
విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ (PC: Virat Kohli Insta)
టీ20 ప్రపంచకప్-2024తో టీమిండియాలో ఒక శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో.. భారత జట్టులో ఈ ఇద్దరి మేటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరా అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో జింబాబ్వే మాజీ క్రికెటర్ హామిల్టన్ మసకజ్ద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20లలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారసులు వీరేనంటూ ఇద్దరు యువ తరంగాల పేర్లు చెప్పాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్-2024లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పదకొండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.
ఐపీఎల్ వీరులకు లైన్ క్లియర్
ఈ క్రమంలో సౌతాఫ్రికాతో ఫైనల్లో విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ వీరులకు జాతీయ జట్టులో ఎంట్రీకి మార్గం సుగమమైంది.
ఇందుకు తగ్గట్లుగా మెగా టోర్నీ ముగిసిన వెంటనే జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లు తొలిసారిగా ఎంపికయ్యారు. అయితే, అనూహ్య రీతిలో జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి పాలైన యువ భారత జట్టు... రెండో టీ20లో మాత్రం సత్తా చాటింది.
ఆతిథ్య జట్టును ఏకంగా వంద పరుగుల తేడాతో చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌గా తొలిసారి వ్యవహరిస్తున్న శుబ్‌మన్ గిల్ ఖాతాలో విజయం చేరింది.
కోహ్లి, రోహిత్ లేని లోటు పూడ్చగలిగేది వాళ్లిద్దరే
ఈ నేపథ్యంలో హామిల్టన్ మసకజ్ద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ప్రత్యామ్నాయం శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ అని ఈ జింబాబ్వే మాజీ ఆటగాడు పేర్కొనడం విశేషం.
‘‘భారత క్రికెట్ జట్టు పరివర్తన దశలో ఉంది. అందరి కంటే ఎక్కువగా శుబ్‌మన్ గిల్ నా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో అతడు చాలా కాలంగా తనదైన శైలిలో రాణిస్తున్నాడు.
మేటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల సత్తా అతడికి ఉంది.ఇక యశస్వి సైతం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను అద్భుతంగా సాగించలగలడనే నమ్మకం నాకు ఉంది. గిల్, యశస్వి.. వీళ్లిద్దరే వరల్డ్‌క్లాస్ క్రికెటర్ల నిష్క్రమణ వల్ల ఏర్పడిన శూన్యాన్ని పూడ్చగలరు’’ అని మసకజ్ద అభిప్రాయపడ్డాడు.
చదవండి: BCCI: ద్రవిడ్‌కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లి సహా వారందరికీ ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment