Ind vs Zim: జైస్వాల్‌ విధ్వంసం.. గిల్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ | Ind Vs Zim 2024 4th T20I: India Beat Zimbabwe By 10 Wickets Clinch Series, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

Ind vs Zim 4th T20: జైస్వాల్‌ విధ్వంసం.. గిల్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌

Published Sat, Jul 13 2024 7:22 PM | Last Updated on Sat, Jul 13 2024 8:06 PM

Ind vs Zim 2024 4th T20I: India Beat Zimbabwe By 10 Wickets Clinch Series

జింబాబ్వేతో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించింది.

రాణించినా రజా 
ఈ క్రమంలో శనివారం నాలుగో టీ20లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. హరారే వేదికగా టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు రాణించారు. జింబాబ్వేను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు.

ఆతిథ్య జట్టు ఓపెనర్లలో వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ సికందర్‌ రజా 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టపోయి 152 పరుగులు చేసింది.

అరంగేట్ర బౌలర్‌కు ఒక వికెట్‌ 
టీమిండియా బౌలర్లలో పేసర్లు ఖలీల్‌ అహ్మద్‌ రెండు, అరంగేట్ర ఆటగాడు తుషార్‌ దేశ్‌పాండే, శివం దూబే ఒక్కో వికెట్‌ పడగొట్టగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మ తలా ఒక వికెట్‌ తీశారు.

ఆకాశమే హద్దుగా జైస్వాల్‌
ఇక జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ అజేయ అద్బుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జైస్వాల్‌ 93 పరుగుల(13 ఫోర్లు, 2 సిక్సర్లు) 
తో దుమ్మలేపగా.. గిల్‌ 58 పరుగులు (ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లు) సాధించాడు.

వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ఏకంగా పది వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ తొలి సిరీస్‌లోనే ట్రోఫీ గెలవడం విశేషం.

చదవండి: IND Vs ZIM 4th T20I: సికందర్‌ రజా వరల్డ్‌ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement