హరారే : దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే చుట్టూ ఉన్న క్రిమినల్స్‌ను నాశనం చేసేందుకు పవర్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు జింబాబ్వే మిలటరీ ప్రకటించింది. అధ్యక్షుడి చుట్టూ ఉన్న కొందరు దేశానికి సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పేర్కొంది. అయితే, ముగాబే(93), ఆయన కుటుంబం తమ రక్షణలోనే ఉన్నట్లు దేశ అధికారిక టీవీలో మేజర్ జనరల్ ఎస్‌బీ మోయో చెప్పారు.
దేశంలోని కీలకప్రాంతాల్లో(పార్లమెంటు, కోర్టులు, ప్రభుత్వ ఆఫీసులు) జింబాబ్వే మిలటరీ పెద్ద ఎత్తున ఆయుధ వాహనాలను మోహరించినట్లు రాయిటర్స్ పేర్కొంది. క్రిమినల్స్‌ను మట్టుబెట్టిన అనంతరం దేశంలో ప్రశాంతతను పునః ప్రతిష్టిస్తామని మోయో పేర్కొన్నారు. బుధవారం ఉదయం జింబాబ్వే ఆర్థిక శాఖ మంత్రిని మిలటరీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ముగాబే పార్టీ జాను-పీఎఫ్ కేంద్ర కార్యాలయాన్ని మంగళవారం మిలటరీ సీజ్ చేసింది.
జానూ-పీఎఫ్ మిత్రపక్షాల మధ్య ఉన్న సమస్యలపై తాను జోక్యం చేసుకోవాలని అనుకుంటున్నట్లు మిలటరీ చీఫ్ జనరల్ కన్‌స్టాంటినో చివాంగా చెప్పిన 24 గంటల్లోనే మిలటరీ దళాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అనంతరం జింబాబ్వే అధికారిక టీవీ జింబాబ్వీ స్టేట్ బ్రాడ్‌కాస్టర్(జెడ్‌బీసీ)లోకి సైనికులు చొచ్చుకెళ్లారు. కొందరు జెడ్‌బీసీ ఉద్యోగులపై సైనికులు చేయి చేసుకున్నట్లు కూడా తెలిసింది. 1980లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన నాటి నుంచి జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే గెలుపొందుతూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment