మహానగరంలో అర్హులైన నిరుపేదలందరికీ వచ్చే జనవరి మాసం నుంచి ఆహార భద్రత పథకం బియ్యం పంపిణీ చేయనున్నారు.
జనవరి నుంచి ఆహార భద్రత బియ్యం పంపిణీ
కార్డుకు 30 కిలోల వరకు పరిమితి
నెలాఖరులోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి
పాత కార్డులపై సైతం బియ్యం సరఫరా
సిటీబ్యూరో: మహానగరంలో అర్హులైన నిరుపేదలందరికీ వచ్చే జనవరి మాసం నుంచి ఆహార భద్రత పథకం బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున మొత్తం 30 కిలోల వరకు బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆహార భద్రత కార్డుల జారీతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబాలతో పాటు పాత రేషన్ కార్డుదారులకు సైతం బియ్యం అందించనున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సిబ్బంది కొరతతో అలస్యంగా ప్రారంభమైనప్పటికీ దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన ఈనెలాఖరులోగా పూర్తి చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 23.13 లక్షల కుటుంబాలు ఆహార భద్రత కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. కాగా ఆహార భద్రత దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ఇప్పటి వరకు 15 లక్షలు దాటలేదని అధికార గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అందులో హైదరాబాద్ నగరం మరింత వెనుకబడి పోయింది. ఇక్కడ సుమారు 9.44 లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 4 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. రంగారెడ్డి జిల్లాలో 13.69 లక్షల దరఖాస్తులకుగాను గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన 80 శాతం పరిశీలన పూర్తి కాగా, అర్భన్ ప్రాంతంలో కనీసం 40 శాతం కూడా పరిశీలన పూర్తి కానట్లు తెలుస్తోంది.
జనవరి నుంచి ఆహార భద్రత కోటా..
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో జనవరి నుంచి ఆహార భద్రత పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. జనవరి మాసానికి సంబంధించిన బియ్యం కోటా తయారు చేసి ప్రతిపాదనలు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా కార్డుల జారీతో సంబంధం లేకుండా ఆహార భద్రత పథకం కింద బియ్యం పంపిణీకి రంగం సిద్ధ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అర్హులందరికీ ఆహార భద్రత బియ్యం
ఆహార భద్రత దరఖాస్తుల పరిశీలన ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం. కార్డు జారీతో సంబంధం లేకుండా అర్హులందరికీ జనవరి నుంచి బియ్యం పంపిణీ చేస్తాం.
- డాక్టర్ పద్మ, చీఫ్ రేషనింగ్ అధికారిణి,
సివిల్ సప్లై, హైదరాబాద్