Wanna cry
-
విండోస్ 2017
కొన్ని తీపి గురుతులు.. మరికొన్ని చేదు గుళికలు.. ఎన్నో మధుర స్మృతులు.. మరెన్నో పీడ కలలు.. మొత్తంగా 2017 ఎన్నో జ్ఞాపకాలను మిగులుస్తూ వీడ్కోలుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో 2017కి వీడ్కోలు పలికి 2018 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో గడిచిన 2017లో దేశంలోనూ, ప్రపంచంలోనూ చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు, పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ మేలో ప్రపంచాన్ని వాన్నాక్రై వణికించింది.150 దేశాల్లో విండోస్ ఓఎస్ ఉపయోగించే కంప్యూటర్లు, సంస్థలు లక్ష్యంగా సైబర్ దాడులు సాగాయి. ఈ కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని తిరిగి ఇచ్చేందుకు బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీతో చెల్లింపులు చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారు. వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా సైనిక పాలకుడు కిమ్ జోంగ్–ఉన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ చర్యలతో ట్రంప్, కిమ్ మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. ట్రంప్ హెచ్చరికలు.. కిమ్ ప్రతి హెచ్చరికలతో ఇరుదేశాల మధ్యా యుద్ధ వాతావరణం నెలకొంది. జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికాను మరోసారి శక్తివంతమైన, సంపన్న దేశంగా మారుస్తానంటూ వాగ్దానం చేశారు. అధికారాన్ని చేపట్టిన కొద్ది కాలంలోనే తన వ్యవహారశైలి, మాట్లాడే ధోరణి, ముఖ్యమైన సమస్యలపై స్పందించే తీరుతో ట్రంప్ అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. 37 ఏళ్ల పాటు జింబాబ్వే అధ్యక్షుడిగా ఉన్న రాబర్ట్ ముగాబేకు రాజకీయ చరమాంకంలో చేదు అనుభవం ఎదురైంది. సైనిక తిరుగుబాటు ద్వారా ఆయన బలవంతంగా రాజీనామా చేసే వరకు పరిస్థితులు దారితీశాయి. తన భార్య గ్రేస్ ముగాబేను తొలుత ఉపాధ్యక్షురాలిని చేసి, తన తర్వాత అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టాలని ముగాబే చేసిన ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత దీనికి కారణమైంది. ఆరురోజుల పాటు దిగ్బంధం ఫలితంగా ఆ దేశ తర్వాతి అధ్యక్షుడిగా ఎమార్సన్ నాన్‌గాగ్వా బాధ్యతలను స్వీకరించారు. పనామా పేపర్ల పేరిట జర్మనీ వార్తాపత్రిక విడుదల చేసిన లక్షలాది పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తల సందేహాస్పద ఆర్థిక వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఈ వివాదాల్లో చిక్కుకున్న వారిలో ఎలిజబెత్ రాణి–2 మొదలుకుని, బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఐర్లాండ్‌కు చెందిన పాల్ డేవిడ్ హ్యూసన్(బోనో) తదితరులున్నారు. ఆగస్టు చివర్లో మయన్మార్‌లో రోహింగ్యాలపై అక్కడి సైన్యం హత్యాకాండతో బంగ్లాదేశ్ తదితర దేశాలకు పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా దాడుల బారిన పడిన తెగగా రోహింగ్యాలను పరిగణిస్తున్నారు. రోహింగ్యా శరణార్థుల సమస్యకు ఇంకా ఎలాంటి పరిష్కారం లభించలేదు. దేశ 14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ జూలై 17న, 13వ ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు ఆగస్ట్ 5న ఎన్నికయ్యారు. వారు వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు మీరాకుమార్, గోపాలకృష్ణ గాంధీని ఓడించారు. బీజేపీ నేపథ్యమున్న మొదటి రాష్ట్రపతిగా కోవింద్(72) చరిత్రకెక్కారు. బిహార్ గవర్నర్‌గా పనిచేసిన కోవింద్‌కు 65 శాతం ఓట్లు లభించాయి. వరుసగా దాదాపు 19 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన వెంకయ్య ఆ సభకే అధ్యక్షుడయ్యారు. 1997లో నాసా ప్రయోగించిన కాసిని అంతరిక్షనౌక 2004లో శనిగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. నాలుగున్నర లక్షల ఉపగ్రహ చిత్రాల ద్వారా విలువైన సమాచారాన్ని అందించింది. 2017 సెప్టెంబర్ 15న సేవలు చాలించింది. అక్టోబర్ 1న లాస్వేగాస్లో ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకుని స్టీఫెన్ పాడాక్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 58 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్ష ప్రకటన. దాదాపు 7 దశాబ్దాల పాటు అగ్రరాజ్యం అనుసరించిన వైఖరికి భిన్నంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో పశ్చిమాసియాలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాను ‘హరికేన్ హార్వే’ అల్లాడించింది. దీని ధాటికి టెక్సాస్ తదితర ప్రాంతాల్లో 90 మంది వరకు చనిపోవడంతో పాటు దాదాపు 200 బిలియన్ డాలర్లపై చిలుకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఏడాది బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. గోవా, మణిపూర్‌లో సగానికన్నా ఎక్కువ సీట్లు రాకున్నా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. పంజాబ్‌లో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి కష్టం మీద మెజారిటీ సంపాదించింది. ఐదేళ్ల కాంగ్రెస్ పాలన సాగిన హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జూలై 1న ఏకీకృత పన్నుల విధానం జీఎస్టీ అమలులోకి వచ్చింది. ప్రధాని మోదీ ‘గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్’ అని పిలిచిన జీఎస్టీ కేంద్ర, రాష్ట్రాలు వసూలు చేస్తున్న 15 రకాల పన్నులు, సుంకాల స్థానంలో జీడీపీని పెంచే సాధనంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో దాదాపు రెండు దశాబ్దాలు కొనసాగిన సోనియాగాంధీ ఆరోగ్య కారణాలతో వైదొలిగారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సోనియా కుమారుడు రాహుల్‌గాంధీ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేపట్టిన నెహ్రూ–గాంధీ కుటుంబంలో ఆయన ఆరో సభ్యుడిగా చరిత్రకెక్కారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో రాజకీయ బంధం తెంచుకున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేసిన వెంటనే అప్పటి వరకూ శత్రువైన బీజేపీతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కొన్ని నెలలుగా ఈ పరిణామం జరుగుతుందని ఊహించినా నితీశ్ చూపిన తెగువ, వేగం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ముస్లిం సమాజంలో మహిళలకు వారి భర్తలు ఇచ్చే ముమ్మారు తలాక్ పద్ధతి చెల్లదని ఈ ఏడాది ఆరంభంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సంచలనం సృష్టించిన ఈ తీర్పు అమలుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ముమ్మారు తలాక్‌ను రద్దు చేస్తూ ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లు రూపొందించింది. లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాక చట్టం కావడానికి అడ్డంకులేవీ ఉండవు. 1962లో యుద్ధానికి దిగిన ఆసియా పెద్దన్నలు ఇండియా, చైనా మధ్య జూన్ 16 నుంచి కొన్ని నెలలపాటు పశ్చిమ భూటాన్‌లోని వివాదాస్పద ప్రాంతమైన డోక్లామ్ పీఠభూమిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తత ముదిరి రెండోసారి రెండు పెద్ద దేశాల మధ్య పోరుకు దారితీస్తుందేమోననే భయాందోళనలు తలెత్తాయి. డోక్లామ్ ప్రాంతంలోకి చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఈ వివాదం రాజుకుంది. చివరికి నిర్మాణం ఆపేసిన చైనాకు, భారత్‌కు మధ్య ఉద్రిక్తత సడలించడానికి ఆగస్ట్ 28న అవగాహన కుదిరింది. ఇస్రోకు మరిచిపోలేని విజయాలు అందించిన సంవత్సరం ఇది. ఇస్రో తన ఉపగ్రహవాహక నౌక(పీఎస్ఎల్వీ) ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఫిబ్రవరి 15న 714 కిలోల ఉపగ్రహం కార్టోస్టాట్–2ను మరో 103 ఉపగ్రహాలతోపాటు ఇస్రో ప్రయోగించింది. బెంగళూరుకు చెందిన ప్రసిద్ధ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్య దేశంలో కుచించుకుపోతున్న భావ ప్రకటనా స్వాతంత్య్రానికి, పత్రికా స్వేచ్ఛకు అద్దం పట్టింది. సెప్టెంబర్ 5 సాయంత్రం ఇంటి దగ్గరే గౌరిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అవినీతి, నియంతృత్వ పోకడలను ప్రతిఘటించే గౌరీ లంకేశ్ పత్రిక నడుపుతున్నారు. వివిధ రంగా ల్లో ప్రముఖులు తమ కింద పనిచేసే మహిళలపై సాగించిన లైంగిక వేధింపులు, దోపిడీకి వ్యతిరేకంగా పాశ్చాత్య ప్రపంచం లో ఆలిసా మిలానో అనే స్త్రీ ప్రారంభించిన ‘నేను సైతం’ ఉద్యమంలో వేలాది మంది భారత మహిళలు పాల్గొన్నారు. -
రాజధానిలో ర్యాన్సమ్వేర్ దాడి!
మూడు సంస్థల కంప్యూటర్లు లాక్ - 23 వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ - చెల్లించకపోవడంతో డేటా మొత్తం క్రాష్ - దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికించిన ర్యాన్సమ్వేర్ వైరస్ ప్రభావం రాజధానిపైనా పడింది. జూబ్లీహిల్స్ కేంద్రంగా పనిచేసే మూడు సంస్థల్ని టార్గెట్‌గా చేసుకున్న సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను స్తంభింపజేశారు. హ్యాకర్స్ డిమాండ్ చేసిన 23వేల డాలర్లు (సుమారు రూ.16.13 లక్షలు) చెల్లించకపోవడంతో మూడు సంస్థలకు చెందిన డేటామొత్తాన్నీ క్రాష్ చేశారు. దీనిపై సోమవారం ఫిర్యాదు అందుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ–మెయిల్స్ ద్వారా వైరస్! మోర్ వీసాస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓప్లెంటస్ ఓవర్సీస్ గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు జూబ్లీహిల్స్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలూ విదేశీ ఉద్యోగాలకు వెళ్లేవారికి వీసాలు ఇప్పించడంతో పాటు ఇమిగ్రేషన్ సంబంధిత వ్యవహారాల సేవలు అందిస్తున్నాయి. వీటికి అనుబంధ సంస్థయిన చెవ్రోన్నే సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్స్ అభివృద్ధి, ఈఆర్పీ, ఈ–బిజినెస్‌లకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. కాగా, శుక్రవారం ఈ సంస్థల సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా ర్యాన్సమ్వేర్ ఎటాక్ జరిగింది. ర్యాన్సమ్వేర్ వైరస్‌లను హ్యాకర్లు ఈ–మెయిల్ రూపంలో పంపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వైరస్ కంప్యూటర్లలోకి ప్రవేశించిన మరుక్షణం వాటిలో ఉన్న డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్ అయ్యి సిస్టమ్స్, సర్వర్ లాక్ అయిపోయాయి. అపరిచిత మెయిల్స్‌తో జాగ్రత్త... ‘వాన్నాక్రై’వైరస్ ప్రకంపనల నేపథ్యంలో నగరంలోని సంస్థల పైనా ర్యాన్సమ్వేర్ దాడులు జరగడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దాడి ఎక్కడ నుంచి జరిగింది? సైబర్ నేరగాళ్లు ఏ విధానంలో డబ్బు చెల్లించిమని చెప్పారు? తదితర అంశాలను సైబర్ కాప్స్ ఆరా తీస్తున్నారు. పటిష్టమైన వ్యవస్థ లేకుంటే ర్యాన్సమ్వేర్ సమస్యకు పరిష్కారం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్ కీ ఏర్పాటు చేయరని, దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ వారు అడిగినంత చెల్లించాల్సి రావడమో, డేటా కోల్పోవడమో జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ తరహాలో నేరాలు చేసేవాళ్లు బోగస్ సర్వర్లు, ఐపీ అడ్రస్‌లు వినియోగిస్తారని, దీంతో అలాంటి వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ–మెయిల్స్, అనుమానాస్పద యాడ్స్‌కు దూరంగా ఉండటం, కంప్యూటర్లో పటిష్టమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు. గంటలోనే డేటా అంతా తుడిచేశారు డేటా ఎన్క్రిప్షన్ నాన్–సెమెట్రిక్ విధానంలో జరగడంతో ‘ప్రైవేట్ కీ’ని ట్రాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. సైబర్ నేరగాళ్లు ఈ మూడు సంస్థల ఎన్క్రిప్టెడ్ డేటాను డీక్రిప్ట్ చేయడానికి 25వేల డాలర్లు డిమాండ్ చేశారు. ఓ సంస్థ నుంచి 9 వేల డాలర్లు, మిగిలిన రెండింటినీ 6 వేల డాలర్ల చొప్పున చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. దీనికి ఆయా సంస్థల యాజమాన్యాలు అంగీకరించకపోవడంతో గంటలోనే కంప్యూటర్లలో డేటాను హ్యాకర్లు క్రాష్ చేసేశారు. ప్రస్తుతం డేటా రిట్రీవ్ చేసే స్థి«తిలో కూడా లేకుండా పోయింది. సంస్థల ప్రతినిధులు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వాన్నా క్రై తర్వాత ఇప్పుడు ‘ఎటర్నల్ రాక్స్’!
న్యూయార్క్: ‘ఎటర్నల్ రాక్స్’ అనే కొత్త కంప్యూటర్ వైరస్‌ను పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఇది కూడా వాన్నా క్రై లాగానే విండోస్ సిస్టమ్స్‌పైనే దాడి చేస్తుందని తెలిపారు. వాన్నాక్రై విండోస్ సిస్టమ్స్‌పై దాడి చేసేందుకు ఆయా కంప్యూటర్లలోని ఏయే కాన్ఫిగరేషన్స్ కారణమయ్యాయో, అలాంటి కాన్ఫిగరేషన్స్ ఉన్న కంప్యూటర్లనే ఎటర్నల్ రాక్స్ కూడా లక్ష్యంగా చేసుకుంటుందని వారు చెప్పారు. వాన్నా క్రై కన్నా ఈ వైరస్ మరింత బలమైనదనీ, దీనిని ఎదుర్కోవడం కష్టమని పరిశోధకులు పేర్కొన్నారు. వాన్నా క్రై లాగానే ఎటర్నల్ రాక్స్ కూడా ఇతర కంప్యూటర్లకు వ్యాప్తి చెందడానికి ఎటర్నరల్ బ్లూ అనే ఎన్ఎస్ఏ టూల్‌నే ఉపయోగించుకుంటుందనీ, ఆరు ఇతర ఎన్ఎస్ఏ టూల్స్‌ని కూడా వాడుకుంటుందని పరిశోధకులు వివరించారు. -
మరింత భయపెడుతున్న కొత్త మాల్వేర్!!
నిన్న మొన్నటి వరకు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన 'వాన్న క్రై' రాన్సమ్వేర్ కథ ముగిసిందో లేదో.. అంతలోనే మరో సరికొత్త మాల్వేర్ వచ్చింది. దానిపేరు ఇటర్నల్ రాక్స్. ఇది వాన్న క్రై కంటే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎదుర్కోవడం ఇంకా కష్టం అవుతుందంటున్నారు. ఇది ఇటర్నల్ బ్లూ అనే ఎన్ఎస్ఏ టూల్‌ను ఉపయోగించుకుని ఒక కంప్యూటర్ నుంచి మరోదానికి విండోస్ ద్వారా వ్యాపిస్తుంది. దాంతోపాటు ఇటర్నల్ చాంపియన్, ఇటర్నల్ రొమాన్స్, డబుల్ పల్సర్ అనే మరికొన్ని ఎన్ఎస్ఏ టూల్స్‌ను కూడా ఇది ఉపయోగించుకుంటుందని ఫార్చూన్ పత్రిక తెలిపింది. ప్రస్తుతానికి ఇటర్నల్ రాక్స్‌లో ఎలాంటి ప్రమాదకరమైన అంశాలు లేవని, అది ఫైళ్లను లాక్ చేయడం లేదా కరప్ట్ చేయడం లాంటివి జరగడం లేదని అంటున్నారు. అయితే, ఇటర్నల్ బ్లూ మాత్రం ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్ను ఉపయోగించుకుని రిమోట్ కమాండ్ల ద్వారా ఇతర కంప్యూటర్లను కూడా ఏ సమయంలోనైనా నాశనం చేస్తుంది. భారతదేశంతో సహా దాదాపు 150 దేశాల మీద దాడి చేసిన వాన్న క్రై రాన్సమ్వేర్ దాదాపు 2.40 లక్షల కంప్యూటర్లలోకి వ్యాపించింది. ఇది ప్రధానంగా విండోస్ 7 అప్డేటెడ్ వెర్షన్లున్న కంప్యూటర్లకే ఇది అంటుకుంది. ఒకసారి ఈ రాన్సమ్వేర్ కంప్యూటర్లోకి ప్రవేశించిందంటే మొత్తం ఫైళ్లన్నీ ఎన్‌క్రిప్ట్ అయిపోతాయి. వాటిని అన్‌లాక్ చేయడానికి వాళ్లు చెప్పిన మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చేది. దానికంటే ఇటర్నల్ రాక్స్ అనేది మరింత బలమైనదని చెబుతున్నారు. వాన్న క్రైని అడ్డుకోడానికి ఒక కిల్ స్విచ్ ఉంది గానీ, దీనికి అది కూడా లేదు. ఇప్పటివరకు ఇది ఎంతవరకు వ్యాపించిందో ఇంకా తెలియదు గానీ, ఎన్ఎస్ఏ ఆధారిత మాల్వేర్లో ఇది కొత్త తరహా అని అంటున్నారు. గడిచిన పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు రకాల సైబర్ దాడులు జరుగుతున్నాయి. -
‘వాన్నక్రై’కి వచ్చింది రూ. 53 లక్షలేనా!
-
‘వాన్నక్రై’కి వచ్చింది రూ. 53 లక్షలేనా!
ప్రపంచంలో గత వారం రోజులుగా ‘వాన్నక్రై రాన్సమ్వేర్’ వైరస్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అయితే ఈ దాడిలో సైబర్ నేరస్థులు లాభపడింది మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటివరకు 82 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 52.85 లక్షలు) మాత్రమే నేరస్థులకు చేరినట్లు నేర పరిశోధకులు కనుగొన్నారు. ఈ సైబర్ దాడికి బాధ్యులైన వారిని కూడా త్వరలో పట్టుకోగలమని చెబుతున్నారు. గతంలో జరిగిన ‘కిప్టోవాల్’ సైబర్ దాడిలో నేరస్థులు 32.5 కోట్ల డాలర్లు ఆర్జించారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినంత వరకు ‘వాన్నక్రై’ కచ్చితంగా నేరమే. వైరస్ ద్వారా ఫైళ్లను తమ నియంత్రణలో ఉంచుకొని అడిగినంత డబ్బు చెల్లిస్తేనే రహస్య ఎన్క్రిప్షన్ కీ ద్వారా విడుదల చేస్తున్నందున ఇది నేరమేనని అంతర్జాతీయ సైబర్ నిఘా ఏజెన్సీలు తెలియజేస్తున్నాయి. బ్యాకప్ ఫైళ్లకు అవకాశం లేని వ్యక్తులు, చిన్న వ్యాపారస్థులనే ఎక్కువగా టార్గెట్ చేయడం వల్ల వాన్నక్రై నేరస్థులకు వాళ్లు ఆశించినంత ఎక్కువ డబ్బు ముట్టలేదట. బ్రిటన్‌లోని జాతీయ ఆరోగ్య స్కీమ్‌కు సంబంధించిన అతిపెద్ద నెట్‌వర్క్‌ను టార్గెట్ చేసినా, బ్యాకప్ ఫైళ్లు తమకు అవసరం లేదని నిర్వాహకులు వదిలేయడం వల్ల కూడా నేరస్థులు పెద్దగా లాభపడలేదు. డబ్బులు ఎక్కడి నుంచి ఎలా బదిలీ అవుతున్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అంతిమంగా ఎక్కడికి చేరుతాయో గుర్తించడం ద్వారా నేరస్థులను అరెస్ట్ చేయగలమని అంతర్జాతీయ సైబర్ నేరాల పరిశోధన సంస్థలు తెలియజేస్తున్నాయి. -
మరో ర్యాన్సమ్వేర్!
బీజింగ్: వాన్నా క్రై ర్యాన్సమ్వేర్ ముప్పు తొలగిపోక ముందే మరో ర్యాన్సమ్వేర్ వెలుగుచూసింది. యూఐడబ్ల్యూఐఎక్స్ అనే మాల్వేర్ను తాము గుర్తించామని చైనా నేషనల్ కంప్యూటర్ వైరస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(సీవీఈఆర్సీ) బుధవారం తెలిపింది. ‘ఇది వాన్నా క్రై మాదిరే వ్యాపిస్తోంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని బగ్ సాయంతో కంప్యూటర్లలోకి చొరబడుతోంది. ఎన్క్రిప్షన్ తర్వాత ఫైళ్ల పేర్లను మారుస్తోంది. మార్పు తర్వాత ఫైళ్ల పేర్ల చివరన ‘.యూఐడబ్ల్యూఐఎక్స్’ అని కనిపిస్తుంది’ అని సంస్థ ఉన్నతాధికారి చెన్ జియాన్మిన్ తెలిపారు. సమస్యను ఎదుర్కోవడానికి మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ అప్డేట్ను జారీ చేసిందన్నారు. అయితే ఈ కొత్త వైరస్ చైనాలో ఉన్నట్లు నిర్ధారణ కాలేదని, దీన్ని సీవీఈఆర్సీ విశ్లేషిస్తోందని ప్రభుత్వ వార్తా సంస్థ జినువా వెల్లడించింది. -
‘వాన్నా క్రై’.. లాజరస్ గ్రూప్ పనే!
-
హైదరాబాద్‌ను వణికిస్తున్న కొత్త వైరస్
-
వనా క్రైమ్..!
-
‘వాన్నా క్రై’.. లాజరస్ గ్రూప్ పనే!
లండన్/న్యూఢిల్లీ/ముంబై: సైబర్ ప్రపంచాన్ని వణికిస్తున్న ర్యాన్సమ్వేర్ వాన్నా క్రై.. గతంలోనూ ఇలాంటి వైరస్‌లను పంపిన లాజరస్ గ్రూప్ పనేనని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. వాన్నా క్రై పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడింది ఉత్తర కొరియాకు చెందిన లాజరస్ గ్రూపే కావొచ్చని గూగుల్ సెక్యూరిటీ రీసెర్చర్ నీల్ మెహతా తెలిపారు. వాన్నా క్రై సాఫ్ట్‌వేర్‌కు గతంలో లాజరస్ సృష్టించిన హ్యాకింగ్ టూల్స్‌కు మధ్య పోలికలు ఉన్నాయని చెప్పారు. ఒరిజినల్ వాన్నా క్రై కోడ్‌లోని అంకెలు, అక్షరాలు, సొమ్ము చెల్లించాలన్న హెచ్చరికలోని ఇంగ్లిష్ పదాల ప్రయోగం చూస్తే అది వేరే భాషలో రాసిన వాక్యాలను కంప్యూటర్ ద్వారా అనువదించినట్లు తెలుస్తోందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అలన్ వుడ్‌వర్డ్ అన్నారు. ర్యాన్సమ్వేర్ దాడితో వసూలు చేసింది 60 వేల డాలర్లేనని బిట్‌కాయిన్ సంస్థ చెబుతోంది. మన ‘ఐటీ’పై ప్రభావం లేదు: భారత్ వాన్నాక్రై ర్యాన్సమ్వేర్ వైరస్ భారత ఐటీ వ్యవస్థపై ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేదని ప్రభుత్వం తెలిపింది. ‘మాల్వేర్ ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి సంబంధించిన 18 కంప్యూటర్లకు, కేరళ పంచాయతీ కంప్యూటర్లకు సోకడం వంటి ఐదారు విడివిడి ఉదంతాలకే పరిమితమైంది. ఐటీని కుదేలు చేసినట్లు సమాచారమేదీ రాలేదు. వివిధ సంస్థలతో కూడిన బృందం పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తోంది’ అని ఐటీ కార్యదర్శి అరుణా సుందరరాజన్ మంగళవారం తెలిపారు. భారత్‌లో వాన్నాక్రై ర్యాన్సమ్వేర్ దాడులకు 48వేల ప్రయత్నాలు జరిగాయని, వీటిలో ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్నట్లు గుర్తించామని సైబర్ భద్రత సంస్థ క్విక్ హీల్ టెక్నాలజీస్ తెలిపింది. -
పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్‌కు పైరేట్స్ దెబ్బ!
'డిస్నీ' హాలీవుడ్ భారీ నిర్మాణ సంస్ధ. ఇప్పుడు వాన్నా క్రై హ్యాకర్ల దెబ్బకు విలవిల్లాడుతోంది. డిస్నీ సంస్ధకు చెందిన సర్వర్లను వాన్నా క్రై హ్యాక్ చేసింది. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సంస్ధ సినిమాల ఒరిజినల్ ప్రింట్స్ హ్యాకర్ల చేతికి వెళ్లాయి. వాటిలో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్‌లో తర్వాతి భాగమైన డెడ్ మెన్ టెల్ నో టేల్స్ ఉంది. తాము కోరిన మొత్తాన్ని బిట్కాయిన్ల రూపంలో చెల్లించకపోతే డెడ్ మెన్ టెల్ నో టేల్స్ అనే సినిమాతో పాటు మరొకొన్ని సినిమాలను కూడా ఆన్లైన్లో రిలీజ్ చేస్తామని వాన్నా క్రై హెచ్చరించినట్లు తెలిసింది. వాన్నా క్రై డిమాండ్‌పై స్పందించిన డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబ్ ఐగర్ డబ్బును చెల్లించేందుకు నిరాకరించినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది. ఐగర్ నిర్ణయంపై స్పందించిన వాన్నా క్రై హ్యాకర్లు బిట్కాయిన్ల రూపంలో డాలర్లను చెల్లించకపోతే.. 20 నిమిషాల వ్యవధిలో సినిమాలన్నింటినీ ఆన్లైన్లో విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా, ఈ నెల 26వ తేదీన డెడ్ మెన్ టెల్ నో టేల్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పైరేట్స్ ఆప్ ది కరేబియన్‌కు భారత్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. హ్యాకర్ల హెచ్చరికలపై డిస్నీ ఎఫ్బీఐను డిస్నీ సంప్రదిస్తున్నట్లు తెలిసింది. వాన్నా క్రై కంప్యూటర్లను హ్యాక్ చేయడానికి ఉపయోగిస్తున్న లూప్‌హోల్‌ను తొలగిస్తూ మైక్రోసాఫ్ట్ కొత్త అప్‌గ్రేడ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
భారత్‌పై ప్రభావం లేదు
అయినా ‘వాన్నా క్రై’పై అప్రమత్తంగానే ఉన్నాం - ఫైర్‌వాల్స్ భద్రతతో వ్యవస్థ పదిలమే: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ - ఇంకా ర్యాన్సమ్వేర్ ముప్పు తొలగలేదని నిపుణుల హెచ్చరిక న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన ‘వాన్నా క్రై’ ర్యాన్సమ్వేర్.. భారత్‌పై పెద్దగా ప్రభావం చూపలేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. కేరళ, ఆంధ్రప్రదేశ్ మినహా పెద్ద నష్టమేమీ జరగలేదని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నడిచే కంప్యూటర్లన్నీ వైరస్ ప్రభావం లేకుండా సాఫీగా పనిచేస్తున్నట్లు వివరించారు. విద్యుత్, జీఎస్టీ నెట్వర్క్ సహా పలు ప్రభుత్వ విభాగాలు కూడా తమ వ్యవస్థలు భద్రంగానే ఉన్నాయని స్పష్టం చేశాయి. ‘ఇతర దేశాల్లాగా భారత్‌పై ర్యాన్సమ్వేర్ ప్రభావం పెద్దగాలేదు. అయినా మేం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. బ్యాంకింగ్ సహా పలు ప్రభుత్వ విభాగాలను సైబర్ దాడుల నేపథ్యంలో మరింత దుర్భేద్యంగా మార్చాం’ అని రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో వెల్లడించారు. ర్యాన్సమ్వేర్తో సంబంధం లేకుండానే మార్చినుంచే ప్రభుత్వ వ్యవస్థలోని అన్ని కంప్యూటర్లలో ప్యాచ్ (కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో, భద్రతలో ఉండే లోపాలను సరిదిద్దే సాఫ్ట్వేర్)లు ఇన్స్టాల్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. అటు భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్–ఇన్) కూడా సైబర్ దాడి ప్రభావం నామమాత్రంగానే కనిపించిందని.. ఇంతవరకు ఎలాంటి భారీ నష్టం వాటిల్లిన ఘటనలు తమ దృష్టికి రాలేదని వెల్లడించిం ది. కాగా, గుజరాత్, పశ్చిమబెంగాల్లోని వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల కంప్యూటర్లపై వాన్నా క్రై దాడి జరిగినట్లు తెలిసింది. అయితే రోజువారీ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం వాటిల్లలేదని మమత సర్కారు వెల్లడించింది. మేం భద్రమే.. జీఎస్టీఎన్: ర్యాన్సమ్వేర్ ప్రభావం లేకుండా ప్రత్యేక ఫైర్‌వాల్ భద్రతను ఏర్పాటుచేసుకున్నట్లు సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ పవర్ గ్రిడ్ వెల్లడించింది. ఉద్యోగులు అనవసర మెయిల్స్‌ను ఓపెన్ చేయవద్దని ఆదేశించింది. కీలకమైన జీఎస్టీ వ్యవస్థపై ఈ వైరస్ ప్రభావం ఉండదని జీఎస్టీనెట్వర్క్ వెల్లడించింది. జీఎస్టీ వ్యవహారాలు మైక్రోసాఫ్ట్‌పై కాకుండా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై కొనసాగుతున్నందున సమస్యేమీ లేదని జీఎస్టీఎన్ సీఈవో ప్రకాశ్ కుమార్ తెలిపారు. భారత్‌లో పైరసీ విచ్చలవిడిగా పెరిగిపోవటం, లైసెన్స్ లేని సాఫ్ట్వేర్ వినియోగం భారీ నష్టానికి సంకేతాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముప్పు తొలగిపోలేదు యూరప్, అమెరికా, రష్యాల్లో సోమవారం సంస్థలు, కంపెనీల పనులు ప్రారంభం కాగానే వాన్నా క్రై నష్టం భారీగా కనిపించింది. ఇప్పటికే వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా, తాజా సైబర్ దాడి ప్రభుత్వాలకు మేలుకొలుపని మైక్రోసాఫ్ట్ తెలిపింది. విండోస్ ఎక్స్‌పీకి సబంధించిన అప్డేట్ను ‘మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ బులెటిన్ ఎమ్ఎస్17–010’ పేరుతో మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. చైనాలో ప్రభుత్వ ఏజెన్సీలు సహా 30వేల ప్రైవేటు సంస్థలకు చెందిన లక్షల సంఖ్యలో కంప్యూటర్లు వాన్నా క్రై బారిన పడ్డాయని క్విహూ360 అనే చైనా యాంటీవైరస్ సంస్థ చెప్పింది. పలు ఏటీఎంల మూసివేత ర్యాన్సమ్వేర్ దాడి నేపథ్యంలో పాత మైక్రోసాఫ్ట్ ఓఎస్ వాడుతున్న ఏటీఎంలను బ్యాంకులు ముందస్తుగా మూసివేయనున్నట్లు తెలిసింది. సెర్ట్–ఇన్ హెచ్చరికలతో పాత ఓఎస్ ఉన్న వ్యవస్థలను మూసేయాలంటూ ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో 2.2లక్షల ఏటీఎం లుండగా.. వీటిలో కొన్ని మాత్రమే విండోస్ ఎక్స్‌పీతో నడుస్తున్నాయి. -
ప్రపంచాన్ని ఏడిపిస్తోంది!
► 100 దేశాలపై సైబర్ దాడి ► బ్రిటన్ నుంచి భారత్ వరకూ ‘వనా క్రై’ ప్రభావితం ► పెద్ద సంఖ్యలో కంప్యూటర్లకు వనా క్రై ర్యాన్సమ్వేర్ వైరస్ ► 300 డాలర్లు చెల్లిస్తే వదిలేస్తామంటూ డిమాండ్ ► బ్రిటన్‌లో కుదేలైన వైద్య వ్యవస్థ.. అత్యవసర ఆపరేషన్లూ రద్దు ► జర్మనీ, స్పెయిన్లలో తీవ్ర నష్టం ► పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు కంప్యూటర్లూ హ్యాక్ ► ఇప్పటివరకూ 20 వేల డాలర్ల వసూళ్లు.. తిప్పికొట్టేందుకు నిపుణుల కృషి (సాక్షి నాలెడ్జ్ సెంటర్) సైబర్ దొంగలు ప్రపంచంపై పంజా విసిరారు. భారత్ సహా దాదాపు వంద దేశాల్లోని లక్షలాది కంప్యూటర్లను హ్యాక్ చేశారు. వాటిల్లోని డేటా మొత్తానికీ తాళం (ఎన్‌క్రిప్ట్) వేసేశారు. దానిని తీయాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం వారు ఉపయోగించిన ఆయుధం ‘వనా క్రై’ అనే వైరస్. ఈ వైరస్ వాస్తవంగా సృష్టించినది అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ). సైబర్ దొంగలు ఆ వైరస్‌ను తస్కరించి ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లపై దాడి చేశారు. వారి బారినపడి బ్రిటన్‌లో చాలా ఆస్పత్రులు చికిత్స కోసం వచ్చిన రోగులను చేర్చుకోకుండా తిప్పిపంపాల్సి వచ్చింది. ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు ఆపరేషన్లు, చికిత్సలు నిలిచిపోయాయి. జర్మనీలో రైళ్ల రాకపోకలు తెలియకుండా పోయాయి. స్పెయిన్‌లో టెలికమ్యూనికేషన్లు, గ్యాస్ వ్యవస్థలకు అంతరాయం కలిగింది. రష్యాలో బ్యాంకులు ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వ కంప్యూటర్లు వెయ్యికి పైగా మూగబోయాయి. చైనాలో కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఇబ్బందులపాలయ్యాయి. ఉత్తరకొరియాలోని ఆస్పత్రులూ ఇక్కట్లపాలయ్యాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో 18 పోలీస్స్టేషన్లలో కంప్యూటర్లు స్తంభించిపోయాయి. సైబర్ భద్రత చరిత్రలోనే ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. శుక్రవారం మొదలైన ఈ సైబర్ దాడి కొన్ని గంటల్లోనే ప్రపంచ దేశాలకు విస్తరించింది. శనివారం మధ్యాహ్నానికి ఉధృతి కొంచెం నెమ్మదించింది. అయినా ఇంకా ముప్పు తొలగిపోలేదు. ఈ దాడి తమ పనేనని ఇంతవరకూ హ్యాకర్లెవరూ ప్రకటించలేదు. వనా క్రై దాడిని తిప్పికొట్టేందుకు ప్రపంచ దేశాల్లో సైబర్ భద్రతా నిపుణులు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. ‘విండోస్’లోని లోపాల ఆధారంగా.. ‘వనా క్రై’లేదా ‘వనా డిక్రిప్టర్’అనే ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ–మెయిల్ అటాచ్మెంట్లు, ఇతర ఫైళ్లు, డౌన్లోడ్ల ద్వారా కంప్యూటర్లలోకి ప్రవేశిస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న లోపాల ఆధారంగా ఇది కంప్యూటర్ను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. కంప్యూటర్లోని సమాచారం (డేటా.. ఫైళ్లు) మొత్తానికి తాళం (ఎన్‌క్రిప్ట్) వేస్తుంది. దానిని తీయాలంటే 300 డాలర్ల విలువైన బిట్‌కాయిన్స్ (డిజిటల్ వర్చువల్ కరెన్సీ) చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఆ మొత్తం చెల్లించినా ఫైళ్ల తాళం తెరుచుకుంటుందన్న (డీక్రిప్ట్ అవుతుందన్న) గ్యారెంటీ లేదు. తొలుత స్వీడన్లో.. శుక్రవారం మొదట స్వీడన్లో ఈ ర్యాన్సమ్వేర్ సైబర్ దాడి వెలుగులోకి వచ్చింది. తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్‌లకు పాకింది. చాలా వేగంగా శుక్రవారం సాయంత్రానికే 100 దేశాలకు విస్తరించింది. శనివారం ఉదయానికి యూరప్, ఆఫ్రికా దేశాలతో పాటు మధ్య ఆసియా, అరబ్ దేశాలు, రష్యా, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా దేశాల్లో వైరస్ విస్తృతి పెరిగింది. శనివారం సాయంత్రానికి విస్తృతి తగ్గడంతో పాటు ఆ సమయంలో ఆసియా దేశాలకు రాత్రి సమయం కావడంతో.. భారత్ సహా ఆసియా దేశాల్లో దీని ప్రభావం కొంచెం తక్కువగా ఉంది. వైరస్ దాడిని తొలుత గుర్తించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా 75,000 దాడులు నమోదైనట్లు సైబర్ భద్రతా రంగ సంస్థ అవాస్ట్ వెల్లడించింది. గత 24 గంటల్లో లక్షకుపైగా కంప్యూటర్లు ఈ వైరస్ బారినపడినట్లు గుర్తించింది. బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, చైనా, ఇటలీ, ఈజిప్టు, ఇండియా సహా 99 దేశాల్లో 45,000కుపైగా దాడులను కాస్పర్స్కీ ల్యాబ్ సైబర్ భద్రతా నిపుణులు గుర్తించారు. బ్రిటన్ ఆస్పత్రులు అతలాకుతలం ప్రధానంగా ఈ ‘వనా క్రై’సైబర్ దాడి ప్రభావం బ్రిటన్‌లో చాలా ఎక్కువగా ఉంది. ఆ దేశ జాతీయ ఆరోగ్య వ్యవస్థ దాదాపు కుప్పకూలినంత పనైంది. వైరస్ కారణంగా కంప్యూటర్లు స్తంభించిపోవడంతో ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నానికి 40 ఎన్హెచ్ఎస్ వ్యవస్థలు వైరస్ బారిన పడ్డాయి. చికిత్స కోసం వస్తున్న రోగుల వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయడానికి వీలులేకపోవడంతో వారిని వేరే ఆస్పత్రులకు పంపేస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల వ్యాధులు, చికిత్సల వివరాలు కంప్యూటర్లలోనే ఉండిపోవడంతో చికిత్సలు నిలిచిపోయాయి. పాట్రిక్ వార్డ్ (47) అనే వ్యక్తి లండన్‌లోని సెయింట్ బార్తోలోమ్యూ ఆస్పత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయింది. ఇటువంటి ఉదంతాలు ఎన్నో నమోదయ్యాయి. అత్యవసర రోగులు, క్షతగాత్రులను తరలించడానికి బయల్దేరిన అంబులెన్సులు మధ్యలోనే వెనుదిరిగాయి. ఆ ఆస్పత్రుల్లో రోగుల వివరాలు, వారి వ్యాధులకు సంబంధించిన సమాచారం హ్యాకర్ల బారిన పడిందేమోనన్న సందేహాలు తలెత్తాయి. దీంతో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం, నిరసనలు పెల్లుబికాయి. ఆన్లైన్లో వ్యాపారం చేయడానికి బ్రిటన్ అతి సురక్షితమైన దేశంగా మారుస్తామని శుక్రవారం ప్రధాన మంత్రి థెరెసామే ప్రకటించగా.. తర్వాతి 24 గంటల్లోనే భారీ సైబర్ దాడి జరగడం ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది. మరెన్నో దేశాల్లో.. ‘వనా క్రై’సైబర్ దాడికి మూలం జర్మనీ రైల్వే వ్యవస్థ డ్యూషే బాన్‌లో ఉందని ప్రస్తుతానికి నిపుణులు భావిస్తున్నారు. ఆ వ్యవస్థ నిఘా సాంకేతిక పరిజ్ఞానం ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నది. రైల్వేస్టేషన్లలో టికెట్ మెషీన్లు పనిచేయలేదు. రైళ్ల రాకపోకల వివరాలు ప్రదర్శించే బోర్డులు నిలిచిపోయాయి. నేరస్తులను పట్టుకునేందుకు జర్మనీ ఫెడరల్ క్రైమ్ పోలీస్ సంస్థ బీకేఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇక స్పెయిన్‌లో టెలిఫోనికా సహా భారీ టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, గ్యాస్ సంస్థలు ఈ వైరస్ దాడికి గురయ్యాయి. ఫ్రాన్స్‌లో రెనాల్ట్ సంస్థలో ఉత్పత్తి ఆగిపోయింది. అమెరికాలో ప్రఖ్యాత కొరియర్ సంస్థ ఫెడెక్స్ వైరస్ తాకిడితో కుదేలైంది. రష్యాలోనూ వెయ్యికిపైగా కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయని ఆ దేశ హోంశాఖ తెలిపింది. రష్యా ప్రభుత్వ బ్యాంకులపైనా వైరస్ దాడి జరిగినప్పటికి దానిని అడ్డుకున్నామని ప్రకటించింది. ఇక ఉక్రెయిన్, ఇండియాల్లోనూ ‘వనా క్రై’దాడి ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్ పాత వెర్షన్లు అధికంగా ఉపయోగించే దేశాలు కావడం, వాటిలో తాజా అప్డేట్లు ఇన్స్టాల్ చేసుకునే అవకాశం తక్కువగా ఉండటం వైరస్ దాడికి ఎక్కువ అవకాశమిస్తోందని క్యాస్పర్‌స్కీ సంస్థ అభిప్రాయపడింది. ఇప్పటిదాకా 20 వేల డాలర్లు.. ‘వనా క్రై’దాడికి పాల్పడ్డ సైబర్ నేరగాళ్లు శనివారం సాయంత్రానికి తమ డిమాండ్ల ద్వారా 20,000 డాలర్లు వరకు వసూలు చేసినట్లు ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్న సైబర్ నిపుణులు గుర్తించారు. ఈ వైరస్‌తో సంబంధమున్న మూడు బిట్‌కాయిన్ ఖాతాలను, చిరునామాలను గుర్తించామని బిట్‌కాయిన్ అక్రమ లావాదేవీలను గుర్తించే ‘ఎలిప్టిక్’సంస్థ సహ వ్యవస్థాపకుడు టామ్ రాబిన్సన్ వెల్లడించారు. ఆ ఖాతాల నుంచి ఎవరైనా డబ్బు విత్‌డ్రా చేసుకుంటే ఈ దాడికి పాల్పడ్డ వారిని వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. అప్డేట్ చేసుకున్న వాళ్లు భద్రం: మైక్రోసాఫ్ట్ Ransom: Win32. WannaCrypt అనే మాలిసియస్ సాఫ్ట్వేర్ (వైరస్) దాడి నుంచి భద్రత కల్పించే సెక్యూరిటీ అప్డేట్ను తాము మార్చిలోనే అందించామని మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే వారు, విండోస్ అప్డేట్ చేసుకుంటూ ఉండేవారికి ఈ దాడి నుంచి భద్రత ఉందని స్పష్టం చేసింది. వినియోగదారులకు (ఈ సైబర్ దాడి నుండి) అదనపు భద్రత కల్పించేందుకు తాము కృషి చేస్తున్నట్లు ప్రకటించింది. స్తంభించిన ఏపీ పోలీసు కంప్యూటర్లు ఆంధ్రప్రదేశ్‌లోని పోలీస్స్టేషన్లలో దాదాపు 25 నుంచి 40 శాతం కంప్యూటర్లు కూడా ‘వనా క్రై’వైరస్ బారినపడినట్లు అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే ఏపీలోని పలు జిల్లాల్లో కంప్యూటర్లు మొరాయించి పోలీసు సేవలు స్తంభించాయి. శనివారం కూడా ఆ పరిస్థితి కొనసాగింది. తొలుత సాంకేతిక లోపమని భావించిన పోలీసు వర్గాలు.. హ్యాకింగ్ అంశం తెలియడంతో కంగుతిన్నారు. తొలుత చిత్తూరు జిల్లాలోని ఎనిమిది పోలీస్ స్టేషన్లలో కంప్యూటర్లు హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించారు. హ్యాకర్లు ఈ–మెయిల్ ద్వారా రాన్సమ్వేర్ వైరస్‌ను పంపగా.. దాన్ని డౌన్లోడ్ చేసిన వెంటనే కంప్యూటర్లు పనిచేయడం మానేశాయి. దీనిపై తిరుపతి వెస్ట్‌జోన్ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. ఇక చిత్తూరుతో పాటు కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లోని పోలీస్ కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురైనట్టు గుర్తించారు. నా సిస్టమ్ పదిలం: డీజీపీ తన కంప్యూటర్ ఐఓఎస్‌తో వాడుతున్నందున హ్యాకర్ల బారిన పడలేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ నండూరి సాంబశివరావు మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లోని పోలీస్ కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని, అయితే కీలక సమాచారమేదీ సైబర్ నేరగాళ్లకు చిక్కలేదని తెలిపారు. హ్యాకైన కంప్యూటర్లను సరిచేసేందుకు సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని.. ఏ సమాచారం హ్యాక్ అయినదీ త్వరలో గుర్తిస్తామని వెల్లడించారు. హ్యాకింగ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోలీస్స్టేషన్లలో కంప్యూటర్లను షట్‌డౌన్ చేసి పెట్టాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ వాటిని అలాగే ఉంచాలని డీజీపీ ఆదేశించారు. ఇక ఏపీలో హ్యాకింగ్ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఏపీ సీఐడీ డీజీ ద్వారక తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని పోలీస్ కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి, సమాచారమేదైనా తస్కరించారా? అన్న వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. కాగా తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో ఎనిమిది పోలీస్ కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. రోజువారీ కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేదని, మ్యాన్యువల్‌గా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని చెప్పారు.