మరో 33 వేల కుటుంబాలకు ఆహార భద్రత
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 33 వేల కుటుంబాలకు ఆహార భద్రత (రేషన్) కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో రేషన్‌కార్డుల సంఖ్య 20.28 లక్షలకు చేరినట్లయింది. మరో లక్ష కుటుంబాల దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మంజూరు చేసిన కార్డుదారులకు వచ్చే జూన్ మాసం నుంచి రేషన్ పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కొత్తగా అధికారంలో వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులన్నీ రద్దు చేసి ఆహార భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించడంతో హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 23.39 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. మొదటగా పాత కార్డుదారులైన 14.20 లక్షల కుటుంబాలను ఆధార్‌తో అనుసంధానం చేసి కార్డులు మంజూరు చేశారు.
మిగిలిన దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ అధికారులు దశల వారిగా క్షేత్ర స్థాయి విచారణ కొనసాగిస్తూ వస్తున్నారు. మొత్తం మీద తొలి విడతగా సుమారు 18.84 లక్షల కుటుంబాలకు కార్డులు మంజూరయ్యాయి. ఆ తర్వాత కూడా దరఖాస్తుల పరంపరం కొనసాగుతుండటంతో కార్డుల మంజూరు సంఖ్య ఏప్రిల్ నాటికి 19.49 లక్షలు, మే నాటికి 19.95 లక్షలకు చేరింది. తాజాగా మరి కొన్ని కుటుంబాలకు కార్డులు మంజూరయ్యాయి.
67.42 లక్షల సభ్యులకు బియ్యం
జంట జిల్లాల్లో ఆహార భద్రత పథకం కింద ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా 67.42 లక్షల సభ్యులకు రూ.1 కిలో బియ్యం ఆరు కిలోల చొప్పున అందనున్నాయి. తాజాగా 33 వేల కార్డులు మంజూరు కావడంతో లబ్ధిదారులు (యూనిట్ల) సంఖ్య కూడా పెరిగినట్లయింది. కొత్తగా మంజూరైన కుటుంబాలకు జూన్ నెల నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కోటా కోసం ప్రతిపాదనలు పంపించింది.
ఆన్‌లైన్ ద్వారా ఇలా..
కొత్తగా ఆహార భద్రత కార్డులు మంజూరైందా? లేదా?అనే విషయాన్ని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ సెక్యురిటీ కార్డు వైబ్‌సైట్‌లోకి వెళ్ళి ‘ఎఫ్‌ఎస్‌సీ సర్చ్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి, అ తర్వాత డిస్ట్రిక్ పేరును సెలక్ట్ చేసి ఆధార్ ఆప్షన్‌లో కుటుంబంలోని ఒకరి ఆధార్ నంబర్‌ను ఫీడ్ చేసి సబ్‌మిట్ చేయాలి. కార్డు మంజూరై ఉంటే కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలు, రేషన్ షాపు నంబర్‌తో కూడిన కార్డు ప్రత్యక్ష మవుతోంది. దానిని డౌన్‌లౌడ్ చేసుకొని రేషన్ షాపులో అందజేస్తే సరుకులు అందజేస్తారు.