నిలబడే నిద్రపోయిన దేశ అధ్యక్షుడు!
వయసుకారణంగానో లేక చాలా దూరం ప్రయాణించడం మూలంగానో తెలియదు కానీ ఏకంగా దేశాధ్యక్షుడే ఓ ముఖ్యమైన సమావేశంలో నిలబడే కునుకు తీసినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. అది కూడా మీడియా ప్రతినిధుల ముందు. ఇంకేముంది సమావేశంలో నిద్రపోవడమేంటని విమర్శలు రావడంతో అవన్ని వట్టి ఆరోపణలేనని సదరు దేశం కొట్టిపారేసింది.
జపాన్ ప్రధాని షింజో అబే ఆహ్వానం మేరకు జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(92) జపాన్లో పర్యటించడానికి వచ్చారు. ఆఫ్రికా అభివృద్ది కోసం ప్రతి ఏడాది నిర్వహించే టోక్యో అంతర్జాతీయ సదస్సు(టీఐసీఏడీ) ఈ ఏడాది అగస్టులో కెన్యాలో జరుగనుంది. దీనిలో భాగంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల గురించి వివరించడానికి టోక్యోలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జపాన్, జింబాబ్వే దేశాల దౌత్య సంబంధాల బలోపేతం గురించి అబే మాట్లాడారు. ఆఫ్రికాకు ముగాబే ఒక దిగ్గజంగా అభివర్ణిస్తూ మాట్లాడుతుండగా..నిలబడే ఉన్న ముగాబే కునుకు తీసినట్టు స్పష్టంగా కనిపించింది.
తనకు కుడి వైపు నిద్రమత్తులో అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఉన్న ముగాబేను ఒక్కసారి అలా చూసి చూడనట్టు అబే చూశారు. కొంత అసహనానికి గురి అయినట్టు కూడా కనిపించింది. నిలబడే ఓ దేశ అధ్యక్షుడు కునుకు తీశారా అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ ప్రారంభం అవ్వడంతో జింబాంబ్వే సమాచార మంత్రిత్వ శాఖ వివరణ కూడా ఇచ్చుకుంది. ఆ సమయంలో ముగాబే నిద్రపోవడంలేదని కేవలం అక్కడ జరగబోయే ఒప్పందాల గురించి ఆలోచిస్తున్నారని తెలిపింది. మీడియా సమావేశంలో ఎవరైనా నిద్రపోతారా ? ముగాబేను అగౌరవ పరిచేలా వస్తున్న ఆరోపణలన్ని అవాస్తవమని ఒక ప్రకటనను విడుదల చేసింది.
అయితే ముగాబే ఇలాంటి సంఘటనలో మీడియా కంటికి చిక్కడం మొదటిసారేం కాదు. ఆఫ్రికా యూనియన్ శిఖరాగ్రసమావేశంలోనూ పలువురు ముఖ్యులు ప్రసంగిస్తున్న సమయంలో కూడా నిద్రపోయారు.