టీమిండియా ఘన విజయం.. సిరీస్‌ మనదే | India Vs Zimbabwe 4th T20I Match Live Score, Results, Updates, And Highlights | Sakshi
Sakshi News home page

Ind vs Zim 2024 4th T20I: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సిరీస్‌ మనదే

Published Sat, Jul 13 2024 4:03 PM | Last Updated on Sat, Jul 13 2024 7:31 PM

Ind vs Zim 2024 4th T20I: Toss Playing XI Updates And Highlights

Zimbabwe vs India, 4th T20I Updates: జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగో టీ20 ఆడుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో శుబ్‌మన్‌ గిల్‌ సేన ఆధిక్యంలో ఉంది.  శనివారం టీ20లో టాస్‌ గెలిచిన భారత్‌.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  

నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్‌ విజృంభించింది. ఓపెర్లు యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ దంచికొట్టారు. జైస్వాల్‌ 93 పరుగులతో దుమ్మలేపగా.. గిల్‌ 58 పరుగులు సాధించాడు.

వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్‌ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఏకంగా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది.

భారత తుదిజట్టు: 
యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్( వికెట్ కీపర్), రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.

జింబాబ్వే తుదిజట్టు: 
వెస్లీ మెదెవెరె, తాడివానాషే మరుమానీ, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్‌, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చటారా.

అప్‌డేట్స్‌
14.1: గిల్‌ అర్ధ శతకం

12 ఓవర్లలో టీమిండియా స్కోరు: 118/0 (12)
జింబాబ్వే బౌలింగ్‌ను చిత్తు చేస్తూ టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 12వ ఓవర్‌ముగిసే సరికి జైస్వాల్‌ 75, గిల్‌ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పది ఓవర్లలోనే టీమిండియా స్కోరు: 106-0
శుబ్‌మన్‌ గిల్‌ 37, యశస్వి జైస్వాల్‌ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.

6.3:  29 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకు న్న యశస్వి  జైస్వాల్‌

పవర్‌ ప్లేలో యశస్వి పరుగుల వరద
ఆరో ఓవర్‌ ముగిసే సరికి యశస్వి జైస్వాల్‌ 47(26), శుబ్‌మన్‌ గిల్‌ 13 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు: 61/0 (6)

దంచికొడుతున్న యశస్వి
జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఘనంగా తమ ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ ఆది నుంచే జింబాబ్వే బౌలర్లపై అటాక్‌ చేస్తున్నారు.

మూడు ఓవర్లు ముగిసే సరికి యశస్వి 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించగా.. గిల్‌ ఐదు బంతుల్లో 11 రన్స్‌ చేశాడు. దీంతో టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. 

టీమిండియా టార్గెట్‌ 153
ఆతిథ్య జట్టు ఓపెనర్లు వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) సహా కెప్టెన్‌ సికందర్‌ రజా(46) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో పేసర్లు ఖలీల్‌ అహ్మద్‌ రెండు, తుషార్‌ దేశ్‌పాండే, శివం దూబే ఒక్కో వికెట్‌ తీయగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు
ఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీశాడు. తొలి బంతికి మేయర్స్‌(12), ఆఖరి బంతికి మందాడే(7)ను పెవిలియన్‌కు పంపాడు.

18.3: రజా హాఫ్‌ సెంచరీ మిస్‌
ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించిన జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజా హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. తుషార్‌ దేశ్‌పాండే బౌలింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరం(28 బంతుల్లో 46) నిలిచిపోయాడు. రజా రూపంలో జింబాబ్వే ఐదో వికెట్‌ కోల్పోయింది.జింబాబ్వే స్కోరు: 147/5 (19)  

పదిహేడు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే స్కోరు:  129/4
రజా 42, మేయర్స్‌ తొమ్మిది పరుగులతో ఆడుతున్నారు

14.4: నాలుగో వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే
బ్యాటర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా జింబాబ్వే నాలుగో వికెట్‌ కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్‌లో సికందర్‌ రజా పరుగుకు యత్నించగా.. మరో ఎండ్‌లో ఉన్న క్యాంప్‌బెల్‌ వేగంగా కదలలేకపోయాడు.

ఈ క్రమంలో బంతిని అందుకున్న బిష్ణోయి నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు విసరగా.. బాల్‌ వికెట్లను గిరాటేసింది. ఫలితంగా క్యాంప్‌బెల్‌(3) రనౌట్‌ అయ్యాడు. 

13.4: మూడో వికెట్‌ డౌన్‌
వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో బ్రియాన్‌ బెనెట్‌ యశస్వి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొన్న ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.

జొనాథన్‌ క్యాంప్‌బెల్‌ క్రీజులోకి వచ్చాడు. సికందర్‌రజా 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే స్కోరు: 93/3 (14).

9.6: రెండో వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే
పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే బౌలింగ్‌లో జింబాబ్వే ఓపెనర్‌ వెస్లీ(25) పెవిలియన్‌ చేరాడు. బాల్‌ను తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. రింకూ సింగ్‌ క్యాచ్‌ పట్టుకున్నాడు. దీంతో వెస్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

సికందర్‌ రజా 0, బ్రియాన్‌ బెనెట్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 67-2.

7.1: హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకు న్న జింబాబ్వే
వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో మరుమానీ రెండు పరుగులు తీయగా.. జింబాబ్వే యాభై పరుగుల మార్కు అందుకుంది.

పవర్‌ ప్లేలో జింబాబ్వే స్కోరు: 44/0
ఆరు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్‌ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 19, మరుమానీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కట్టుదిట్టంగా భారత్‌ బౌలింగ్‌
బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించగా.. తన పేస్‌ పదనుతో జింబాబ్వేకు తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు.

ఇక రెండో ఓవర్‌ వేసిన అరంగట్రే పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే 11 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 15 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 12, మరుమానీ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. 

టాస్‌ గెలిచిన భారత జట్టు
శనివారం నాటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్‌ పట్టుదలగా ఉంది. హరారే వేదికగా జరుగనున్న ఈ టీ20లో టాస్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

తుషార్‌ దేశ్‌పాండే అరంగేట్రం
ఈ మ్యాచ్‌ ద్వారా పేస్‌ బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే అరంగేట్రం చేస్తున్నట్లు గిల్‌ తెలిపాడు. ఆవేశ్‌ ఖాన్‌ స్థానంలో అతడిని తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.

మరోవైపు.. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజా తెలిపాడు. వెల్లింగ్‌టన్‌ మసకజ్ద స్థానంలో ఫరాజ్‌ అక్రం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement