టీమిండియా నాలుగో టీ20లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినా పట్టుదలగా నిలబడి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మొత్తంగా 28 బంతులు ఎదుర్కొని 46 పరుగులు సాధించాడు. అయితే, భారత అరంగేట్ర బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రజా విఫలమయ్యాడు.
అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతిని మోకాలి మీద కూర్చుని గాల్లోకి లేపాడు. అయితే, కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేగంగా కదిలి బంతిని అందుకున్నాడు. ఫలితంగా సికందర్ రజా ఇన్నింగ్స్‌కు తెరపడింది.
సికందర్ రజా వరల్డ్ రికార్డు
ఇదిలా ఉంటే.. హరారే వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా సికందర్ రజా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో యాభైకి పైగా వికెట్లు తీయడంతో పాటు 2000 పరుగులు పూర్తి చేసుకున్న జింబాబ్వే తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.
అంతేకాదు ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదో ఆల్‌రౌండర్‌గా రికార్డు సాధించాడు. కాగా కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సికందర్ రజా.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!
అంతర్జాతీయ టీ20(పురుష క్రికెట్)లలో 2 వేలకు పైగా పరుగులు, యాభైకి పైగా వికెట్లు సాధించిన క్రికెటర్లు వీరే
1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 2551 రన్స్, 149 వికెట్లు
2. మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్)- 2165 రన్స్, 96 వికెట్లు
3. విరన్‌దీప్ సింగ్(మలేషియా)- 2320 రన్స్, 66 వికెట్లు
4. మహ్మద్ హఫీజ్(పాకిస్తాన్)- 2514 రన్స్, 61 వికెట్లు
5. సికందర్ రజా(జింబాబ్వే)- 2001 రన్స్,65 వికెట్లు
మెరుగ్గా రాణించి
టీమిండియాతో నాలుగో టీ20లో టాస్ ఓడిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. సికందర్ రజా 46 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే వెళ్లిన భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment