బ్రెసీలియా : కరోనా..కరోనా ఇప్పడు ప్రపంచమంతా వినిపిస్తున్న మాట. రోజురోజుకి లెక్కలు మారుతున్నాయి. కోవిడ్ కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా 16,32,629 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, 3,30, 890 కేసులతో శుక్రవారం నాటికి బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. అంతకంతకూ పెరుగుతన్న కేసులు, అవగాహన రాహిత్యంగా తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాల వల్లే బ్రెజిల్‌కు ఈ గతి పట్టిందని నిపుణులు పేర్కొంటున్నారు. శుక్రవారం ఒక్కరోజే 1,001 మరణాలు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా కారణంగా సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 21,048కి చేరిందని తెలిపింది. దీంతో శుక్రవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కోవిడ్ కేసుల్లో రష్యాను అధిగమించి బ్రెజిల్ రెండవ హాట్‌స్పాట్‌గా నిలిచింది. అయితే అతి త్వరలోనే అమెరికాను దాటే అవకాశం కూడా లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. (బ్రెజిల్ ప్రయాణాలపై నిషేధం: ట్రంప్ )
కరోనా వ్యాప్తి కట్టడికి అధ్యక్షుడు జైర్ బోల్సోనారో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. సామాజిక దూరం పాటించే చర్యలపై అధ్యక్షుడు వ్యతిరేకత చూపడం, ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని కరోనాకు క్లోరోక్విన్ మందే మెడిసన్ అంటూ పెద్ద ఎత్తున క్వోరోక్విన్ వాడమని ఒత్తిడి చేయడం లాంటి చర్యలు ఆయన్ని తీవ్ర సంక్షోభంలో నెట్టివేస్తున్నాయి. మలేరియా నిరోధక మందు క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లాంటి మెడిసిన్లు కరోనాను జయిస్తాయని, ఇదే కరోనాకు వ్యాక్సిన్ అని ఇప్పటివరకు పరిశోధనల్లో తేలలేదు. అంతేకాకుండా ఈ మందు అందరిలోనూ ఒకే రకంగా ప్రభావం చూపడం లేదు. కొన్ని దేశాల్లో హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు పనిచేయక చనిపోయిన కరోనా రోగులూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడు బోల్సోనారో మాత్రం కరోనా రోగులపై హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును వినియోగించాలని తీవ్ర ఒత్తిడి చేయడంతో అధ్యక్షుడితో విభేదించి ఇప్పటివరకు ఇద్దరు ఆరోగ్యశాఖ మంత్రులు సహా పలువురు అనుభవఙ్ఞులైన ప్రజారోగ్య నిపుణులు కూడా పదవికి రాజీనామా చేశారు. (బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా ) ప్రస్తుతం ఆయా స్థానాల్లో తాత్కాలికంగా ఆరోగ్య మంత్రిగా ఎడ్వర్డో పజుఎల్లోను నియమించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తేరుకోకపోతే అతి త్వరలోనే కరోనా కేసుల్లో అమెరికాను దాటేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment