జింబాబ్వే పర్యటనలో యువ భారత జట్టు సత్తా చాటింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత ఆడిన తొలి టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లోనే టీమిండియాకు ఘన విజయం అందించింది.
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని యువ ఆటగాళ్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. తొలి టీ20లో పరాజయం పాలైనా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలతో జోరు ప్రదర్శించారు.
హరారే వేదికగా శనివారం నాటి నాలుగో టీ20లో సమష్టిగా రాణించి జింబాబ్వేను పది వికెట్ల తేడాతో చిత్తు చేశారు. ఈ క్రమంలో కెప్టెన్‌గా తొలిసారి భారత జట్టు పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్ గిల్ ఖాతాలో అరంగేట్రంలోనే సిరీస్ విజయం చేరింది.
ఈ నేపథ్యంలో గిల్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అనుభూతి ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నాడు. ‘‘మొదటి టీ20లో మేము లక్ష్య ఛేదనలో విఫలమయ్యాం.
అయితే, ఈరోజు విజయవంతంగా టార్గెట్ పూర్తి చేశాం. ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది. అయినా.. ఇప్పుడే ఇంకా పని పూర్తి కాలేదు. ఇంకొక మ్యాచ్ మిగిలే ఉంది’’ అని పేర్కొన్నాడు.
ఇక ప్రస్తుతం ఆడుతున్న జట్టు గొప్పగా ఉందన్న గిల్... తదుపరి మ్యాచ్‌లో మార్పులు చేర్పుల గురించి కోచ్‌తో ఇంకా చర్చించలేదని తెలిపాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య నామమాత్రపు ఐదో టీ20 హరారే వేదికగా ఆదివారం జరుగనుంది.
టీమిండియా వర్సెస్ జింబాబ్వే నాలుగో టీ20 స్కోర్లు:
👉వేదిక: హరారే స్పోర్ట్స్ క్లబ్
👉టాస్: టీమిండియా.. బౌలింగ్
👉జింబాబ్వే స్కోరు: 152/7 (20)
👉టీమిండియా స్కోరు: 156/0 (15.2)
👉ఫలితం: పది వికెట్ల తేడాతో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ సొంతం
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 పరుగులు నాటౌట్, (13 ఫోర్లు, 2 సిక్సర్లు)).
చదవండి: Ind vs Zim 4th T20: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్
Comments
Please login to add a commentAdd a comment