ఆహార భద్రతకూ ఆధార్
ఆహార భద్రత’కు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నాం. పేదలకు పట్టెడన్నం పెట్టాలనే సంకల్పంతో అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా ఈ చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి ఆధార్ సీడింగ్ లేకున్నా రేషన్ తీసుకోవచ్చు
- కాట ఆమ్రపాలి, జేసీ-2
⇒ ప్రస్తుతానికి సీడింగ్ లేక పోయినా సరుకులు
⇒భవిష్యత్తులో అనుసంధానం తప్పనిసరి
⇒ప్రజాపంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకూడదనే..
⇒రేషన్‌షాపులను హేతుబద్ధీకరిస్తాం
⇒కార్డులకు అనుగుణంగా దుకాణాలు
⇒‘సాక్షి’తో జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఆహార భద్రతకు ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్టవేయవచ్చని జాయింట్ కలెక్టర్-2 కాట ఆమ్రపాలి అభిప్రాయపడ్డారు. జే సీ-2గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రస్తుతం ఆధార్ సీడింగ్ లేనప్పటికీ నిరభ్యంతరంగా నిత్యావసరాలు తీసుకోవచ్చని, భవిష్యత్తులో మాత్రం ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు.
57.28 శాతమే సీడింగ్!
జిల్లాలో 11.78 లక్షల మందికి ఆహారభద్రత కార్డులున్నాయి. వీటిలో 57.28 శాతం కార్డులకే ఆధార్ సీడింగ్ జరిగింది. మిగతా కార్డులకు ఆధార్‌ను అనుసంధానించాల్సివుంది. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా 98 శాతం ఆధార్‌కార్డులు జారీ చేసినప్పటికీ, సమగ్ర కుటుంబ సర్వే సమాచారంతో క్రోడీకరించడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొత్తగా మరోసారి ఆధార్ సీడింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల ప్రమేయంలేకుండా రెవెన్యూ యంత్రాంగమే ఈ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేస్తున్నది. ఇదంతా పూర్తయ్యేవరకు ఆధార్‌లేకున్నా.. రేషన్ షాపుల్లో సరుకులు తీసుకోవచ్చు.
దుకాణాలను హేతుబద్ధీకరిస్తాం
చౌకధరల దుకాణాల సంఖ్య పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. కార్డుల సంఖ్యకు అనుగుణంగా షాపులను హేతుబద్ధీకరించనున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఒక షాపు పరిధిలో సగటున 650 కార్డులుండగా, గ్రామీణ ప్రాంతాల్లో సగటున 400 కార్డులున్నాయి. గ్రేటర్ పరిధిలో మాత్రం కొన్ని షాపుల్లో నిర్ధేశిత సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారా కొత్త దుకాణాల ఆవశ్యకతను అంచనా వేయగలుగుతాం.
ప్రతినెలా 26వేల మెట్రిక్ టన్నులు
జిల్లాలో ప్రతి నెల 26వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నాం. కుటుంబంలో ప్రతి వ్యక్తికి 6 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో అసాధారణం గా కోటా పెరిగింది. గతంలో 36 లక్షల యూనిట్లు ఉండగా, ఇప్పుడది 43 లక్షలకు చేరింది. ఈ నెల కిరోసిన్ కోటా పెంచాం. యూనిట్‌కు 3 లీటర్లు పంపిణీ చేస్తున్నాం.