సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆహార భద్రత కార్డులు పక్కదారిపట్టాయి. దాదాపు 30 శాతం మంది అనర్హులకు ఈ కార్డులు అందాయి. వీరికి ప్రభుత్వం అందించే పీడీఎస్ బియ్యం అవసరం లేకున్నా కార్డులు తీసుకున్నారు. ఈ పాస్ విధానం అమలు కారణంగా అక్రమార్కుల చిట్టా బయటపడుతోంది. చాలా మందికి అవసరం లేకున్నా కేవలం కార్డు రద్దవుతుందనే భయంతో బలవంతంగా బియ్యం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొందరు బియ్యం కొనుగోలు చేసి షాపుల్లో, టిఫిన్ సెంటర్ల యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
ఆహార భద్రత కార్డుదారుల్లో సగానికి పైగా మధ్యతరగతి కుటుంబాలున్నాయి. దీంతో రేషన్ బియ్యంపై ఆసక్తి తగ్గింది. ప్రస్తుతం కుటుంబంలోని సభ్యుడికి ఆరు కిలోల చొప్పున ఎంత మంది సభ్యులు ఉంటే అన్ని కిలోల బియ్యం పంపిణీ జరుగుతోంది. రేషన్ బియ్యం నాసిరకం, నాణ్యతా లోపం కారణంగా వాటిని వండుకొని తినేందుకు మధ్యతరగతి వారు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. రేషన్ షాపునకు వెళ్లి ప్రతి నెలా బియ్యం కోనుగోలు చేయకుంటే.. ఈ పాస్ పద్ధతి కారణంగా మూడు మాసాల తర్వాత కార్డు రద్దవుతుందనే నిబంధన ఉండేది. దీంతో చాలా మంది కార్డును రద్దు కాకుండా చూసుకునేందుకే బియ్యం తీసుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య 30 శాతం పైనే ఉందని తెలుస్తోంది.
బహుళ ప్రయోజనకారి...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డులు రద్దు చేసి ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. గతంలో తెల్లరేషన్ కార్డు బహుళ ప్రయోజన కారి కావడంతో నిరుపేదలతో పాటు మధ్య తరగతి, నాలుగ అంకెల జీతం కలిగిన ప్రయివేటు ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకొని ఆహార భద్రత కార్డులు పొందారు. ప్రభుత్వం కార్డు దారుడి కుటుంబంలో సభ్యుడు (యూనిట్)కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటా కేటాయిస్తోంది. గత రెండేళ్ల క్రితం వరకు మ్యానువల్ పద్ధతిలో బియ్యం పంపిణీ కొనసాగేది. గత రెండేళ్ల క్రితం ఈ–పాస్ ద్వారా సరుకులు పంపిణీ ప్రారంభం కావడంతో డీలర్ల చేతివాటానికి అడ్డుకట్ట పడింది. దీంతో రేషన్ బియ్యం అత్యవసరం లేనివారు రెండు మూడు నెలల ఒకసారి బియ్యం కొనుగోలు చేసి కార్డు రద్దు కాకుండా కాపాడుకుంటూ వచ్చారు. తాజాగా బియ్యం తీసుకోకున్నా కార్డులు రద్దు కావని అధికారులు ప్రకటించడంతో వీరంతా ఉపశమనం పొందారు.
ఇదీ పరిస్థితి
గ్రేటర్ హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సర్కిల్స్ 12 ఉన్నాయి. మొత్తం 1545 ప్రభుత్వ చౌకధరల దుకాణాలు ఉండగా, వాటి పరిధిలో కార్డుల సంఖ్య 10.94 లక్షలపైనే. అందులో 41.42 లక్షల లబ్ధిదారులు (యూనిట్లు) ఉన్నారు. ఇందుకు గాను నెలసరి బియ్యం కేటాయింపులు 26 వేల మెట్రిక్ టన్నులు పైనే ఉంటాయి. ప్రతినెల ఈ పాస్ అమలుతో సగటున 30 నుంచి 40 శాతం సరుకులు డ్రా కావడం లేదు. తాజాగా సరుకులు తీసుకోకున్నా కార్డు రద్దు కాదన్న అధికారుల ప్రకటనతో సరుకులు డ్రా చేయని కార్డుదారుల సంఖ్య మరింత పెరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment