మోగుతున్న ‘జికా’ గంటలు
* వేగంగా వ్యాప్తి చెందుతున్న జికా వైరస్
* ఆందోళనలో బ్రెజిల్, అమెరికా ప్రజలు
* లోతుగా అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు
* గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచన
* 23 దేశాల్లో వ్యాప్తి చెందినట్లు డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టీకరణ
రియో డీ జెనిరో: ప్రమాదకరమైన జికా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈడిస్ ఈజిప్టీ జాతికి చెందిన దోమల కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. చిన్న తలతో పుట్టడం, మెదడు ఎదగకపోవడం ఈ వ్యాధి లక్షణాలు.
ఇప్పటి వరకు దీని నివారణకు వ్యాక్సిన్‌గానీ చికిత్సగానీ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని హెల్త్ అధికారులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. తొందర్లోనే దాదాపు నలభై లక్షల మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ మార్గరేట్ చాన్ తెలిపారు. ఫిబ్రవరి 1న అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అమెరికాతో పాటు 23 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించారు. అయితే అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలా వద్దా అనే దానిపై ఫిబ్రవరి 1న నిర్ణయిస్తామని పేర్కొన్నారు. తొలిసారిగా 1947లో ఉగాండాలోని ఓ కోతిలో ఈ వైరస్‌ను కనుగొన్నారని వివరించారు.
బ్రెజిల్‌లో భిన్న గణాంకాలు.. బ్రెజిల్‌లో తొలుత ఊహించిన దాని కన్నా చిన్న తలతో పుట్టిన కేసులు తక్కువ ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. పరిశోధనల్లో ఏదైనా లోపం ఉండటం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ వ్యాధికి, జికా వైరస్ వ్యాప్తికి మధ్య ఉన్న సంబంధాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు చిన్న తలతో పుట్టిన దాదాపు 4,180 మంది జికా వైరస్ అనుమానితులను ఆరోగ్య అధికారులు పరీక్షించారు.
ఈ లోపానికి జికా వైరస్ కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న ఈడిస్ ఈజిప్టీ అనే జాతి దోమల నిర్మూలనకు దాదాపు 2.2 లక్షల మంది సైనికులను రంగంలోకి దింపినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 700 కేసులను అధ్యయనం చేయగా 270 మంది జికా వైరస్ బారిన పడ్డారని నిర్ధారించినట్లు బుధవారం బ్రెజిల్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. అయితే దీన్ని కొందరు నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఈ జికా వైరస్ వల్లే పిల్లలు చిన్న తలతో పుడుతున్నారనే విషయం ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని, దీన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ కో డెరైక్టర్ పాల్ రోప్ పేర్కొన్నారు.
జికాను పూర్తిగా నిర్మూలించే వరకు గర్భిణులు వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పర్యటించకూడదని బ్రెజిల్ అధికారులు సూచించారు. కాగా, జికా వైరస్‌ను పారదోలేందుకు కలసికట్టుగా పోరాడుదామని పొరుగు దేశాలను బ్రెజిల్ అభ్యర్థించింది. అటు ఫ్రాన్స్ కూడా గర్భిణులు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.
వైరస్‌పై యుద్ధం ప్రకటించిన యూఎస్..
జికా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్ రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చిన నేపథ్యంలో యూఎస్.. ప్రయోగాలు ముమ్మరం చేసింది. వ్యాక్సిన్, చికిత్స విధానాలను కనుగొనేందుకు యూఎస్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా వర్జీనియాలో ఒకరు, అర్కన్సాస్‌లో మరొకరు జికా వైరస్ బారిన పడినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో ఈ వ్యాధి బారినపడినవారి సంఖ్య 21కి చేరింది.