జాతీయ ఆహార భద్రత పథకానికి అర్హులైన వారు 29.3 లక్షల మంది ఉన్నట్టు గుర్తించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వెల్లడించారు.
అమలాపురం టౌన్ : జిల్లాలో జాతీయ ఆహార భద్రత పథకానికి అర్హులైన వారు 29.3 లక్షల మంది ఉన్నట్టు గుర్తించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వెల్లడించారు. ఆ పథకానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అమలాపురం ఆర్డీఓ కార్యాయంలో డివిజన్‌లోని తహశీల్దార్లతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 52, 85,824 జనాభా ఉండగా అందులో 29,03,699 మందికి ఆహారభద్రత పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులకు పౌర సరఫరాల శాఖ ద్వారా ఇచ్చే సరుకులకు సంబంధించి కార్డులను రెండు రకాలుగా విభజించామన్నారు.
నిర్దేశించిన అంశాల్లో అర్హులుగా గుర్తించిన వారి కార్డులపై జాతీయ ఆహార భద్రత చట్టం స్టాంపు వేస్తామని చెప్పారు. మిగిలిన కార్డులకు యథావిధిగా నిత్యావసర సరుకులు ఇస్తామన్నారు. ఈ వర్గీకరణ వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ ఉండవన్నారు. ఏ ఒక్క కార్డునూ తొలగించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఆహార పథకం లబ్ధిదారులకు బియ్యం అందించమే కాకుండా లెప్రసీ, హెఐవీ, దీర్ఘకాలిక రోగ పీడితులు, వితంతువులు, ఉపాధి హామీ పథకం అందని వారిని గుర్తించి వివిధ అంశాల్లో తోడ్పాటునివ్వడం జరుగుతుందన్నారు. అమలాపురం ఆర్డీఓ జి.గణేష్‌కుమార్‌తోపాటు డివిజన్‌లోని తహశీల్దార్లు పాల్గొన్నారు.