విండోస్‌ 2017 | Windows 2017 | Sakshi
Sakshi News home page

విండోస్‌ 2017

Published Sun, Dec 31 2017 2:15 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

Windows 2017 - Sakshi

కొన్ని తీపి గురుతులు.. మరికొన్ని చేదు గుళికలు.. ఎన్నో మధుర స్మృతులు.. మరెన్నో పీడ కలలు.. మొత్తంగా 2017 ఎన్నో జ్ఞాపకాలను మిగులుస్తూ వీడ్కోలుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో 2017కి వీడ్కోలు పలికి 2018 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో గడిచిన 2017లో దేశంలోనూ, ప్రపంచంలోనూ చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు, పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మేలో ప్రపంచాన్ని వాన్నాక్రై వణికించింది.150 దేశాల్లో విండోస్‌ ఓఎస్‌ ఉపయోగించే కంప్యూటర్లు, సంస్థలు లక్ష్యంగా సైబర్‌ దాడులు సాగాయి. ఈ కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని తిరిగి ఇచ్చేందుకు బిట్‌కాయిన్‌ క్రిప్టో కరెన్సీతో చెల్లింపులు చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారు.

వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా సైనిక పాలకుడు కిమ్‌ జోంగ్‌–ఉన్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ చర్యలతో ట్రంప్, కిమ్‌ మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. ట్రంప్‌ హెచ్చరికలు.. కిమ్‌ ప్రతి హెచ్చరికలతో  ఇరుదేశాల మధ్యా యుద్ధ వాతావరణం నెలకొంది.

జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికాను మరోసారి శక్తివంతమైన, సంపన్న దేశంగా మారుస్తానంటూ వాగ్దానం చేశారు. అధికారాన్ని చేపట్టిన కొద్ది కాలంలోనే తన వ్యవహారశైలి, మాట్లాడే ధోరణి, ముఖ్యమైన సమస్యలపై స్పందించే తీరుతో ట్రంప్‌ అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారారు.

37 ఏళ్ల పాటు జింబాబ్వే అధ్యక్షుడిగా ఉన్న రాబర్ట్‌ ముగాబేకు రాజకీయ చరమాంకంలో చేదు అనుభవం ఎదురైంది. సైనిక తిరుగుబాటు ద్వారా ఆయన బలవంతంగా రాజీనామా చేసే వరకు పరిస్థితులు దారితీశాయి. తన భార్య గ్రేస్‌ ముగాబేను తొలుత ఉపాధ్యక్షురాలిని చేసి, తన తర్వాత అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టాలని ముగాబే చేసిన ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత దీనికి కారణమైంది. ఆరురోజుల పాటు దిగ్బంధం ఫలితంగా ఆ దేశ తర్వాతి అధ్యక్షుడిగా ఎమార్‌సన్‌ నాన్‌గాగ్వా బాధ్యతలను స్వీకరించారు.

పనామా పేపర్ల పేరిట జర్మనీ వార్తాపత్రిక విడుదల చేసిన లక్షలాది పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తల సందేహాస్పద ఆర్థిక వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఈ వివాదాల్లో చిక్కుకున్న వారిలో ఎలిజబెత్‌ రాణి–2 మొదలుకుని, బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్, ఐర్లాండ్‌కు చెందిన పాల్‌ డేవిడ్‌ హ్యూసన్‌(బోనో) తదితరులున్నారు.

ఆగస్టు చివర్లో మయన్మార్‌లో రోహింగ్యాలపై అక్కడి సైన్యం హత్యాకాండతో బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా దాడుల బారిన పడిన తెగగా రోహింగ్యాలను పరిగణిస్తున్నారు. రోహింగ్యా శరణార్థుల సమస్యకు ఇంకా ఎలాంటి పరిష్కారం లభించలేదు.

దేశ 14వ రాష్ట్రపతిగా రాంనాథ్‌ కోవింద్‌ జూలై 17న, 13వ ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు ఆగస్ట్‌ 5న ఎన్నికయ్యారు. వారు వరుసగా కాంగ్రెస్‌ అభ్యర్థులు మీరాకుమార్, గోపాలకృష్ణ గాంధీని ఓడించారు. బీజేపీ నేపథ్యమున్న మొదటి రాష్ట్రపతిగా కోవింద్‌(72) చరిత్రకెక్కారు. బిహార్‌ గవర్నర్‌గా పనిచేసిన కోవింద్‌కు 65 శాతం ఓట్లు లభించాయి. వరుసగా దాదాపు 19 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన వెంకయ్య ఆ సభకే అధ్యక్షుడయ్యారు.

1997లో నాసా ప్రయోగించిన కాసిని అంతరిక్షనౌక 2004లో శనిగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. నాలుగున్నర లక్షల ఉపగ్రహ చిత్రాల ద్వారా విలువైన సమాచారాన్ని అందించింది. 2017 సెప్టెంబర్‌ 15న సేవలు చాలించింది.

అక్టోబర్‌ 1న లాస్‌వేగాస్‌లో ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకుని స్టీఫెన్‌ పాడాక్‌ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 58 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏకపక్ష ప్రకటన. దాదాపు 7 దశాబ్దాల పాటు అగ్రరాజ్యం అనుసరించిన వైఖరికి భిన్నంగా ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో పశ్చిమాసియాలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.

అమెరికాను ‘హరికేన్‌ హార్వే’ అల్లాడించింది. దీని ధాటికి టెక్సాస్‌ తదితర ప్రాంతాల్లో 90 మంది వరకు చనిపోవడంతో పాటు దాదాపు 200 బిలియన్‌ డాలర్లపై చిలుకు ఆస్తి నష్టం వాటిల్లింది.

ఈ ఏడాది బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. గోవా, మణిపూర్‌లో సగానికన్నా ఎక్కువ సీట్లు రాకున్నా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. పంజాబ్‌లో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి కష్టం మీద మెజారిటీ సంపాదించింది. ఐదేళ్ల కాంగ్రెస్‌ పాలన సాగిన హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

జూలై 1న ఏకీకృత పన్నుల విధానం జీఎస్టీ అమలులోకి వచ్చింది. ప్రధాని మోదీ ‘గుడ్‌ అండ్‌ సింపుల్‌ ట్యాక్స్‌’ అని పిలిచిన జీఎస్టీ కేంద్ర, రాష్ట్రాలు వసూలు చేస్తున్న 15 రకాల పన్నులు, సుంకాల స్థానంలో జీడీపీని పెంచే సాధనంగా మారింది.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో దాదాపు రెండు దశాబ్దాలు కొనసాగిన సోనియాగాంధీ ఆరోగ్య కారణాలతో వైదొలిగారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సోనియా కుమారుడు రాహుల్‌గాంధీ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం చేపట్టిన నెహ్రూ–గాంధీ కుటుంబంలో ఆయన ఆరో సభ్యుడిగా చరిత్రకెక్కారు.

లాలూ ప్రసాద్‌ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో రాజకీయ బంధం తెంచుకున్న బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ రాజీనామా చేసిన వెంటనే అప్పటి వరకూ శత్రువైన బీజేపీతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కొన్ని నెలలుగా ఈ పరిణామం జరుగుతుందని ఊహించినా నితీశ్‌ చూపిన తెగువ, వేగం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.

ముస్లిం సమాజంలో మహిళలకు వారి భర్తలు ఇచ్చే ముమ్మారు తలాక్‌ పద్ధతి చెల్లదని ఈ ఏడాది ఆరంభంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సంచలనం సృష్టించిన ఈ తీర్పు అమలుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ముమ్మారు తలాక్‌ను రద్దు చేస్తూ ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లు రూపొందించింది. లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాక చట్టం కావడానికి అడ్డంకులేవీ ఉండవు.

1962లో యుద్ధానికి దిగిన ఆసియా పెద్దన్నలు ఇండియా, చైనా మధ్య జూన్‌ 16 నుంచి కొన్ని నెలలపాటు పశ్చిమ భూటాన్‌లోని వివాదాస్పద ప్రాంతమైన డోక్‌లామ్‌ పీఠభూమిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తత ముదిరి రెండోసారి రెండు పెద్ద దేశాల మధ్య పోరుకు దారితీస్తుందేమోననే భయాందోళనలు తలెత్తాయి. డోక్‌లామ్‌ ప్రాంతంలోకి చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఈ వివాదం రాజుకుంది. చివరికి నిర్మాణం ఆపేసిన చైనాకు, భారత్‌కు మధ్య ఉద్రిక్తత సడలించడానికి ఆగస్ట్‌ 28న అవగాహన కుదిరింది. 

ఇస్రోకు మరిచిపోలేని విజయాలు అందించిన సంవత్సరం ఇది. ఇస్రో తన ఉపగ్రహవాహక నౌక(పీఎస్‌ఎల్వీ) ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఫిబ్రవరి 15న 714 కిలోల ఉపగ్రహం కార్టోస్టాట్‌–2ను మరో 103 ఉపగ్రహాలతోపాటు ఇస్రో ప్రయోగించింది.

బెంగళూరుకు చెందిన ప్రసిద్ధ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ దారుణ హత్య దేశంలో కుచించుకుపోతున్న భావ ప్రకటనా స్వాతంత్య్రానికి, పత్రికా స్వేచ్ఛకు అద్దం పట్టింది. సెప్టెంబర్‌ 5 సాయంత్రం ఇంటి దగ్గరే గౌరిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అవినీతి, నియంతృత్వ పోకడలను ప్రతిఘటించే గౌరీ లంకేశ్‌ పత్రిక నడుపుతున్నారు.

వివిధ రంగా ల్లో ప్రముఖులు తమ కింద పనిచేసే మహిళలపై సాగించిన లైంగిక వేధింపులు, దోపిడీకి వ్యతిరేకంగా పాశ్చాత్య ప్రపంచం లో ఆలిసా మిలానో అనే స్త్రీ ప్రారంభించిన ‘నేను సైతం’ ఉద్యమంలో వేలాది మంది భారత మహిళలు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement