అగ్రరాజ్యం ‘ఆడేసుకుంది’
ఒలింపిక్స్‌లో తిరుగులేని అమెరికా
పేరులోనే కాదు.. పతకాల్లోనూ అగ్రరాజ్యమే... ఒలింపిక్స్ పుట్టినప్పటినుంచి వెయ్యి స్వర్ణాలు గెలిచినా.. బరిలో దిగితే కచ్చితంగా పతకం పట్టుకురావడమైనా... అది కేవలం అమెరికాకే చెల్లుతుంది. రియోలోనూ పతకాల సెంచరీ కొట్టిన అగ్రరాజ్యం.. మరోసారి తనకు ఎవరూ పోటీ లేరని నిరూపించుకుంది.
బ్రెజిల్‌లో 17 రోజుల పాటు జరిగిన క్రీడోత్సవంలో 207 దేశాలు, 11,544 మంది క్రీడాకారులు పాల్గొన్నా.. పూర్తి ఆధిపత్యం అమెరికాదే. రియోలో మొత్తం 121 పతకాలతో అగ్రరాజ్యం మొదటి స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనతో.. సరికొత్త రికార్డులతో సత్తాచాటింది. ఈత కొలను రారాజు ఫెల్ప్స్ ఐదు బంగారు, ఒక రజత పతకాన్ని సాధించాడు. కేటీ లెడెకీ, సిమోన్ బైల్స్ వంటి క్రీడాకారిణులూ ఈసారి అమెరికా అగ్రస్థానంలో కీలకపాత్ర పోషించారు. అమెరికా తరపున 552 మంది రియో బరిలో దిగగా.. 213 మందికి పతకాలొచ్చాయి.
బ్రిటన్ పునరుత్థానం
ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో బ్రిటన్ హవా కనిపించింది. అమెరికా తర్వాత 67 పతకాలతో బ్రిటన్ రెండో స్థానంలో నిలించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కేవలం ఒకే బంగారు పతకం గెలిచాక మొత్తం క్రీడా విధానాన్నే మార్చేసిన బ్రిటన్.. దీని ఫలితంగా చేపట్టిన మార్పుల ద్వారా రియో పతకాల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఒలింపిక్స్‌లో అమెరికాకు కాస్తో కూస్తో పోటీ అనుక్నున చైనా కూడా ఈసారి పతకాల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. 20 ఏళ్లలో చైనాకు ఇదే చెత్త ప్రదర్శన కావడం గమనార్హం.