మిల్లర్ల మాయాజాలం!
⇒ సన్న బియ్యం సరఫరాపై పౌరసరఫరాల శాఖ,కార్పొరేషన్ మధ్య కొరవడిన సమన్వయం
⇒ ఒకే జిల్లా నుంచి ఆరు జిల్లాలకు సరఫరా
⇒ ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు బియ్యం దిగుమతి
⇒ రైతులకు ఉపయోగపడని ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా కొందరు మిల్లర్లు తమ తీరును మార్చుకోవడం లేదు. హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం కోసం స్కూళ్లకు సరఫరా చేస్తున్న సన్న బియ్యం విషయంలో కొందరు మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారు. మిల్లర్ల నుంచి సన్న బియ్యం సేకరించే విషయంలో పౌరసరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం మిల్లర్లకు వరంగా మారింది. ప్రజా పంపిణీ (పీడీఎస్) వ్యవస్థ కోసం రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పజెబుతున్న ప్రభుత్వం, ‘కస్టమ్ మిల్లింగ్ ’ద్వారా సన్నబియ్యం సమకూర్చుకుంటోంది.
స్కూళ్లకు, హాస్టళ్లకు అవసరమైన సన్నబియ్యం కూడా మిల్లర్ల నుంచే కొనుగోలు చేయడానికి ఈ ఏడాది కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. రైతులకు క్వింటాలుకు కనీసం రూ.1,800 చెల్లించి ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్ల నుంచి సన్నబియ్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దీని వల్ల సన్నరకం ధాన్యం పండించిన రైతులకు కనీస మద్ధతు ధర (రూ.1,510) కంటే కూడా ఎక్కువగా గిట్టుబాటు అయ్యేలా చూడాలని భావించింది. కాగా, మిల్లర్లు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండానే ప్రభుత్వాన్ని మాయపుచ్చే పనిలో పడ్డారు. సన్నరకం ధాన్యం దిగుబడి ఏమాత్రం లేని సిద్దిపేట, వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్, యాదాద్రి జిల్లాలకు నల్లగొండ జిల్లా నుంచే కనీసం 5 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేయాలని నిర్ణయించారు.
ఈ ఆరు జిల్లాలకు తోడు నల్లగొండ జిల్లాలోని స్కూళ్లు, హాస్టళ్లకు కూడా ఈ జిల్లా మిల్లర్లే సరఫరా చేయాల్సి ఉంది. అయితే, గడచిన రెండేళ్ళుగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో సన్నరకం ధాన్యం సాగు గణనీయంగా పడిపోయింది. ఫలితంగా ఆశించిన మేర దిగుబడి కూడా లేదు. అయినా, సన్నబియ్యం సరఫరా కోసం ఈప్రాంత మిల్లర్లకు అవకాశం కలిపించడం విశేషం.
నిబంధనలు గాలికి
నిబంధనల ప్రకారం రైతులవద్ద ధాన్యం కొనాల్సి ఉండగా, బయటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న సన్న బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అంటగడుతున్నారు. రైతుల దగ్గర ఎలాంటి ధాన్యం కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కొందరు కార్పొరేషన్ అధికారులు సహకరిస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఆయా స్కూళ్లకు, హాస్టళ్లకు ఎంత మొత్తంలో ఏ మిల్లు బియ్యం సరఫరా చేయాలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్, మిల్లుల వారీగా కేటాయింపు చేసి ఆ వివరాలను పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలి. వీటిని జాయింట్ కలెక్టర్, డీఎస్‌ఓ ఓకే చేయాలి.
రైతుల వద్ద ఎంఎస్‌పీకి ధాన్యం కొనుగోలు చేసినట్లు రుజువులు చూపాలి. అప్పుడే క్వింటాల్‌కు రూ.3వేలు చెల్లించి ప్రభుత్వం మిల్లర్లవద్ద బియ్యం కొనుగోలు చేయాలన్నది నిబంధన, కాగా, ఇవేవీ అమలు కావడం లేదు. అసలు మిల్లర్ల దగ్గర మద్దతు ధర రికార్డులు కూడా సరిగా లేవని సమాచారం. మరో వైపు కొందరు మిల్లర్లు బిహార్ నుంచి సన్నబియ్యం కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. ఆ బియ్యాన్నే ప్రభుత్వానికి అంటగడుతున్నారు. బిహార్ నుంచి రైల్వే వ్యాగన్లలో మిర్యాలగూడెం చేరుకున్న సుమారు రూ.5కోట్ల విలువైన సన్న బియ్యాన్ని ఇటీవల విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.
ఇక్కడి మిల్లర్లు ఏజెంట్లను సమకూర్చుకుని వారి ద్వారా కొనుగోలు చేయించి తమ మిల్లుల పేర పౌరసరఫరాల శాఖకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. రెండేళ్లుగా సరైన సాగులేక సన్నరకం ధాన్యం దిగుబడే లేకున్నా, నల్లగొండ సహా మరో ఆరు జిల్లాలకు సరఫరా చేసేంత స్థాయిలో మిల్లర్లకు ఎక్కడి నుంచి సన్నబియ్యం సమకూరాయన్న ప్రశ్నకు కార్పొరేషన్ అధికారుల వద్ద సమాధానం లేదు. కాగా, బిహార్‌లో క్వింటాల్ బియ్యం సుమారు రూ.2వేలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రూ.3వేలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్లే వీరు ఏడు జిల్లాలకు సరఫరా చేయగలుగుతున్నారని ఓ అధికారి తెలిపారు.