* విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన
* సర్పంచ్ అరెస్ట్‌కు డిమాండ్
ఆదిలాబాద్ అర్బన్ : ఆహారభద్రత కార్డుల జాబితా విషయంలో భీమిని తహశీల్దార్ దేవానంద్‌పై దాడికి పాల్పడిన మండల పరిధిలోని నాయినిపేట సర్పంచ్ అశోక్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా మెయిన్ గేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగులు అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రేస) జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ భీమిని తహశీల్దార్ దేవానంద్‌పై దాడి చేసిన నాయినిపేట సర్పంచ్ అశోక్‌ను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని కలెక్టర్ జగన్మోహన్ చెప్పారని, కానీ ఇంత వరకు అరెస్ట్ చేయలేదన్నారు. దీనికి నిరసనగా సోమవారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టినట్లు తెలిపారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు సరికాదన్నారు.
తహశీల్దార్‌పై దాడిని అన్ని ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్‌ను గజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు రాజేశ్వర్, సుభాష్‌చందర్, చంద్రశేఖర్, అతికొద్దీన్, సంజయ్‌కుమార్, విలాస్, సదానందం, శ్రీకాంత్, షీల, సుజాత, జ్యోతి, ఉద్యోగులు పాల్గొన్నారు.
సంఘాలు, నాయకుల మద్దతు
తహశీల్దార్‌పై దాడికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు వివిధ సంఘాలు, నాయకులు మద్దతు తెలిపారు. బీజేపీ జిల్లా నాయకుడు పాయల శంకర్ మద్దతు తెలిపారు. వీరితో పాటు గజిటెడ్ అధికారులు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, నాయకులు గుణవంత్‌రావు, టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి వనజారెడ్డి, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు రాజసమ్మయ్య, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ నాయకుడు సుధాకర్‌రెడ్డి తదితరలు మద్దతు తెలిపారు. కాగా జైనథ్ తహశీల్దార్‌తో, రెవెన్యూ ఉద్యోగులంతా పెన్‌డౌన్ నిర్వహించారు.
సర్పంచ్ అరెస్ట్
బెల్లంపల్లి : భీమిని తహశీల్దార్ జుమ్మిడి దేవానంద్‌పై దాడికి పాల్పడిన నాయకునిపేట సర్పంచ్ ఓడేటి అశోక్‌ను సోమవారం అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి డీఎస్పీ ఎ.రమణారెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న తహశీల్దార్‌ను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల ధర్నా
Published Tue, Jan 6 2015 3:49 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement
Advertisement