జెనీవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. జింబాబ్వే అధ్యక్షడు రాబర్ట్ ముగాబేను గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రకటించించినట్లు ఐక్యరాజ్య సమితి ఆరోగ్య విభాగం ప్రకటించింది. దీంతో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది.
‘‘మానవ హక్కులను గౌరవించేవారిని ఈ స్థానంలో నియమించటం పరిపాటి. అలాంటిది ముగాబేను ఏ అర్హతతో ఎంపిక చేశారు’’ అంటూ అమెరికా ప్రశ్నలు గుప్పిస్తోంది. ఆయన పాలనలో జింబాబ్వే దారుణంగా నాశనం అయ్యింది. దీనికితోడు 93 ఏళ్ల ఆయన ఓ పెద్ద రోగిష్టి వ్యక్తి. తరచూ ఆరోగ్యం కోసం సింగపూర్ లాంటి దేశాలకు వెళ్తూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తున్నారు. ఆయనపై ప్రజల్లో సానుకూలత కూడా లేదు. ఆ లెక్కన్న ఆయన నియామకం ఆరోగ్య సంస్థ చేసిన ఓ తప్పిదం అని అమెరికా భద్రతా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్క అమెరికానే కాదు.. ఐర్లాండ్ ఆరోగ్య శాఖ మంత్రి సైమన్ హర్రిస్ కూడా ముగాబే నియామకాన్ని తప్పుబడుతూ ఓ ట్వీట్ చేశారు.
గత వారం ఉరుగ్వేలో జరిగిన సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముగాబేను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఓ ప్రకటన చేసింది. అయితే డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రెయెసస్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి కావటంతోనే ఈ నియామకం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1980లో జింబాబ్వే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాబర్ట్ ముగాబే.. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తాడనే చెప్పుకుంటున్నారు. అయితే 37 ఏళ్ల పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుదేలు చేశాయి. అన్నిరంగాల్లో దేశం వెనకబడిపోయింది. అందుకే అమెరికాతో ఆయన సంబంధాలు ఏ మాత్రం బాగోలేవు. దీనికి తోడు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తటంతో మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఆయనపై ఆంక్షలు కూడా విధించింది.
కాగా, ముగాబే నియామకం గురించి జింబాబ్వే మీడియా అధికారికంగా ప్రకటించకపోయినా.. జాతీయ మీడియా జింబాబ్వే హెరాల్డ్ పత్రిక మాత్రం ముగాబే సిగలో మరో ఘనత అంటూ వరుస కథనాలతో ఊదరగొడుతోంది. అయితే విమర్శలు పెల్లుబిక్కుతుండటంతో ఆయన నియామకంలో డబ్ల్యూహెచ్‌వో పునరాలోచన చేస్తోందన్న సమాచారం అందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment