హరారే: జింబాబ్వే మాజీ అధ్యక్షుడు, ఉక్కు మనిషిగా పేరు సంపాదించిన రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. 37 ఏళ్ల పాటు జింబాబ్వేని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ముగాబే నియంతృత్వ పోకడల్ని భరించలేక చివరకు ఆయనకు అండదండగా ఉన్న సైన్యమే 2017లో ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఆ అవమాన భారంతో కుంగిపోయిన ఆయన మంచం పట్టారు. గత ఏప్రిల్లో ఆయనను సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ‘ జింబాబ్వే పితామహుడు రాబర్ట్ ముగాబే మనకిక లేరు’ అని దేశ అధ్యక్షుడు ఎమ్మర్సన్ మన్‌గాగ్వా ట్విట్టర్‌లో వెల్లడించారు.
నాడు స్వాతంత్య్రం కోసం గెరిల్లా పోరు
బ్రిటిష్ పరిపాలనలో ఉన్న రొడేషియాలో (ఇప్పటి జింబాబ్వే) 1924వ సంవత్సరం ఫిబ్రవరి 21న ముగాబే జన్మించారు. చిన్నప్పట్నుంచి విప్లవ భావాలు కలిగిన ముగాబే 1964లో బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. అందుకు 10 సంవత్సరాలకుపైగా విచారణ లేకుండానే జైలు జీవితం అనుభవించారు. జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జాను)కి వ్యవస్థాపక సభ్యుడైన ముగాబే ఆ తర్వాత 1973లో దానికి అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఏడాది జైలు నుంచి విడుదలై తెల్లదొరల పాలనలో ఉన్న రొడేషియా విముక్తి కోసం గెరిల్లా తరహా పోరాటాలు చేశారు.
సంక్షోభ సమయాల్లో సంప్రదింపులు జరపడంలో అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన ముగాబే ఆ తర్వాత రాజకీయంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయన పోరాటాల ఫలితంగా జింబాబ్వే స్వతంత్ర దేశమయింది. 1980లో జరిగిన తొలి ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చారు. ఒక స్వాతంత్య్ర వీరుడిగా నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడటంతో పాటు, స్వాతంత్య్రం వచ్చాక నల్లజాతీయులకు ఆరోగ్యం, విద్య అందేలా అవిరళ కృషి చేశారు. తొలి 20 ఏళ్లలో మంచి పరిపాలనా దక్షుడిగా పేరుతెచ్చుకున్నారు. 2000వ సంవత్సరం నుంచే ముగాబే పతనం మొదలైంది.
అధికారం కోల్పోతానేమోనన్న అభద్రతా భావంలో ఆయన నియంతలా మారారు. 2000లో ముగాబే తెచ్చిన భూ సంస్కరణ విధానాలు బెడిసి కొట్టి ఆర్థిక వ్యవస్థ దిగజారి పోయింది. తెల్లజాతీయుల నుంచి భూములు లాక్కున్నారు. సైన్యం అండతో 17 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా రాజకీయ అస్థిరత, ఆర్థిక మాంద్యం ఆ దేశాన్ని వణికించేశాయి. 37 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో ప్రజల్లోనూ అసమ్మతి పేరుకుపోయింది. వయోభారంతో ఇక పదవిలో కొనసాగలేనని భావించిన ముగాబే 2017లో తన భార్య గ్రేస్‌కు అధ్యక్ష పీఠం అప్పగించే ప్రయత్నం చేశారు. ఇది తెలుసుకున్న ఆర్మీ ఆయనపై తిరుగుబాటు చేసి గద్దె దింపింది.
ఉక్కు మనిషి ముగాబే కన్నుమూత!
Published Sat, Sep 7 2019 3:45 AM | Last Updated on Sat, Sep 7 2019 5:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment