అమెరికాలోని కొవింగ్టన్‌లో కోవిడ్ పరీక్షా కేంద్రం వద్ద కార్లలో పౌరుల నిరీక్షణ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ఒమిక్రాన్ ఒక సునామీలా దేశాన్ని కుదిపేస్తోంది. 24 గంటల్లో 10 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం చైనాలోని వూహాన్‌లో బయల్పడిన కరోనా మహమ్మారి ఈ స్థాయిలో విజృంభించడం ఇదే మొదటిసారి. డెల్టా వేవ్‌తో గత ఏడాది మే 7వ తేదీన నమోదైన 4.14 లక్షల కేసులే అమెరికాలో అత్యధికంగా ఉండేది.
గత వారంలో 5,90,000 కేసులతో కొత్త రికార్డు సృష్టించిన అమెరికాలో కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లోనే అంతకు రెట్టింపు కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం సోమవారం ఒక్క రోజే అమెరికాలో 10,82,549 కేసులు నమోదయ్యాయి. మేరీల్యాండ్, అలబామా, డెలవేర్, న్యూజెర్సీ, ఒహాయో రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వచ్చాయి.
క్రిస్మస్, న్యూఇయర్ సెలవుల్లో అమెరికన్లు ఎక్కువగా కలుసుకోవడం, ఇండోర్ పార్టీలు, గెట్ టు గెదర్‌లు అధికంగా జరగడంతో కేసులు విజృంభించాయి. క్రిస్మస్ సెలవుల తర్వాత పాఠశాలలు సోమవారం తెరుచుకోవాల్సి ఉండగా చాలా రాష్ట్రాల్లో సెలవుల్ని పొడిగించారు. కొన్నిచోట్ల ఆన్‌లైన్ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గత వారంలో లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారికి, రెండు మూడు రోజుల్లోనే వ్యాధి తగ్గిపోయిన వారికి క్వారంటైన్ వ్యవధిని అయిదు రోజులకి తగ్గించడం వల్లే కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకి పంపాలంటేనే హడలిపోతున్నారు. అయినప్పటికీ న్యూయార్క్, జార్జియా వంటి రాష్ట్రాల్లో స్కూళ్లను తెరుస్తున్నారు. న్యూయార్క్, మిల్వాకీ, షికాగో, డెట్రాయిట్ వంటి నగరాల్లో క్రిస్మస్ బ్రేక్ తర్వాత పాఠశాలల్ని తెరిచారు. విద్యార్థుల చదువులకి మధ్యలో ఆటంకం కలగకూడదని స్కూళ్లను తీస్తున్నట్టుగా న్యూయార్క్ మేయర్ ఆడమ్స్ చెప్పారు. కరోనాతో సహజీవనం చేయ డం అమెరికన్లు అలవాటు చేసుకోవాలన్నారు.
► జర్మనీలో కరోనా కేసులు 30 వేలకు పైగా నమోదయ్యాయి. అయినప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటించడానికి సుము ఖంగా లేరు. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి
► బ్రిటన్‌లో కేసులు పెరుగుతున్నప్పటికీ లక్షణాలు తీవ్రంగా లేకపోవడం ఊరటనిస్తోంది. మొత్తం కరోనా కేసుల్లో 90 శాతానికి పైగా ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి.
► జపాన్‌లో రోజుకి వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. గత మూడు నెలల్లో కేసులు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.
(చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు)
మరోవైపు వైరస్ విజృంభణతో బైడెన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఇతర ఉన్నతాధికారులతో అమెరికా అధ్యక్షుడు వర్చువల్‌గా అత్యవసర సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇక 12 నుంచి 15 ఏళ్ల వయస్సు పిల్లలతో పాటు ప్రజలకు బూస్టర్ డోస్ అందించేందుకు ఫైజర్‌కు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతులు ఇచ్చింది. కాగా, యూఎస్‌లో ఇప్పటి వరకూ 62 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
(చదవండి: మనుషులుండే ఊరు.. మనిషిలా ఉండే ఊరు..)
Comments
Please login to add a commentAdd a comment