భారత్‌పై ప్రభావం లేదు
అయినా ‘వాన్నా క్రై’పై అప్రమత్తంగానే ఉన్నాం
- ఫైర్‌వాల్స్ భద్రతతో వ్యవస్థ పదిలమే: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
- ఇంకా ర్యాన్సమ్‌వేర్ ముప్పు తొలగలేదని నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన ‘వాన్నా క్రై’ ర్యాన్సమ్‌వేర్.. భారత్‌పై పెద్దగా ప్రభావం చూపలేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. కేరళ, ఆంధ్రప్రదేశ్ మినహా పెద్ద నష్టమేమీ జరగలేదని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నడిచే కంప్యూటర్లన్నీ వైరస్ ప్రభావం లేకుండా సాఫీగా పనిచేస్తున్నట్లు వివరించారు. విద్యుత్, జీఎస్టీ నెట్‌వర్క్ సహా పలు ప్రభుత్వ విభాగాలు కూడా తమ వ్యవస్థలు భద్రంగానే ఉన్నాయని స్పష్టం చేశాయి. ‘ఇతర దేశాల్లాగా భారత్‌పై ర్యాన్సమ్‌వేర్ ప్రభావం పెద్దగాలేదు. అయినా మేం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.
బ్యాంకింగ్ సహా పలు ప్రభుత్వ విభాగాలను సైబర్ దాడుల నేపథ్యంలో మరింత దుర్భేద్యంగా మార్చాం’ అని రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో వెల్లడించారు. ర్యాన్సమ్‌వేర్‌తో సంబంధం లేకుండానే మార్చినుంచే ప్రభుత్వ వ్యవస్థలోని అన్ని కంప్యూటర్లలో ప్యాచ్ (కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో, భద్రతలో ఉండే లోపాలను సరిదిద్దే సాఫ్ట్‌వేర్)లు ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. అటు భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్–ఇన్) కూడా సైబర్ దాడి ప్రభావం నామమాత్రంగానే కనిపించిందని.. ఇంతవరకు ఎలాంటి భారీ నష్టం వాటిల్లిన ఘటనలు తమ దృష్టికి రాలేదని వెల్లడించిం ది. కాగా, గుజరాత్, పశ్చిమబెంగాల్‌లోని వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల కంప్యూటర్లపై వాన్నా క్రై దాడి జరిగినట్లు తెలిసింది. అయితే రోజువారీ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం వాటిల్లలేదని మమత సర్కారు వెల్లడించింది.
మేం భద్రమే.. జీఎస్టీఎన్: ర్యాన్సమ్‌వేర్ ప్రభావం లేకుండా ప్రత్యేక ఫైర్‌వాల్ భద్రతను ఏర్పాటుచేసుకున్నట్లు సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ పవర్ గ్రిడ్ వెల్లడించింది. ఉద్యోగులు అనవసర మెయిల్స్‌ను ఓపెన్ చేయవద్దని ఆదేశించింది. కీలకమైన జీఎస్టీ వ్యవస్థపై ఈ వైరస్ ప్రభావం ఉండదని జీఎస్టీనెట్‌వర్క్ వెల్లడించింది. జీఎస్టీ వ్యవహారాలు మైక్రోసాఫ్ట్‌పై కాకుండా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై కొనసాగుతున్నందున సమస్యేమీ లేదని జీఎస్టీఎన్ సీఈవో ప్రకాశ్ కుమార్ తెలిపారు. భారత్‌లో పైరసీ విచ్చలవిడిగా పెరిగిపోవటం, లైసెన్స్ లేని సాఫ్ట్‌వేర్ వినియోగం భారీ నష్టానికి సంకేతాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముప్పు తొలగిపోలేదు
యూరప్, అమెరికా, రష్యాల్లో సోమవారం సంస్థలు, కంపెనీల పనులు ప్రారంభం కాగానే వాన్నా క్రై నష్టం భారీగా కనిపించింది. ఇప్పటికే వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా, తాజా సైబర్ దాడి ప్రభుత్వాలకు మేలుకొలుపని మైక్రోసాఫ్ట్ తెలిపింది. విండోస్ ఎక్స్‌పీకి సబంధించిన అప్‌డేట్‌ను ‘మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ బులెటిన్ ఎమ్‌ఎస్17–010’ పేరుతో మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. చైనాలో ప్రభుత్వ ఏజెన్సీలు సహా 30వేల ప్రైవేటు సంస్థలకు చెందిన లక్షల సంఖ్యలో కంప్యూటర్లు వాన్నా క్రై బారిన పడ్డాయని క్విహూ360 అనే చైనా యాంటీవైరస్ సంస్థ చెప్పింది.
పలు ఏటీఎంల మూసివేత
ర్యాన్సమ్‌వేర్ దాడి నేపథ్యంలో పాత మైక్రోసాఫ్ట్ ఓఎస్ వాడుతున్న ఏటీఎంలను బ్యాంకులు ముందస్తుగా మూసివేయనున్నట్లు తెలిసింది. సెర్ట్–ఇన్ హెచ్చరికలతో పాత ఓఎస్ ఉన్న వ్యవస్థలను మూసేయాలంటూ ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో 2.2లక్షల ఏటీఎం లుండగా.. వీటిలో కొన్ని మాత్రమే విండోస్ ఎక్స్‌పీతో నడుస్తున్నాయి.