నేటి నుంచి ఈ-పాస్
అమలులోకి ‘ఆహార భద్రత’
పెరగనున్న బియ్యం కేటాయింపులు
అధికారుల్లో టెన్షన్..టెన్షన్
విశాఖపట్నం : జిల్లా పౌరసరఫరాల శాఖాధికారుల్లో ఏప్రిల్ ఒకటో తేదీ సమీపిస్తున్నకొద్దీ టెన్షన్ ఎక్కువై పోతోంది. ఒకేసారి రెండు పథకాలు బుధవారం నుంచి ప్రారంభం కావడంతో అమలులో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులుతలెత్తుతాయోననే ఆందోళన వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలో 2063 రేషన్‌దుకాణాలున్నాయి. తొలిదశలో జీవీఎంసీతో పాటు భీమిలి, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచలి మున్సిపాల్టీల పరిధిలోని 686 షాపుల్లో ఈ-పాస్ అమలు చేస్తున్నారు. జీవీఎంసీలోని 72 డివిజన్ల పరిధిలో ఉన్న 412 షాపుల్లోనూ ఈపాస్ విధానాన్ని అమలుచేస్తుండగా, ఇతర మున్సిపాల్టీల్లో మరో 274 షాపుల్లో ఈ విధానాన్ని వర్తింపచేస్తున్నారు. సిటీ పరిధిలో 290 షాపుల్లో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ప్రవేశపెడుతున్నారు.
వేలిముద్రల సేకరణలో తలెత్తు తున్న ఇబ్బందులను అధిగమించేందుకు సిటీ పరిధిలోని 412 షాపులకు ఐరిష్ కాప్చర్ మిషన్లను సరఫరా చేశారు. ఈపాస్‌లో వేలిముద్రలు పడకపోతే ఈ ఐరిష్ ద్వారా ఐ బాల్ కాప్చర్ చేసి సరుకులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో పంపిణీ చేసిన ఈ పాస్ మిషన్లలో175 మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. 60 షాపుల్లో సిగ్నెల్ సమస్యలుండగా, ఈ-పాస్ మిషన్ల విషయంలో 34షాపుల్లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. సాప్ట్ వేర్ సమస్యలతో ఇప్పటికే 21 మిషన్లను వెనక్కి పంపారు. నెట్‌వర్క్ సమస్యలను అధిగమించేందుకు 70 షాపుల్లో యాంటినాలు ఏర్పాటు చేశారు. 290 షాపుల్లో ఐడియా 2 జీ సిమ్‌తో పాటు ఎయిర్‌టెల్ 2 జీ సిమ్‌లు ఏర్పాటు చేయగా, 340 షాపుల్లో ఎయిర్‌టెల్ 3 జీ సిమ్‌లను ఏర్పాటు చేశారు. సిటీ పరిధిలో 3,71,625 కార్డు దారులకు ఈ కొత్త ఈ-పాస్ విధానంలో నేటి నుంచి సరుకులు పంపిణీ జరుగనుంది. కచ్చితంగా వేలిముద్రలు సేకరించిన కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు వస్తే కాని సరుకులు తీసుకునే అవకాశం ఉండదు.
ఇక ఇతర మున్సిపాల్టీల పరిధిలో 133 షాపుల్లో ఈ పాస్ మిషన్లు ఏర్పాటు చేయగా, వీటిలో కూడా సగం షాపుల్లో సాంకేతిక, నెట్‌వర్క్ సమస్యలు నెలకొన్నాయి. ఈ సమస్యలన్నీ అధిగమించి ఈ విధానాన్ని సమర్ధంగా అమలుకు జిల్లా జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతీ డిపోలోనూ వీటి అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ఆహార భద్రత పథకం అమలుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి అమలవుతున్న ఈ కార్యక్రమం కోస అవసరమైన అదనపు కేటాయింపులను ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌డిపోలకు చేరవేశారు. జిల్లాలో 10,45,838 తెలుపు, 75,889 ఏఏవై, 1,035 అన్నపూ ర్ణ కార్డులు న్నాయి. వీటిపరిధిలో 39,17,354యూనిట్స్(మంది)లో 5,06,777యూనిట్స్‌ను తొలగిం చగా, 34,10,577 యూనిట్స్ కు సీడింగ్ పూర్తయింది. వీటికి నేటి నుంచి ఐదేసి కిలోల చొప్పున సరఫరా చేయనున్నారు. ఇప్పటి వరకు బీపీఎల్ కార్డుదారులకు 15636.633ఎంటీలు సరఫరా చేస్తుండగా, నేటి నుంచి 18,677.145ఎంటీల బియ్యాన్ని కేటాయించారు. కా ర్డులో సభ్యుల సంఖ్యతో ప్రమేయంలేకుండా ఎంతమంది సభ్యులుంటే అంతమందికి ఒక్కొక్కరికి ఐదేసి కిలోల చొప్పున నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయం నుంచి మండలస్థాయి గోదాముల వరకు పూర్తిగా కంప్యూటీకరించారు. సప్లయి చైన్డ్ మేనేజ్‌మెంట్(ఎంసీఎం) ద్వా రా వీటిని అనుసంధానం చేశారు. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి సరుకు బయలుదేరగానే లారీ నంబర్, సరుకు వివరాలు ఏ మార్గంలో వస్తున్నదీ మండలస్థాయి గోదాములో ఉండే కంప్యూటర్‌లో తెలుస్తాయి.
పకడ్బందీగా అమలు
ఆహార భద్రత పథకంతో పాటు కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పాస్ విధానాన్ని జిల్లాలో పగడ్బందీగా అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నూరు శాతం ఈ రెండు విజయవంతంగా అమలుకు పౌరసరఫరాలశాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు. ప్రారంభంలో ఏమైనా సాంకేతిక సమస్యలు వచ్చినా సత్వరమే అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -జనార్దన్ నివాస్, జేసీ
చౌకధరల దుకాణాల్లో నేటి నుంచి ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) విధానంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరొక పక్క జాతీయ ఆహారభద్రత పథకాన్ని కూడా బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అమలుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రారంభానికి ముందే ఈ పాస్ మిషన్లు మొరాయి స్తున్నా.. సెల్ నెట్‌వర్కులు సరిగా పనిచేయకున్నా అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.