సాక్షి ప్రతినిధి, ఖమ్మం : కొత్త ఆహార భద్రత కార్డుల జారీలో స్పష్టత కరువైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా జిల్లాలో జనవరి 1న కొత్త కార్డులు అందించే పరిస్థితి కని పించడం లేదు. ఒక వైపు ఆహారభద్రత కార్డుల పరిశీలన, డేటా ఎంట్రీ కొనసాగుతుండగా, మరో వైపు పథకం ప్రారంభ సమయం ముంచుకొస్తోంది. లబ్ధిదారులు, అధికారుల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు మాత్రమే రేషన్ పంపిణీ చేసేందుకు నూతనంగా ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని జనవరి 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే కార్డులపైన ప్రభుత్వం ఇంకా స్పష్టతను ఇవ్వకపోవడం, ఈ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకోవడంతో కార్డుల జారీ ఇప్పట్లో లేనట్టేనని తెలుస్తోంది.
ఏడు లక్షల మందికి పైగా అర్హులు..
జిల్లాలో 8,59,260 కుటుంబాలకు గానూ 7,93,694 మంది ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 7,75,689 దరఖాస్తులను పరిశీలించారు. 7,00,260 మందిని అర్హులుగా గుర్తించాల్సి ఉంది. మిగిలిన 18 వేల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. పరిశీలించిన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రకియ కొనసాగుతోంది. అర్హుల దరఖాస్తులను ఆన్‌లైన్ చేయడంతో పాటు ఆధార్‌ను అనుసంధానం చేయాల్సి ఉంది.
దీనిలో కొంతమేర జాప్యం జరుగుతోంది. అయితే సవరించిన నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాతాల్లో ఏడాదికి రూ. లక్షన్నర ఆదాయం, 7.5 ఎకరాల మెట్ట, 3.5 ఎకరాల మాగాణి భూమికి మించకుండా ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు ఆ దాయం మించకుండా ఉన్న వారు అర్హులు. ఆసరా ఫథకంలో అనేక మంది అర్హులకు అన్యాయం జరగడంతో ఆహార భద్రత కార్డులపై అందరి దృష్టి ఉంది. ఆహార భద్రత విషయంలోఎలాంటి తప్పులు దొర్లకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికార యత్రాంగం కిందిస్థాయి అధికారులను ఆదేశించింది. అయితే ఈ ప్రకియ పూర్తయితే తప్ప లోపాలు బయటపడే అవకాశం లేదు.
ఆన్‌లైన్‌లోనూ వెనుకంజ
ఆహారభద్రత కార్డుల అర్హుల జాబితాను ఆన్‌లైన్ చేయడంలోనూ రాష్ట్రంలోనే జిల్లా వెనుకబడే ఉంది. అన్ని జిల్లాల్లో 50 శాతం మేరకు నమోదు కాగా, జిల్లాలో మాత్రం 7,00,260 కార్డులకు లక్ష మాత్రమే ఆన్‌లైన్ చేశారు. ఇంకా 6 లక్షల కార్డులను ఆన్‌లైన్ చేయాల్సి ఉంది. దీంతోపాటు ఆధార్ అనుసంధానం చేయడంతో ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
మంత్రి తుమ్మలచే ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆహార భద్రత పథకాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులు మీదుగా ప్రారంభించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో జనవరి 1న లక్ష కుటుంబాలకు ఆహారభద్రతను అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులు పరుగులు తీస్తున్నారు. అయితే ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించాలనే విషయంపై స్పష్టత లేదు. ఈ ప్రకియ పూర్తయినా, కాకపోయినా జనవరి 1నుంచి కొత్త రేషన్ విధానం ప్రకా రం వ్యక్తికి 6 కిలోల చొప్పున అర్హులకు మాత్రమే పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి పక్షాలు మాత్రం దీనిలో లోపాలను ఎత్తి చూపేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వార్డులు, గ్రామాల వారీగా అర్హుల జాబితాను బట్టి రేషన్‌షాపుల వారీగా విభజించేందుకు రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపడుతోంది.
సన్నబియ్యం లేనట్టే..
ఆహారభద్రత పథకంలో జిల్లాలో అర్హులైనా కుటుంబాలకు సన్న బియ్యం అందించేలా చర్యలు చేపడతామని అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన బియ్యం తెలంగాణకే ఉపయోగించాలని, జిల్లాలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని జిల్లా అవసరాలకే ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించిందని అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు బియ్యం పూర్తిస్థాయిలో లేకపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాక పోవడంతో అధికారులకు ఏమి పాలుపోవడం లేదు. సంక్షేమ హాస్టల్స్, మధ్యాహ్న భోజనానికి మాత్రమే సన్నబియ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కొత్త కార్డులెప్పుడో..?
Published Sun, Dec 28 2014 1:43 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement
Advertisement