
అదనపు బియ్యం.. ఇవ్వం!
ఆహారభద్రత పథకం కింద అదనపు బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విన్నపాలను కేంద్రం పట్టించుకోవడంలేదు.
సాక్షి, హైదరాబాద్: ఆహారభద్రత పథకం కింద అదనపు బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విన్నపాలను కేంద్రం పట్టించుకోవడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలోని పేదరిక గణాంకాలను లెక్కగట్టి కోటా కేటాయించడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్న 6 కిలోల బియ్యంతో ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలన్న వినతిపై కేంద్రం స్పందించడంలేదు.
2 రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న బియ్యం పథకాన్ని కేంద్రం ప్రశంసిస్తూ ఊరడించిందే కాని అదనపు బియ్యం కోటా కేటాయింపులపై మాత్రం ఎలాంటి ఉదారత చూపలేదు. పేదరికమే ప్రాతిపదికగా తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బియ్యం కోటా పెంచాలన్న విజ్ఞప్తిని అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది. సెప్టెంబర్ 30లోగా అధికారికంగా ఆహారభద్రత పథకాన్ని అమలు చేయాలని సూచించినట్లు సమాచారం. ఆహారభద్రతా చట్టాన్ని అమలు చేసే దశలో కేంద్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా, పేదరికాన్ని పరిగణనలోకి తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం, పట్టణ ప్రాంతాల్లోని 41.14 శాతం మందికి చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ లెక్కన తెలంగాణలో మొత్తంగా 1.91 కోట్ల మందిని అర్హులుగా తేల్చిన కేంద్రం వీరి అవసరాల మేరకు 13.36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఆహార భద్రతాకార్డులకు అర్హత సాధించిన వారి సంఖ్య 2.83 కోట్ల పైచిలుకుగా ఉంది. ఆహార భద్రత చట్టం కింద కేంద్రం 4 కేజీల బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తుండగా రాష్ట్రం దానికి అదనంగా మరో 2 కిలోలను కలిపి పంపిణీ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఏటా బియ్యం అవసరాలు 18 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉన్నాయి. రాష్ట్రంపై 5 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు భారం పడుతోంది.