కొత్త ఏడాదిలోనే కొత్త కార్డులు!
♦ ఆహార భద్రతాకార్డుల జారీ ఆలస్యం!
♦ నత్తనడకన టెండర్ల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డులు కొత్త ఏడాదికి సిద్ధం కానున్నాయి. కార్డుల జారీకి ఉద్దేశించిన టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులు జనవరి నుంచి లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నవంబర్ తొలి వారానికే కార్డుల జారీ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినా టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న కూపన్ల విధానంతోనే నిత్యావసర సరకుల పంపిణీ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో రేషన్‌కార్డులతో ఆధార్ సీడింగ్ ప్రక్రియ, బోగస్‌కార్డుల ఏరివేత తర్వాత మొత్తంగా 2.82 కోట్ల మంది ఆహార భద్రతాకార్డులకు అర్హులని పౌర సరఫరాల శాఖ తేల్చింది.
సుమారు 90 లక్షల కుటుంబాలు దీని కిందకు రానున్నాయి. గతంలో మాదిరి లామినేషన్‌తో కూడిన కార్డును కాకుండా ఈ ఏడాది యూవిక్ పేపర్‌తో కూడిన కార్డును లబ్ధిదారులకు అందజేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. లామినేషన్ కార్డుతో పోలీస్తే దీని ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని, వినియోగం సైతం సులభమని ఆ శాఖ చెబుతోంది. పాతకార్డుల తయారీకి ఒక్క దానికి రూ.14 మేర ఖర్చవగా, కొత్త కార్డు తయారీకి రూ.4 నుంచి రూ.5కి మించ కుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ కార్డుల జారీకై గత నెలలోనే టెండర్లకు పిలవగా నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు.
సాంకేతిక కారణాలతో ఈ టెండర్ల ప్రక్రియ ఇంతరవకు ముగియలేదు. దీంతో గత నెలాఖరుకే ముగియాల్సిన ప్రక్రియ ఆలస్యమైంది. డిసెంబర్ చివ రి నాటికైనా ఈ ప్రక్రియ ముగించి జనవరి నాటికి వంద శాతం కార్డుల జారీ చేయాలని శాఖ భావిస్తోంది. ఆహార భద్రతాకార్డులు జారీ చేయకపోవడంతో పేదలపై ప్రతినెల రూ.10 చొప్పున అదనపుభారం పడుతోంది. ప్రతినెల ఆన్‌లైన్ ద్వారా డేటాస్లిప్ తీసుకొని సమర్పిస్తే తప్ప రేషన్ సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ప్రతినెలా డైనమిక్ కీ రిజిస్టర్డ్‌లో లబ్ధిదారుల వివరాలు చేర్పులు, మార్పులు జరుగుతుండటంతో డేటాస్లిప్ తప్పనిసరిగా సమర్పించాల్సిందేనని డీలర్లు పేర్కొంటున్నారు. ఫలితంగా లబ్ధిదారులు గత 11 నెలలుగా ఆన్‌లైన్ కేంద్రాల్లో రూ.10 చెల్లించి డేటాస్లిప్ తీసుకుంటున్నారు.