అందరికీ కార్డులు మా బాధ్యత
- గులాబీ కార్డుపై రేషన్ బియ్యం
- కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
- కేసీఆర్ విజన్ ఉన్న నేత
- ఆర్థిక మంత్రి ఈటెల
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : చివరి కుటుంబానికీ ఆహార భద్రత కార్డు అందించేవరకు ప్రభుత్వం విశ్రమించదని పౌరసరఫరాలు, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆహారభద్రత కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, దీనిపై కొన్ని శక్తులు సృష్టిస్తున్న వదంతులు నమ్మవద్దని సూచించారు. శనివారం ‘మిషన్ కాకతీయ’పై రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఈటెల ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నేత అని, విప్లవాత్మక నిర్ణయాలతో పేదల పక్షపాతిగా చరిత్రకెక్కుతున్నారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణకు పునాదిరాయిగా సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా మారిందని అన్నారు.
కుటుంబంలో ప్రతి సభ్యుడికి 6 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించామని, గతంలో తెల్ల రేషన్‌కార్డుపై సరఫరాచేసే సరుకులను ఇకపై గులాబీ కార్డుపై పంపిణీ చేస్తామని, పింక్ కార్డుపై ఇచ్చేవాటిని తెల్లకార్డుపై ఇవ్వనున్నట్లు ఈటెల స్పష్టం చేశారు. రేషన్ కార్డులను తొలగించే ప్రసక్తేలేదని, అర్హులైనవారందరికీ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. ముక్కిన బియ్యంతో వండే ఆహారాన్ని తినలేక ఆకలితో అలమటించే హాస్టల్ విద్యార్థులకు ఇకపై సన్న బియ్యంతో భోజనాన్ని వడ్డించనున్నట్లు తెలిపారు. అలాగే స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలోనూ సన్న బియ్యాన్ని వినియోగించనున్నట్లు ఈటెల తెలిపారు.
పెంచిన రేషన్ కోటా, విద్యార్థులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి కొత్త ఏడాదిన శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నిధుల కొరత రానివ్వకుండా కొత్త పథకాలకు రూపకల్పన చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మిషన్ కాకతీయకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, చెరువుల పునరుద్ధరణకు ఆర్థిక సమస్యలేదని అన్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. చెరువు బాగుంటే ఊరుబాగుంటుందని, ఆంధ్రపాలకుల నిర్లక్ష్యంతోనే జల వనరులు కనుమరుగయ్యాయని అన్నారు. వచ్చే ఐదేళ్లలో 46వేల చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటి కోసం రూ.25వేల కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపారు.