుతం సమాన వృత్తిలో ఉన్న ములుగు సీడీపీఓ, ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ చెప్పినట్లుగా వినడం తప్ప ఎదుట వ్యక్తి విషయాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని ఆమె వీడియోలో పేర్కొన్నారు. సెంటర్లు నడవని కేంద్రాలకు ఎందుకు అద్దె చెల్లిస్తున్నారని, రిటైర్ అయిన ఆయాకు వేతనం ఎలా ఇస్తారని అడిగానని, వీటిని మనసులో పెట్టుకుని కలెక్టర్ ద్వారా సస్పెన్షన్ లెటర్ వచ్చేలా చేశారన్నారు. వీటన్నింటికి కారణం డీడబ్ల్యూఓ శిరీష అని పునరుద్ఘాటించారు.
చదవండి: తెలంగాణ బీసీల్లో ముదిరాజ్‌లే టాప్.. తర్వాత ఎవరంటే?
కాగా, సీడీపీఓ ధనలక్ష్మి తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం వెంకటాపురం(కె) ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ టీచర్లు ధర్నా చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్ ధనలక్ష్మిని పిలిపించి మాట్లాడారు. ఇది జరిగిన అరగంటలోనే సీడీపీఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు రావడంతో ఆమె ఆందోళన చెందారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఆత్మహత్యాయత్నం సంచలనం సృష్టించింది. ఈ విషయమై డీడబ్ల్యూఓ శిరీషను వివరణ కోరగా తాను ఆమెను ఏమీ ఇబ్బంది పెట్టలేదని వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment