ట్రంప్‌కి సొంత ఫ్లయిట్ ఉంది. కిమ్ రైల్లో వచ్చారు. వియత్నాంలో చర్చలు. చర్చల మధ్యలో ట్రంప్‌కి కిమ్ మీద కోపం వచ్చింది. ‘నేను వెళ్లిపోతున్నా’ అని పైకి లేచారు. వెళ్తూ, వెళ్తూ..‘నా ఫ్లయిట్‌లో వస్తారా.. కొరియాలో దింపేస్తాను’ అని ఆహ్వానించారు. ట్రంప్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫిబ్రవరి 24న బి.బి.సి. ప్రసారం చేస్తున్న ‘ట్రంప్ టేక్స్ ఆన్ ది వరల్డ్’ చివరి ఎపిసోడ్‌లో ట్రంప్‌లోని ‘నాన్–ప్రెసిడెంట్’ని చూపించే డాక్యుమెంటేషన్స్ కొన్ని ఉన్నాయి. ఆ వివరాలు..
ట్రంప్ ఉన్నన్నాళ్లూ అమెరికా ప్రెసిడెంటుగా మాత్రమే లేరు. మనకు తెలిసిన ఒక పెద్ద మనిషెవరో అమెరికా అధ్యక్షుడు అయితే ఎలా ఉంటారో అలా కూడా ఉన్నారు! ఆ సూటు, కోటు, టై మాత్రమే ఆయన ప్రెసిడెంటు అనగలగడానికి గుర్తు. అవి తీసి చూస్తే.. మామూలు విషయాలన్నీ మాట్లాడే ఒక మామూలు మనిషే. అయితే ట్రంప్‌లోని విశేషం.. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ దుస్తుల్ని ధరించి కూడా మామూలు మనిషిగా మాట్లాడ్డం! అమెరికా ఆతిథ్యానికి వచ్చిన పరదేశీ పెద్దమనిషి అని లేదు, ఓ పెద్దమనిషిగా çపరదేశానికి వచ్చానన్న ‘మూతి బిగింపు’ లేదు, ఆ దేశమూ ఈ దేశమూ కాకుండా వేరే దేశంలో ఎక్కడో ఇద్దరం అధ్యక్షులం చర్చల కోసం కలుసుకున్నాం అన్న దౌత్యాధిక్యమూ లేదు. కోపమొస్తే కోపం, నవ్వొస్తే నవ్వు! జోకులు వేసేవారు. భుజం చరిచేవారు.
ఒక చెంపపై కొట్టి, ఇంకో చెంపపై ముద్దు పెట్టేవారు. ఇలా ఉన్నాయి ఆయన ఉన్న నాలుగేళ్లూ. రాజకీయాల నుంచి వచ్చిన మనిషి కాకపోవడంతో మనిషిగా మాత్రమే తరచు ఆయన ‘బిహేవ్’ చేసేవారు. ఎప్పుడైనా పర్సనల్ సెక్రెటరీ వచ్చి ‘అలా చేయకూడదు’ అని చెవిలో చెబితే వెంటనే తనొక ప్రెసిడెంట్‌నని గుర్తుకు తెచ్చుకుని తిన్నగా కూర్చున్నారేమో తెలియదు. అలాంటి విషయాలు చాలావరకు గోప్యంగా ఉండిపోతాయి. ప్రెసిడెంట్ పదవీ కాలం ముగిశాక, ప్రెసిడెంటుతో కలిసి సన్నిహితంగా పనిచేసినవారు ఎప్పుడైనా నోరు విప్పిన ప్పుడు బహిర్గతం అవుతాయి.
వియత్నాంలోని హనోయ్ సమావేశానికి రైలు నుంచి కిమ్
‘ట్రంప్ టేక్స్ ఆన్ ది వరల్డ్’ అని బి.బి.సి.లో ట్రంప్‌పై కొంతకాలంగా డాక్యుమెంటరీలు వస్తున్నాయి. ఇప్పటికి రెండు ఎపిసోడ్‌లు ప్రసారం అయ్యాయి. మూడోదీ, చివరిదీ అయిన ఎపిసోడ్ ఫిబ్రవరి 24 స్ట్రీమ్ అవుతోంది. అందులో ట్రంప్ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయాలు, అనూహ్యంగా ప్రవర్తించే విధానం, తనొక ప్రెసిడెంట్ ననే స్పృహ లేకుండా కామన్‌మేన్‌గా మాట్లాడ్డం వంటి ఆసక్తికరమైన సందర్భాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా తన అత్యున్నతస్థాయి విదేశాంగ శాఖ అధికారులకు ఆయన ఇచ్చిన ‘షాకు’లు! అయితే ట్రంప్ అవి తెలిసి ఇచ్చిన షాకులు కాదని ఎపిసోడ్స్‌ని నిర్మించిన టిమ్ స్టిర్‌జకర్ ముందే చెప్పేశారు. తొలి రెండు ఎపిసోడ్‌లలో ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ విధానం, అమెరికాను ట్రంప్ ఇరాన్ తో యుద్ధం వరకు తీసుకెళ్లడం వంటివి ఉన్నాయి. ఈ మూడో ఎపిసోడ్‌లో ఉత్తర కొరియాతో, అది కూడా కిమ్‌తో ఆయన ఎలా ఉన్నారో తెలిపే వాస్తవ చిత్రీకరణలు ఉన్నాయి.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో దాదాపుగా ఒక ఫ్రెండ్‌లానే ఉండి వెళ్లారు ట్రంప్. అది దక్షిణ కొరియాకు నచ్చేది కాదు. ట్రంప్ అకస్మాత్తుగా కొన్నిసార్లు దక్షిణ కొరియా వైపు ఉండేవారు. అది కిమ్‌కి నచ్చేది కాదు. మొత్తానికి గత నాలుగేళ్లలో ట్రంప్–మెలనియా (ప్రథమ మహిళ) జంట కన్నా, ట్రంప్–కిమ్ జంటే తరచు ప్రపంచ ప్రజల కంట పడుతుండేది. బి.బి.సి తాజా ఎపిసోడ్‌లో ఈ పోలిక లేదు కానీ.. ఎవరితోనూ పోల్చలేని ట్రంప్ ప్రవర్తనపై ఫోకస్ ఎక్కువగా ఉంది. అందులోనిదే ఓ చిన్న సందర్భం చూద్దాం.
2019 ఫిబ్రవరిలో.. వియత్నాంలోని హనోయ్‌లో ట్రంప్, కిమ్ ద్వైపాక్షిక చర్చలకు కూర్చున్నారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమం మీద డిస్కషన్. ట్రంప్ చెప్పినట్లు కిమ్ వినడం లేదు. ట్రంప్‌కి విసుగొచ్చింది. చర్చల మధ్యలోనే లేచి బయటికి వచ్చేశారు.
విమానం నుంచి ట్రంప్ (ఫైల్)
‘‘ఏమైంది మిస్టర్ ప్రెసిడెంట్’ అని బయట వేచి ఉన్న ప్రెస్ వాళ్లు అడిగారు. ట్రంప్ వాళ్లపైపు చూశారు. ‘కొన్నిసార్లు మధ్యలోనే లేచి రావలసి వస్తుంది’ అన్నారు. అనేసి ఆయన దారిన ఆయన తన ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో అమెరికా వెళ్లిపోవచ్చు. కానీ అలా వెళ్లలేదు. కిమ్ దగ్గరకు వెళ్లి.. ‘నా ఫ్లయిట్‌లో వస్తారా, మిమ్మల్ని కొరియాలో దింపేసి నేను అమెరికా వెళ్లిపోతాను’ అని ఆఫర్ ఇచ్చారు! ఆయన అలా అనడానికి కారణం ఉంది. ట్రంప్ తన ప్రెసిడెంట్ విమానంలో వియత్నాం చర్చలకు వస్తే, కిమ్ రైల్లో రోజంతా ప్రయాణించి చైనా మీదుగా హనోయ్ వచ్చారు. వెళ్లేటప్పుడు అంత చుట్టూ తిరిగే పని లేకుండా కిమ్‌ని నేరుగా కొరియాలో దింపేద్దామని అనుకున్నారు ట్రంప్. ‘రెండు గంటల్లో చేరుకుంటారు. వస్తారా’ అని అడిగారు. కిమ్ రానన్నారు. ట్రంప్‌లోని ఈ దౌత్యాతీత ఔదార్యం ట్రంప్ ‘నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ సభ్యుల్ని ఆశ్చర్యానికి, భయానికీ గురి చేసింది.
ట్రంప్ పక్కనే ఆయన్ని కాచుకుని ఉండే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్‌కి ఇలాంటి ఆశ్చర్యాలు, భయాలు కొత్తేం కాదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన కొత్తలో కిమ్‌లో తన బెస్ట్ ఫ్రెండ్‌ని చూసుకున్నారు. 2018లో సింగపూర్‌లో ఈ రెండు దేశాధినేతల మధ్య తొలి సమావేశం జరిగిప్పుడు జాన్ బోల్టన్, ఆయన టీమ్ ఆ పక్కనే ఉంది. ‘నాకొకటి కావాలి’ అన్నారు కిమ్. ‘అడగండి మీ ఇష్టం’ అన్నారు ట్రంప్. ‘అమెరికా, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్న ఉమ్మడి సైనిక విన్యాసాలను రద్దు చేయాలి’ అన్నారు కిమ్. ‘దాన్దేముందీ.. అలాగే’ అనేశారు ట్రంప్. ఆ దెబ్బకు బోల్టన్ టీమ్ దిమ్మెరపోయింది. ఒకటేదైనా అడిగితే వెంటనే ఇచ్చేయడం దౌత్యధర్మం కాదు. ‘ఇస్తాను సరే మాకేమొస్తుంది?’ అని అడగాలి. ట్రంప్ అడగలేదు. పైగా 60 ఏళ్లకు పైగా అమెరికా, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాలవి!
ఒక్క ‘సరే’తో వాటిని రద్దు చేసి పడేశారు ట్రంప్. ఒక్కమాటైనా తన సెక్యూరిటీ అడ్వైజర్‌ని అడగలేదు. ‘అదేంటి మిస్టర్ ప్రెసిడెంట్ అలా మాట ఇచ్చేశారు’ అని అడ్వైజర్ అడిగితే.. ‘ఈ వార్ గేమ్స్ (విన్యాసాలు) ఎందుకు? అనవసరమైన ఖర్చు కాకపోతే’ అన్నారట ట్రంప్. ఆ మాటను ట్రంప్ పదవి దిగి వెళ్లిపోయాక ‘ట్రంప్ టేక్స్ ఆన్ ది వరల్డ్’ సీరీస్ డైరెక్టర్‌తో షేర్ చేసుకున్నారు జాన్ బోల్టన్. కిమ్‌ని ‘రాకెట్ మ్యాన్’ అని, ఉత్తర కొరియాను ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’ అని ముద్దు చేసేవారు ట్రంప్. ఆ విషయాలూ ఈ మూడో ఎపిసోడ్ డాక్యుమెంటరీలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సీరిస్ ముగుస్తున్నా.. ఎప్పటికీ ముగింపు ఉండనన్ని కోణాల్ని ట్రంప్‌లో లేకుండా అయితే పోవు.
Comments
Please login to add a commentAdd a comment