జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. హరారే వేదికగా జరిగిన ఆఖరి టీ20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 4-1 తేడాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది.
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 125 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శివమ్ దూబే రెండు, అభిషేక్, సుందర్, దేశ్‌పాండే తలా వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(58) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జింబాబ్వే బౌలర్లలో ముజ్బారనీ రెండు, రజా, నగర్వా, మవుటా తలా వికెట్ పడగొట్టారు. ఇక ఈ విజయంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు.
"ఇదొక అద్భుతమైన సిరీస్. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత మా బాయ్స్ దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు. ఈ సిరీస్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా జట్టులో చాలా మంది ఆటగాళ్లకు విదేశీ పరిస్థితుల్లో ఆడిన అనుభవం లేదు.
అయినప్పటకి వారు ఆడిన విధానం నిజంగా అద్భుతం. ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక శ్రీలంక పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇంతకుముందు ఆసియాకప్ కోసం శ్రీలంకకు వెళ్లాను" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.
చదవండి: 4–1తో ముగించారు
Comments
Please login to add a commentAdd a comment