సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల పరిస్థితి అయోమయంగా మారింది. ఏళ్లకు ఏళ్లుగా డీలర్లుగా పనిచేస్తున్నవారు ఇప్పటికిప్పుడు వాటిని వదులుకుని, వేరే వృత్తిలోకి మారలేక, ప్రభుత్వం తీరు మింగుడుపడక కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. తమ డిమాండ్ల సాధనకు సమ్మెకు వెళదామనుకున్నా ప్రభుత్వ హెచ్చరికలతో, డీలర్‌షిప్పులు పోగొట్టుకోలేక వచ్చీరాని ఆదాయంతో నెట్టుకొస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ–పాస్ అమలు చేస్తున్న రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద కేంద్రం సాయం చేస్తోంది. డీలర్లకు చెల్లించాల్సిన కమీషన్‌లో సగం భరిస్తోంది. ఈ–పాస్ అమలు చేస్తున్నందున డీలర్లకు కిలోకు 70 పైసల కమీషన్ చెల్లించాలి.
ఇందులో కేంద్రం 35 పైసలు ఇస్తుండగా దానికి రాష్ట్ర ప్రభుత్వం 35 పైసలు కలిపి చెల్లించాలి. కానీ, వీరికి కేవలం కిలోకు 20 పైసల కమీషన్ మాత్రమే చెల్లిస్తున్నారు. కేరళలో అక్కడి ప్రభుత్వం ఏకంగా కిలోకు రూ.2.50 చొప్పున కమీషన్ చెల్లిస్తోందని ఉదహరిస్తున్నారు. ఈ స్థాయిలో కాకున్నా తమకు న్యాయంగా చెల్లించాల్సిన మొత్తం కూడా చెల్లించకుండా పొట్టకొడుతోందన్న ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పౌరసరఫరాల శాఖలో ఏకంగా రూ.16 వందల కోట్లు ఆదా చేయగలిగారని, కేవలం ఈ– పాస్‌తో ప్రభుత్వానికి ఏటా రూ. 828 కోట్లు మిగులుతోందని పౌరసరఫరాల అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నుంచే డీలర్లకు నిర్ణీత కమీషన్ కిలోకు 70 పైసల చొప్పున చెల్లిస్తే ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఏటా రూ. 120 కోట్లకు మించదని పౌరసరఫరాల అధికార వర్గాలే పేర్కొంటున్నాయి.
కేంద్రం రూ. 75 కోట్లు ఇచ్చినా..
ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద కేంద్రం డీలర్ల కమీషన్ కోసం ఇప్పటికే రూ. 75 కోట్లు ఇచ్చిందని చెబుతున్నారు. కాగా, ఇది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే పెండింగులో ఉంది. ఒక్కో డీలర్‌కు కనీసం రూ. రెండు లక్షల నుంచి రూ. మూడు లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఈ బకాయిల కోసమే కొందరు డీలర్లు.. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని డీలర్లు కష్టమైనా డీలర్‌షిప్పులను కొనసాగిస్తున్నారని అంటున్నారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టడంలో గతంలో డీలర్లదే ప్రధాన పాత్రగా ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. గోదాముల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చడం, మెజారిటీ షాపుల్లో ఈ–పాస్ మిషన్లు ఏర్పాటు చేయడంతో డీలర్ల చేతివాటానికి ఆస్కారం లేకుండా చేయగలిగామని సివిల్ సప్లైస్ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
పట్టించుకోని ప్రభుత్వం!
రాష్ట్ర వ్యాప్తంగా 17వేల రేషన్ షాపుల్లో 85 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.75 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతీ నెలా 1.75 లక్షల టన్నుల బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ అవుతోంది. అత్యధికులు లబ్ధిపొందే పీడీఎస్‌లో రేషన్ షాపులు అత్యంత కీలకమని, కానీ, డీలర్ల కమీషన్ల చెల్లింపు, ఇతర డిమాండ్ల విషయంలో ప్రభుత్వం అంతగా పట్టింపుతో లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అత్యధికంగా 400 నుంచి 500 రేషన్ కార్డులున్న షాపులే అధికం. దీంతో వీరికి ఇచ్చే కమీషన్ గిట్టుబాటు కావడం లేదంటున్నారు. చాలీచాలని కమీషన్‌తో షాపులు నిర్వహించడం భారంగా మారినందున తమ బకాయిలు చెల్లించడంతో పాటు, కమీషన్ పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రేషన్ డీలర్ల పరేషాన్
Published Sat, Dec 30 2017 4:25 AM | Last Updated on Sat, Dec 30 2017 4:25 AM
Advertisement
Advertisement