సీఎంఆర్ బకాయిలపై .. ప్రత్యేక దృష్టి
- ఇంకా పెండింగులో 1.81లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిలు
- మిల్లర్ల నిర్లక్ష్యం...ఈనెల 30వ తేదీ వరకు గడువు
- జాయింట్ కలెక్టర్లకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ లేఖ
సాక్షి, హైదరాబాద్ : కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని (సీఎంఆర్) మిల్లర్ల నుంచి పూర్తి స్థాయిలో సేకరించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి సరిపడా బియ్యం ఇంకా సరఫరా కాలేదు. బియ్యం బకాయిలు అందజేయడంలో మిల్లర్లు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఫలితంగా ప్రభుత్వానికి నష్టం చేకూరుతోందన్న అభిప్రాయానికి రాష్ట్ర పౌరసరఫరా శాఖ ఉన్నతాధికారులు వచ్చారు. దీంతో సరిగ్గా నెల రోజుల నిర్ణీత గడువు విధించుకుని, పూర్తి స్థాయిలో సీఎంఆర్ బకాయిలు రాబట్టేందుకు ప్రణాళిక రచించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సి.వి.ఆనంద్ కార్యాచరణకు ఉపక్రమించారు. ిసీఎంఆర్ బకాయిలను రాబట్టేం దుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
తనిఖీలు..కేసుల నమోదుకు ఆదేశాలు
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 23లక్షల మెట్రికట్ టన్నుల ధాన్యాన్ని 2015-16 సంవత్సరానికి గాను మిల్లర్లకు ఇచ్చింది. మిల్లర్లు ఇప్పటి వరకు తీసుకున్న ధాన్యం నుంచి 14లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించారు. మిల్లర్ల నుంచి ఇంకా ఒక లక్షా 81 వేల మెట్రి క్ టన్నుల బియ్యం రావాల్సి ఉందని శాఖ అధికారులు కమిషనర్‌కు ఇప్పటికే వివరించారు. ఈ నెల 30వ తేదీలోగా మిల్లర్లకు నిర్ణీత గడువు విధించి, బియ్యం అప్పగించేలా చర్యలు తీసుకోవాలని శాఖ అధికారులను ఆదేశించారు. తరచూ తనిఖీలు చేస్తూ, సీఎంఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లను గుర్తించి కేసులు నమోదు చేయాలని కమిషనర్ సి.వి.ఆనంద్ ఆదేశించారు.