ఆటో డ్రైవర్లకు కేంద్ర కార్మికశాఖ ప్రకటించిన ఈఎస్‌ఐ వైద్య సౌకర్యానికి అతీగతీ లేదు. ఈ పథకం ప్రారంభించి ఐదునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు.
సాక్షి, హైదరాబాద్: ఆటో డ్రైవర్లకు కేంద్ర కార్మికశాఖ ప్రకటించిన ఈఎస్‌ఐ వైద్య సౌకర్యానికి అతీగతీ లేదు. ఈ పథకం ప్రారంభించి ఐదునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. దీనిపై కేంద్ర కార్మికశాఖ నుంచి నోటిఫికేషన్ ఇంకా రాలేదని చెబుతూ అధికారులు మొహం చాటేస్తున్నారు. ఆటోడ్రైవర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు, ఇళ్లలో పనిచేసేవారు.. ఇలా అసంఘటిత రంగ కార్మికులందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఏడాదికాలంగా పదే పదే ప్రకటిస్తున్నారు.
మొదటగా ఆటోడ్రైవర్లకు ఈఎస్‌ఐ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామంటూ ఈ ఏడాది జనవరి మొదటివారంలో హైదరాబాద్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. కొంతమందికి ఈఎస్‌ఐ కార్డులను కూడా పంపిణీ చేశారు. ఆటోడ్రైవర్లకు కల్పించిన ఈఎస్‌ఐ మెడికల్ స్కీం కింద కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని, అందుకోసం ఒక్కో ఆటోడ్రైవర్ తన వాటాగా ఆరు నెలలకోసారి రూ.1500 చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది.
ఈఎస్‌ఐ బ్రాంచ్‌లలో డబ్బులు చెల్లించి కార్డులు తీసుకోవాలని, ఈ కార్డు ద్వారా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అన్ని వైద్యసేవలతోపాటు మందులను కూడా ఉచితంగా పొందవచ్చని తెలిపింది. కానీ, ఇప్పటి వరకు ఆటోడ్రైవర్ల నుంచి ఒక్క దరఖాస్తును కూడా స్వీకరించలేదు. దీంతో హైదరాబాద్‌లోని దాదాపు 1.5 లక్షల మంది ఆటోడ్రైవర్లు ఈఎస్‌ఐ వైద్యసేవల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆటోడ్రైవర్లు నిత్యం ఈఎస్‌ఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశగా వెనుదిరుగుతున్నారు.