ఇథనాల్ చాంబర్లు ఏర్పాటు చేయండి | Ethanol is to set up chambers | Sakshi
Sakshi News home page

ఇథనాల్ చాంబర్లు ఏర్పాటు చేయండి

Published Tue, Nov 17 2015 11:40 PM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

ఇథనాల్ చాంబర్లు ఏర్పాటు చేయండి - Sakshi

ఇథనాల్ చాంబర్లు ఏర్పాటు చేయండి

పండ్ల వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురండి
♦ సాధ్యాసాధ్యాలను కోర్టు ముందుంచండి
♦ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు
♦ కార్బైడ్ వినియోగాన్ని కనిష్టస్థాయికి తీసుకురావాలి
♦ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టీకరణ
♦ తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: కాయలను పక్వానికి తీసుకొచ్చేందుకు కాల్షియం కార్బైడ్ వినియోగించకుండా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన ఇథనాల్ చాంబర్లను ఏర్పాటు చేసి, అవి పండ్ల వ్యాపారులకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని హైకోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, సీరియస్‌గా పరిశీలించాలని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను తమ ముందుంచాలని సూచించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాయలను పక్వానికి తీసుకొచ్చేందుకు పండ్ల వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వాడుతున్నారని, ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో పిటిషన్‌గా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారించింది.

 ఒక్క పోస్టరూ కనిపించదేం!
 కాల్షియం కార్బైడ్ వాడే పండ్ల వ్యాపారులు అనుసరించే ఎత్తుగడలు తెలుసా? అని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. తెలుసని ఆయన బదులిచ్చారు. తనిఖీలు చేసినప్పుడు వారి వద్ద కార్బైడ్ ఉండదని, పండ్ల రవాణా సమయంలోనే వినియోగిస్తున్నారని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, తమ ఆదేశాల నేపథ్యంలో పండ్ల వ్యాపారులు మార్కెట్‌లలో కాకుండా బయట కార్బైడ్ వాడుతున్న విషయం మీకు తెలుసా? అంటూ ప్రశ్నించింది. మార్కెట్‌లలో కాకుండా పలు కాలనీల్లో గదులను అద్దెకు తీసుకుని వాటిలో కార్బైడ్ ద్వారా పండ్లు పక్వానికి వచ్చేలా చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాన్ని ఆయన చేత చదివించింది. కార్బైడ్ వాడటం చట్టరీత్యా నేరమంటూ చేస్తున్న ప్రచారానికి సంబంధించి ఒక్క పోస్టర్‌ను కూడా తాము ఏపీ, తెలంగాణలో ఎక్కడా చూడలేదని ఆక్షేపించింది.

 కాగితాలపై కాదు చేతల్లో చూపండి
 కార్బైడ్ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉందని ఈ కేసులో కోర్టు సహాయకారి(అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిని ధర్మాసనం అడిగింది. ఇథనాల్ చాంబర్లలో కాయలను ఉంచితే అవి పండ్లుగా మారుతాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన విధానమని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఆహార భద్రత ప్రమాణాల చట్టం కింద సంబంధిత కోర్టులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. దీనిపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం, పనులను చేతల్లో చూపాలని, కాగితాల్లో హామీలివ్వొద్దని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. మామిడి పండ్ల సీజన్ వచ్చే నాటికి కార్బైడ్ వినియోగాన్ని కనిష్ట స్థాయికి తీసుకురావాలని సూచించింది. కార్బైడ్ వినియోగంపై ఫిర్యాదు చేసేందుకు తగిన యంత్రాంగం ఉండాలని పేర్కొంది. అధికారుల ఫోన్ నంబర్లను పోస్టర్లలో ముద్రించి, అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement