మూడో టీ20లో జింబాబ్వే గెలుపు (PC: Zimbabwe Cricket)
Zimbabwe vs Ireland, 3rd T20I: సొంతగడ్డపై జింబాబ్వే సత్తా చాటింది. ఐర్లాండ్‌తో మూడో టీ20లో విజయం సాధించింది. పర్యాటక జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకై ఐర్లాండ్ జింబాబ్వేలో పర్యటిస్తోంది.
ఈ క్రమంలో హరారే వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో జింబాబ్వే ఆఖరి వరకు పోరాడి ఎట్టకేలకు జయకేతనం ఎగురవేసింది.
టెక్టర్ ఒక్కడే
ఐర్లాండ్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ 47 పరుగులతో ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కర్టిస్ కాంఫర్ 27, డాక్రెల్ 23 పరుగులతో రాణించారు.
సిరీస్ విజేత జింబాబ్వే (PC: Zimbabwe Cricket)
చివరి వరకు పోరాడినా
ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శతకం(54)తో రాణించి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నాడు. అయితే, ఐర్లాండ్ మాత్రం పట్టు సడలించలేదు.
ఈ దశలో ఆల్‌రౌండర్ ర్యాన్ బర్ల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 11 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గత రెండు మ్యాచ్‌లలోనూ రాణించిన అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.
జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మూడో టీ20 స్కోర్లు
ఐర్లాండ్- 141/9 (20)
జింబాబ్వే- 144/6 (19)
చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!
IND vs SL: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే?
Comments
Please login to add a commentAdd a comment