
సహకారమా.. స్వాహాకారమా?
రెండో మాట
ఈ సంస్కరణలకు భారత పాలకులు ‘డూడూ బసవన్నల్లా’ తలలూపారు. ‘అధికార బసవన్న’లు కూడా తమ చేతికి మట్టి అంటుకోకుండా అనుకూల ముద్రలు వేశారు. ఇందుకు తొలి ఉదాహరణల్లో ఒకటి– ‘నరసింహం కమిటీ’. వ్యవసాయ రంగానికి కల్పించాల్సిన ప్రభుత్వ పరపతి (రుణ) సౌకర్యంలో భారీ ఎత్తున కోత విధించడాన్ని సమర్థిస్తూ ఈ కమిటీ సిఫారసు చేసింది. ప్రపంచబ్యాంక్, అమెరికా పాలకులు బహుళజాతి గుత్త సంస్థల మెరమెచ్చులకోసం ఇలాంటి పనులెన్నో చేశారు.
‘అన్నార్తులైన ప్రజలు హేతువాదాన్నీ, సత్యాన్నీ వినిపించుకోరు. న్యాయం జరుగుతోందా లేదా అన్న అంశాన్ని కూడా పట్టించుకోరు. నీవు ఎన్ని ప్రార్ధనలు చేసినా వారు లొంగరు అని రోమన్ తత్వవేత్త సెనెకా రెండువేల ఏళ్ల నాడే చెప్పాడు. ఇంతకూ మన దేశ ప్రజల ఆకలిదప్పులు మార్కెట్‌లో తగినంత ఆహారం లేకకాదు. బతికి బట్టకట్టడానికీ, ఊపిరి నిలుపుకోవడానికీ తగినన్ని అవకాశాలు లేనందువల్ల. తగినంత కొలుగోలు శక్తి లేనందువల్ల. ఈ దురవస్థ అందుకేనని గ్రహించాలి. కొనుగోలు శక్తి లేకపోవడం, దారిద్య్రాల వల్లనే పేద కుటుంబాలకు తగిన ఆహార పదార్థాలు, శక్తి (కేలరీలు) సమకూడడం లేదు. దేశంలో పుష్కలంగా ఆహారధాన్యాలు లభ్యం కావడమే ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. ఇటు దేశాభివృద్ధికీ, అటు ప్రపంచ స్థాయి వర్తక ఒప్పందాలకూ భారత పౌరుల ఉపాధి కల్పనే పునాదిగా ఉండాలి.’
– డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ (విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, బోర్లాగ్ పురస్కార గ్రహీత)
దేశంలో 70 శాతం వ్యవసాయం పైన ఆధారపడుతున్నవారే. భారత్ బహుముఖ ప్రగతికి మూలాధారం కూడా ఆ రంగమే. అలాంటి వ్యవసాయ రంగానికీ, ఆ రంగం మీద ఆధారపడిన పారిశ్రామిక, సాంకేతిక ఉపాధి రంగాలకు సంబంధించిన ఉపాంగాలకీ సమస్యలు ఎదురైనప్పుడు అందుకు విరుగుడుగా దేశవాళీ పరిష్కారాలు చూడడం సరైనది. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఆంగ్లో–అమెరికన్ సామ్రాజ్యవాద పెట్టుబడుల వైపు అర్రులు చాచడం, చాస్తూ ఉండడం ఒక వాస్తవం. ఆ విధంగా ఆ ప్రభుత్వాలు దేశ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీశాయి. 1991, 2000–2001 కాలంలో ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ప్రజా వ్యతిరేక సంస్కరణలకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు లొంగిపోవడం ఇందుకు పరాకాష్ట. ఆ విధంగా అవి దేశాభివృద్ధిని పరా«ధీన స్థితికి నెట్టేశాయి.
ప్రపంచ మార్కెట్‌లో స్థానం లేదా?
ఈ స్థితి నుంచి ఇప్పటికీ మనం బయటపడలేదు. ఇందుకు తాజా సాక్ష్యం ఫ్రీట్రేడ్ ఒప్పందం. ఇండియా, చైనా సహా పదహారు ఆసియా– పసిఫిక్ దేశాలను కలిపి భారీ ఎత్తున ప్రాంతీయ స్వేచ్ఛావాణిజ్య ఒప్పంద సమాఖ్యను (ఫ్రీట్రేడ్ ఎగ్రిమెంట్) రూపొందించడానికి ఆంగ్లో–అమెరికన్ సామ్రాజ్య ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ ద్వారా పన్నాగం పన్నాయి. తన పన్నాగాలలో భాగం పంచుకుంటున్న దక్షిణ కొరియా, జపాన్ లాంటి పది ఏసియాన్ దేశాలను కలిపి ప్రపంచ బ్యాంక్ ఒక కూటమిని ఏర్పరిచింది. పదహారు సభ్య దేశాలతో ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థికాభివృద్ధి సమాఖ్య చైనా ఆధ్వర్యంలో ఉన్నది.
దేశాల మధ్య ఎలాంటి ఆటంకాలు లేకుండా వర్తక వాణిజ్యాలు సాఫీగా సాగించాలనే ఈ రెండు వాణిజ్య కూటముల ఆరాటం. కానీ ఇంతకాలం ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల ద్వారా అమెరికా చేస్తున్న పనంతా బడుగు, వర్ధమాన దేశాల వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తులు ప్రపంచ మార్కెట్‌కు చేరనివ్వకుండా ఆంక్షలు పెట్టడమే. ఇది చాలదన్నట్టు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌లకు తోడు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను అమెరికా నెలకొల్పింది. పైగా అమెరికా, యూరప్ దేశాల వస్తూత్పత్తులతో బడుగు దేశాల మార్కెట్లను ముంచెత్తించేందుకు దిగుమతి సుంకాలను తగ్గించాలి లేదా ఎత్తివేయాలని చాలాకాలంగా షరతులు విధిస్తున్నది. అలా భారత్ మెడలు వంచింది.
మన దేశం సునాయాసంగా ఉత్పత్తి చేయగల 2,000 రకాల వ్యవ సాయ, పారిశ్రామికోత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు రాకుండా చేసింది. ఆ మేరకు తన దిగుమతులను మన దేశం మీద రుద్దింది కూడా. ఇందుకుగాను ప్రపంచ బ్యాంక్ ద్వారా అమెరికా అమలు చేయించిన దుర్మార్గపు పని– దీనికి సంబంధించిన 22 భారతీయ చట్టాలను నిబంధనలను సవరించేటట్టు చేయడం లేదా ఎత్తించి వేయడం.
హైదరాబాద్ సదస్సు వెనుక
ఈ నెల 24 (నిన్నటి నుంచి) మొదలుపెట్టి, 28వ తేదీ వరకు హైదరాబాద్ కార్యస్థానంగా అమెరికా, ప్రపంచ బ్యాంక్ తలపెట్టిన బృహత్ ప్రాంతీయ సహకార సంస్థ సమావేశాలు అలాంటి కుట్రలో భాగమే. ఇది పైకి స్వచ్ఛం దంగా జరుగుతున్న ప్రాంతీయ సహకారంగా కనిపించవచ్చు. కానీ సంపన్న దేశాల స్వాహాకార ఎత్తుగడగానే భావించాలి. సభ్య దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ప్రపంచ సంస్థల ఆధ్వర్యంలో అంత తేలిగ్గా సాధ్యపడే వ్యవహారం కాదు. ఇందుకు తిరుగులేని నిదర్శనం– ఈ ‘ప్రాంతీయ సహకారాన్ని’ ఆంగ్లో–అమెరికన్ సామ్రాజ్య ప్రభుత్వాలు నిజంగానే కోరుకునే పక్షంలో ఈ సదస్సుకు ఆహ్వానించే సభ్య దేశాలకు, వాటి పార్లమెంటులకు తమ ప్రతిపాదనల పత్రాల్ని ముందుగానే చర్చ కోసం పంపి ఉండాల్సింది.
కానీ ఈ రోజు దాకా అలాంటి ప్రజాస్వామిక సంప్రదాయాన్ని పాటించలేదు, పాటించరు కూడా. ఎందుకంటే, భారత వ్యవసాయ రంగంపై పట్టు సాధించడానికి ప్రపంచ బ్యాంకు (1991 నుంచీ) సంస్కరణల కోసం ఎంచుకున్న రంగాలు/శాఖలు–పాడి పరిశ్రమ, రొయ్యల పెంపకం, రబ్బరు తోటలు, చేపల పరిశ్రమ, పట్టు పరిశ్రమ వగైరా. వీటికితోడు దేశీయ ఎరువుల పరిశ్రమ, భూగర్భ జలాలను పైకి తోడగల పంపుసెట్లు, అధికోత్పత్తి సాధనాలంటూ కృత్రిమ విత్తనాల తయారీలపై కూడా వరల్డ్‌బ్యాంక్ కన్ను వేసింది.
అందుకే ఆ బ్యాంకు 17 రాష్ట్రాల్లో వ్యవసాయ విస్తరణ ‘సేవల’ పేరిట పథకాలు ప్రవేశపెట్టించినట్టే పెట్టించి, మధ్యలో విరమింపజేసింది. కనుకనే, 1995 నాటికే, ‘సంస్కరణలు’ ప్రారంభమైన నాలుగేళ్లకే ప్రసిద్ధ ఆర్థికవేత్తలూ, నిపుణులతో కూడిన ‘పబ్లిక్ ఇంట్రస్ట్ రీసెర్చి గ్రూపు’ ప్రపంచ బ్యాంకు పనులను సమీక్షిస్తూ ఇలా శఠించవలసి వచ్చింది: ‘దారిద్య్ర నిర్మూలన పథకాల పేరిట ప్రపంచ బ్యాంకు సరికొత్త మార్గం కనిపెట్టింది. పేదలపైన, ఆదివాసీలపైన పన్నుల భారాన్ని మోపడం ద్వారా, మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఉద్దేశించిన సబ్సిడీలను, దేశ సహజ సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడమే, ఆ మార్గం’ (రీసెర్చి గ్రూపు నివేదిక పే.27).
ఒకసారి రుణం తీసుకుంటే అంతే!
ప్రపంచ బ్యాంకు బడుగు దేశాలకు రుణాల ఎర చూపిస్తే, వాటిని తీర్చుకోలేని దేశాలకు మరిన్ని రుణాలు ఎరచూపే సంస్థ ఐఎంఎఫ్. అంటే, రుణం పొందిన దేశం శాశ్వత రుణగ్రస్థ దేశంగా మిగిలిపోతుంది. బడుగు, వర్ధమాన దేశాలపై ‘ప్రాంతీయ సహకార’వ్యవస్థ ఏర్పాటు పేరిట ‘స్వేచ్ఛా వాణిజ్యం’ ముసుగులో జరుగుతున్న హైదరాబాద్ సదస్సు లాంటి సమావేశాలకు వేసిన ప్రాతిపదిక ఈనాటిది కాదు. 1991 నాటి సంస్కరణల సమయానికే వరల్డ్ బ్యాంకు ‘భారతదేశ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ప్రతిపాదన’ పేరిట ప్రత్యేక పత్రాన్ని సిద్ధం చేసింది. ఆ మెమొరాండంలో పేర్కొన్న ప్రధాన అంశాలనేæ ‘స్వేచ్ఛా వాణిజ్యం’ పేరిట ‘ప్రాంతీయ సమగ్రాభివృద్ధి’కి షరతులుగా నిర్దేశించింది. అవి 1. వినియోగ వస్తువుల/సరకుల, వ్యవసాయోత్పత్తులు, ఎరువులు, విత్తనాల సరఫరా వగైరా వ్యవహారాల అన్ని దశల్లోనూ ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదు. 2. రైతుకు గిట్టుబాటు ధరలు లభించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండరాదు. 3. ప్రోత్సాహకాల పేరిట ఇచ్చే సబ్సిడీలలో కోత పెట్టాలి. 4. అవసరాలను బట్టి ప్రపంచబ్యాంకు, దాని అనుబంధ సంస్థలే రుణాలిస్తాయి. సంబంధిత శాఖల వారీగా సర్దుబాటు రుణాలు కూడా ఇస్తుంది’(వరల్డ్‌బ్యాంక్ డెవలప్‌మెంట్ రిపోర్టు: 1986).
ఈ సంస్కరణలకు భారత పాలకులు ‘డూడూ బసవన్నల్లా’ తలలూపారు. ‘అధికార బసవన్న’లు కూడా అనుకూల ముద్రలు వేశారు. ఇందుకు తొలి ఉదాహరణల్లో ఒకటి– ‘నరసింహం కమిటీ’. వ్యవసాయ రంగానికి కల్పించాల్సిన ప్రభుత్వ పరపతి (రుణ) సౌకర్యంలో భారీ ఎత్తున కోత విధించడాన్ని సమర్థిస్తూ ఈ కమిటీ సిఫారసు చేసింది. బ్యాంక్, అమెరికా పాలకులు బహుళజాతి గుత్త సంస్థల మెరమెచ్చులకోసం ఇలాంటి పనులెన్నో చేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ హయాంలో బీజేపీ ‘మేక్ ఇన్ ఇండియా’(ఇండియాలోనే తయారీ) పేరిట సాగుతున్న తతంగంలో కూడా సరిగ్గా ఇదే. అమెరికా ఆధ్వర్యంలోని ‘ఏసియాన్’ సమాఖ్యకు రూపొందించిన ఆ ప్రతిపాదనల పత్రం ‘ప్రాంతీయ సహకార’ సదస్సులో పాల్గొనే సభ్య దేశాలకు అందలేదు. సదస్సు రహస్య ఉద్దేశానికి ఇదే నిదర్శనం. బడుగు, వర్ధమాన దేశాల మౌలిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేయబోయే నిర్ణయాలకూ ఇదొక సూచన.
అయితే, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర మీనన్ ఈ భావనతో (21.7.17) విభేదించడం విచిత్రమే. ఈ సమస్యను కేవలం భారత్–చైనాల మధ్య సిక్కిం, భూటాన్‌తో ఏర్పడిన సరిహద్దు ‘గిల్లికజ్జాల’ దృష్టితో చూడరాదని హితవు చెబుతూ ఇలా అభిప్రాయపడ్డారు కూడా: ‘ఈ సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్య వ్యవస్థలో ప్రధాన భాగస్వామ్య దేశం చైనా. అయినప్పుడు చైనా సరకులు భారత మార్కెట్‌లో ప్రవేశిస్తే మనం (ఇండియా) జడిసిపోరాదు. ఎందుకంటే, అలా మనం వెనుకడుగు వేస్తే మిగతా 16 దేశాలూ చైనాతో కలుస్తాయి. సామెత చెప్పినట్టుగా, గదిలోంచి మనం బయటకు వాకౌట్ చేయడం తేలికేగానీ, తిరిగి గదిలోకి ప్రవేశించడం కష్టం’ అన్నారు.
అదొక రక్తచరిత్ర
ప్రపంచబ్యాంక్ ఆధ్వర్యంలో అమెరికా వివిధ దేశాల్లో అమలు జరిపిస్తూ వచ్చిన ప్రజా వ్యతిరేక సంస్కరణలకు కొంతకాలం స్వయానా బ్యాంక్– ఐ.ఎం.ఎఫ్. సంస్థల ఉపాధ్యక్షునిగా, దాదాపు 20 సంవత్సరాలు పనిచేసిన ఆఫ్రికా ఖండ దేశాల్లో బ్యాంక్ సంస్కరణలను అమలు చేస్తున్న క్రమంలో డాక్టర్ డేవిసన్‌బుధూ తన దారుణ అనుభవాలను భరించలేక మనస్తాపంతో ఐ.ఎం.ఎఫ్. అధిపతి కామ్‌డెసస్‌కు రాసిన సుదీర్ఘ బహిరంగ లేఖ మన లాంటి వర్ధమాన దేశాలకు మరువరాని గుణపాఠం కావాలి: ‘కొన్ని ఆఫ్రికా దేశాల్లో బ్యాంక్ సంస్కరణలను బలవంతంగా నేను అమలు చేస్తున్న క్రమంలో నా చేతులు రక్తసిక్తమయ్యాయి. ప్రజల్ని పీడించిన ఆ సంస్కరణలవల్ల రక్తమోడుస్తున్న చేతుల్ని ఆఫ్రికాలో నలుమూలలా లభించే నీళ్లతో కడిగినా, నా చేతులు చేసిన పాపం తొలగదుగాక తొలగదు’’. ఇలాంటి సత్యాన్ని మన దేశ పాలకుల్లో ఇక్కడి నోటినుంచి అయినా వినగలమా?!
ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in