ప్రపంచాన్ని ఏడిపిస్తోంది! | Cyber attack Hits Nearly 100 Countries With ‘wanna cry’Malware | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని ఏడిపిస్తోంది!

Published Sun, May 14 2017 2:43 AM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

ప్రపంచాన్ని ఏడిపిస్తోంది!

ప్రపంచాన్ని ఏడిపిస్తోంది!

100 దేశాలపై సైబర్‌ దాడి
బ్రిటన్‌ నుంచి భారత్‌ వరకూ ‘వనా క్రై’ ప్రభావితం
పెద్ద సంఖ్యలో కంప్యూటర్లకు వనా క్రై ర్యాన్‌సమ్‌వేర్‌ వైరస్‌
►  300 డాలర్లు చెల్లిస్తే వదిలేస్తామంటూ డిమాండ్‌
►  బ్రిటన్‌లో కుదేలైన వైద్య వ్యవస్థ.. అత్యవసర ఆపరేషన్లూ రద్దు
►  జర్మనీ, స్పెయిన్‌లలో తీవ్ర నష్టం
►  పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు కంప్యూటర్లూ హ్యాక్‌
►  ఇప్పటివరకూ 20 వేల డాలర్ల వసూళ్లు.. తిప్పికొట్టేందుకు నిపుణుల కృషి


(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
సైబర్‌ దొంగలు ప్రపంచంపై పంజా విసిరారు. భారత్‌ సహా దాదాపు వంద దేశాల్లోని లక్షలాది కంప్యూటర్లను హ్యాక్‌ చేశారు. వాటిల్లోని డేటా మొత్తానికీ తాళం (ఎన్‌క్రిప్ట్‌) వేసేశారు. దానిని తీయాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం వారు ఉపయోగించిన ఆయుధం ‘వనా క్రై’ అనే వైరస్‌. ఈ వైరస్‌ వాస్తవంగా సృష్టించినది అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ). సైబర్‌ దొంగలు ఆ వైరస్‌ను తస్కరించి ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లపై దాడి చేశారు. వారి బారినపడి బ్రిటన్‌లో చాలా ఆస్పత్రులు చికిత్స కోసం వచ్చిన రోగులను చేర్చుకోకుండా తిప్పిపంపాల్సి వచ్చింది. ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు ఆపరేషన్లు, చికిత్సలు నిలిచిపోయాయి. జర్మనీలో రైళ్ల రాకపోకలు తెలియకుండా పోయాయి. స్పెయిన్‌లో టెలికమ్యూనికేషన్లు, గ్యాస్‌ వ్యవస్థలకు అంతరాయం కలిగింది. రష్యాలో బ్యాంకులు ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వ కంప్యూటర్లు వెయ్యికి పైగా మూగబోయాయి. చైనాలో కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఇబ్బందులపాలయ్యాయి. ఉత్తరకొరియాలోని ఆస్పత్రులూ ఇక్కట్లపాలయ్యాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో 18 పోలీస్‌స్టేషన్లలో కంప్యూటర్లు స్తంభించిపోయాయి. సైబర్‌ భద్రత చరిత్రలోనే ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. శుక్రవారం మొదలైన ఈ సైబర్‌ దాడి కొన్ని గంటల్లోనే ప్రపంచ దేశాలకు విస్తరించింది. శనివారం మధ్యాహ్నానికి ఉధృతి కొంచెం నెమ్మదించింది. అయినా ఇంకా ముప్పు తొలగిపోలేదు. ఈ దాడి తమ పనేనని ఇంతవరకూ హ్యాకర్లెవరూ ప్రకటించలేదు. వనా క్రై దాడిని తిప్పికొట్టేందుకు ప్రపంచ దేశాల్లో సైబర్‌ భద్రతా నిపుణులు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు.

‘విండోస్‌’లోని లోపాల ఆధారంగా..
‘వనా క్రై’లేదా ‘వనా డిక్రిప్టర్‌’అనే ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ–మెయిల్‌ అటాచ్‌మెంట్లు, ఇతర ఫైళ్లు, డౌన్‌లోడ్‌ల ద్వారా కంప్యూటర్లలోకి ప్రవేశిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఉన్న లోపాల ఆధారంగా ఇది కంప్యూటర్‌ను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. కంప్యూటర్‌లోని సమాచారం (డేటా.. ఫైళ్లు) మొత్తానికి తాళం (ఎన్‌క్రిప్ట్‌) వేస్తుంది. దానిని తీయాలంటే 300 డాలర్ల విలువైన బిట్‌కాయిన్స్‌ (డిజిటల్‌ వర్చువల్‌ కరెన్సీ) చెల్లించాలని డిమాండ్‌ చేస్తుంది. ఆ మొత్తం చెల్లించినా ఫైళ్ల తాళం తెరుచుకుంటుందన్న (డీక్రిప్ట్‌ అవుతుందన్న) గ్యారెంటీ లేదు.

తొలుత స్వీడన్‌లో..
శుక్రవారం మొదట స్వీడన్‌లో ఈ ర్యాన్‌సమ్‌వేర్‌ సైబర్‌ దాడి వెలుగులోకి వచ్చింది. తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్‌లకు పాకింది. చాలా వేగంగా శుక్రవారం సాయంత్రానికే 100 దేశాలకు విస్తరించింది. శనివారం ఉదయానికి యూరప్, ఆఫ్రికా దేశాలతో పాటు మధ్య ఆసియా, అరబ్‌ దేశాలు, రష్యా, ఆస్ట్రేలియా, లాటిన్‌ అమెరికా దేశాల్లో వైరస్‌ విస్తృతి పెరిగింది. శనివారం సాయంత్రానికి విస్తృతి తగ్గడంతో పాటు ఆ సమయంలో ఆసియా దేశాలకు రాత్రి సమయం కావడంతో.. భారత్‌ సహా ఆసియా దేశాల్లో దీని ప్రభావం కొంచెం తక్కువగా ఉంది. వైరస్‌ దాడిని తొలుత గుర్తించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా 75,000 దాడులు నమోదైనట్లు సైబర్‌ భద్రతా రంగ సంస్థ అవాస్ట్‌ వెల్లడించింది. గత 24 గంటల్లో లక్షకుపైగా కంప్యూటర్లు ఈ వైరస్‌ బారినపడినట్లు గుర్తించింది. బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, చైనా, ఇటలీ, ఈజిప్టు, ఇండియా సహా 99 దేశాల్లో 45,000కుపైగా దాడులను కాస్పర్‌స్కీ ల్యాబ్‌ సైబర్‌ భద్రతా నిపుణులు గుర్తించారు.

బ్రిటన్‌ ఆస్పత్రులు అతలాకుతలం
ప్రధానంగా ఈ ‘వనా క్రై’సైబర్‌ దాడి ప్రభావం బ్రిటన్‌లో చాలా ఎక్కువగా ఉంది. ఆ దేశ జాతీయ ఆరోగ్య వ్యవస్థ దాదాపు కుప్పకూలినంత పనైంది. వైరస్‌ కారణంగా కంప్యూటర్లు స్తంభించిపోవడంతో ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నానికి 40 ఎన్‌హెచ్‌ఎస్‌ వ్యవస్థలు వైరస్‌ బారిన పడ్డాయి. చికిత్స కోసం వస్తున్న రోగుల వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయడానికి వీలులేకపోవడంతో వారిని వేరే ఆస్పత్రులకు పంపేస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల వ్యాధులు, చికిత్సల వివరాలు కంప్యూటర్లలోనే ఉండిపోవడంతో చికిత్సలు నిలిచిపోయాయి. పాట్రిక్‌ వార్డ్‌ (47) అనే వ్యక్తి లండన్‌లోని సెయింట్‌ బార్తోలోమ్యూ ఆస్పత్రిలో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించుకోవాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయింది. ఇటువంటి ఉదంతాలు ఎన్నో నమోదయ్యాయి. అత్యవసర రోగులు, క్షతగాత్రులను తరలించడానికి బయల్దేరిన అంబులెన్సులు మధ్యలోనే వెనుదిరిగాయి. ఆ ఆస్పత్రుల్లో రోగుల వివరాలు, వారి వ్యాధులకు సంబంధించిన సమాచారం హ్యాకర్ల బారిన పడిందేమోనన్న సందేహాలు తలెత్తాయి. దీంతో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం, నిరసనలు పెల్లుబికాయి. ఆన్‌లైన్‌లో వ్యాపారం చేయడానికి బ్రిటన్‌ అతి సురక్షితమైన దేశంగా మారుస్తామని శుక్రవారం ప్రధాన మంత్రి థెరెసామే ప్రకటించగా.. తర్వాతి 24 గంటల్లోనే భారీ సైబర్‌ దాడి జరగడం ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది.

మరెన్నో దేశాల్లో..
‘వనా క్రై’సైబర్‌ దాడికి మూలం జర్మనీ రైల్వే వ్యవస్థ డ్యూషే బాన్‌లో ఉందని ప్రస్తుతానికి నిపుణులు భావిస్తున్నారు. ఆ వ్యవస్థ నిఘా సాంకేతిక పరిజ్ఞానం ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నది. రైల్వేస్టేషన్లలో టికెట్‌ మెషీన్లు పనిచేయలేదు. రైళ్ల రాకపోకల వివరాలు ప్రదర్శించే బోర్డులు నిలిచిపోయాయి. నేరస్తులను పట్టుకునేందుకు జర్మనీ ఫెడరల్‌ క్రైమ్‌ పోలీస్‌ సంస్థ బీకేఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇక స్పెయిన్‌లో టెలిఫోనికా సహా భారీ టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, గ్యాస్‌ సంస్థలు ఈ వైరస్‌ దాడికి గురయ్యాయి. ఫ్రాన్స్‌లో రెనాల్ట్‌ సంస్థలో ఉత్పత్తి ఆగిపోయింది. అమెరికాలో ప్రఖ్యాత కొరియర్‌ సంస్థ ఫెడెక్స్‌ వైరస్‌ తాకిడితో కుదేలైంది. రష్యాలోనూ వెయ్యికిపైగా కంప్యూటర్లు ఈ వైరస్‌ బారిన పడ్డాయని ఆ దేశ హోంశాఖ తెలిపింది. రష్యా ప్రభుత్వ బ్యాంకులపైనా వైరస్‌ దాడి జరిగినప్పటికి దానిని అడ్డుకున్నామని ప్రకటించింది. ఇక ఉక్రెయిన్, ఇండియాల్లోనూ ‘వనా క్రై’దాడి ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ పాత వెర్షన్లు అధికంగా ఉపయోగించే దేశాలు కావడం, వాటిలో తాజా అప్‌డేట్లు ఇన్‌స్టాల్‌ చేసుకునే అవకాశం తక్కువగా ఉండటం వైరస్‌ దాడికి ఎక్కువ అవకాశమిస్తోందని క్యాస్పర్‌స్కీ సంస్థ అభిప్రాయపడింది.

ఇప్పటిదాకా 20 వేల డాలర్లు..
‘వనా క్రై’దాడికి పాల్పడ్డ సైబర్‌ నేరగాళ్లు శనివారం సాయంత్రానికి తమ డిమాండ్ల ద్వారా 20,000 డాలర్లు వరకు వసూలు చేసినట్లు ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్న సైబర్‌ నిపుణులు గుర్తించారు. ఈ వైరస్‌తో సంబంధమున్న మూడు బిట్‌కాయిన్‌ ఖాతాలను, చిరునామాలను గుర్తించామని బిట్‌కాయిన్‌ అక్రమ లావాదేవీలను గుర్తించే ‘ఎలిప్టిక్‌’సంస్థ సహ వ్యవస్థాపకుడు టామ్‌ రాబిన్‌సన్‌ వెల్లడించారు. ఆ ఖాతాల నుంచి ఎవరైనా డబ్బు విత్‌డ్రా చేసుకుంటే ఈ దాడికి పాల్పడ్డ వారిని వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు.

అప్‌డేట్‌ చేసుకున్న వాళ్లు భద్రం: మైక్రోసాఫ్ట్‌
Ransom: Win32. WannaCrypt అనే మాలిసియస్‌ సాఫ్ట్‌వేర్‌ (వైరస్‌) దాడి నుంచి భద్రత కల్పించే సెక్యూరిటీ అప్‌డేట్‌ను తాము మార్చిలోనే అందించామని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ ఉచిత యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే వారు, విండోస్‌ అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండేవారికి ఈ దాడి నుంచి భద్రత ఉందని స్పష్టం చేసింది. వినియోగదారులకు (ఈ సైబర్‌ దాడి నుండి) అదనపు భద్రత కల్పించేందుకు తాము కృషి చేస్తున్నట్లు ప్రకటించింది.

స్తంభించిన ఏపీ పోలీసు కంప్యూటర్లు
ఆంధ్రప్రదేశ్‌లోని పోలీస్‌స్టేషన్లలో దాదాపు 25 నుంచి 40 శాతం కంప్యూటర్లు కూడా ‘వనా క్రై’వైరస్‌ బారినపడినట్లు అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే ఏపీలోని పలు జిల్లాల్లో కంప్యూటర్లు మొరాయించి పోలీసు సేవలు స్తంభించాయి. శనివారం కూడా ఆ పరిస్థితి కొనసాగింది. తొలుత సాంకేతిక లోపమని భావించిన పోలీసు వర్గాలు.. హ్యాకింగ్‌ అంశం తెలియడంతో కంగుతిన్నారు. తొలుత చిత్తూరు జిల్లాలోని ఎనిమిది పోలీస్‌ స్టేషన్లలో కంప్యూటర్లు హ్యాక్‌ అయిన విషయాన్ని గుర్తించారు. హ్యాకర్లు ఈ–మెయిల్‌ ద్వారా రాన్సమ్‌వేర్‌ వైరస్‌ను పంపగా.. దాన్ని డౌన్‌లోడ్‌ చేసిన వెంటనే కంప్యూటర్లు పనిచేయడం మానేశాయి. దీనిపై తిరుపతి వెస్ట్‌జోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సైబర్‌ క్రైమ్‌ కేసు నమోదు చేశారు. ఇక చిత్తూరుతో పాటు కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లోని పోలీస్‌ కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురైనట్టు గుర్తించారు.

నా సిస్టమ్‌ పదిలం: డీజీపీ
తన కంప్యూటర్‌ ఐఓఎస్‌తో వాడుతున్నందున హ్యాకర్ల బారిన పడలేదని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ నండూరి సాంబశివరావు మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లోని పోలీస్‌ కంప్యూటర్లు హ్యాక్‌ అయ్యాయని, అయితే కీలక సమాచారమేదీ సైబర్‌ నేరగాళ్లకు చిక్కలేదని తెలిపారు. హ్యాకైన కంప్యూటర్లను సరిచేసేందుకు సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని.. ఏ సమాచారం హ్యాక్‌ అయినదీ త్వరలో గుర్తిస్తామని వెల్లడించారు. హ్యాకింగ్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్లలో కంప్యూటర్లను షట్‌డౌన్‌ చేసి పెట్టాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ వాటిని అలాగే ఉంచాలని డీజీపీ ఆదేశించారు. ఇక ఏపీలో హ్యాకింగ్‌ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఏపీ సీఐడీ డీజీ ద్వారక తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని పోలీస్‌ కంప్యూటర్లు హ్యాక్‌ అయ్యాయి, సమాచారమేదైనా తస్కరించారా? అన్న వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. కాగా తిరుపతి అర్బన్‌ జిల్లా పరిధిలో ఎనిమిది పోలీస్‌ కంప్యూటర్లు హ్యాక్‌ అయినట్లు అర్బన్‌ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. రోజువారీ కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేదని, మ్యాన్యువల్‌గా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement