సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంక్షేమ పథకాల పంపిణీ అంశంలో సర్కారు మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియను వేగిరం చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటి పరిశీలనకు సంబంధించి చర్యలు చేపట్టింది. రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే సమాచారం ఆధారంగా సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దరఖాస్తు పరిశీలన అంశాన్ని సర్వే వివరాలతో ముడిపెట్టిన ప్రభుత్వం.. గురువారం ఆ వివరాలను తహసీల్దార్ల యూజర్ ఐడీతో లింక్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారగణం.. ఆ వివరాలను ప్రింట్‌కాపీలతో సిద్ధంచేసే పనిలో నిమగ్నమైంది.
కుటుంబాలు 17.63 లక్షలు..
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సేకరించిన గణాంకాల ప్రకారం జిల్లాలో 17,63,829 కుటుంబాలున్నాయి. ఇందులో గ్రామీణ పరిధిలో 8,10,697 కుటుంబాలుండగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9,53,132 కుటుంబాలున్నాయి. సంక్షేమ పథకాల కోసం వచ్చే దరఖాస్తులను సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చిన అనంతరం తనిఖీ బృందాల ధ్రువీకరణతో కొత్తగా అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కుటుంబాల వారీగా ప్రింప్‌అవుట్ తీసి సిద్ధం చేసుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో ఆహార భద్రతకు సంబంధించి 9,45,731 దరఖాస్తులు అందగా, పింఛన్ల కోసం 2.9లక్షలు వచ్చాయి.
ఇలా తనిఖీ చేసి..
సంక్షేమ పథకాల అర్హత కోరుతూ వచ్చిన దరఖాస్తులపై మండలస్థాయిలో ఆరుగురు సభ్యులున్న బృందం క్షేత్ర పరిశీలన చేపట్టనుంది. ఈ బృందంలో మండల తహసీల్దార్, ఉప తహసీల్దార్, ఎంపీడీఓ, రెవెన్యూ ఇన్‌స్టెక్టర్, సీనియర్ అసిస్టెంట్లు ఉంటారు. అర్జీదారు పెట్టుకున్న దరఖాస్తుతో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను జోడించి వాటితో క్షేత్రస్థాయిలో తనిఖీ చేపడతారు. సర్వే వివరాలను రూఢీ చేసుకోవడంతోపాటు దరఖాస్తుదారు అర్హతను తేల్చుతారు. అనంతరం లబ్ధిదారుడిని ఖరారుచేస్తూ ధ్రువీకరిస్తారు. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నమూనా పత్రాలను సిద్ధంచేసి క్షేత్రస్థాయి అధికారులకు చేరవేసింది. ముందుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈనెల 16 నుంచి దరఖాస్తుల పరిశీలన మొదలు పెట్టాల్సి ఉండగా.. దరఖాస్తు ప్రక్రియను 20తేదీకి పెంచడంతో పరిశీలన ప్రక్రియ కొంత ఆలస్యమైంది.
వారికీ వెసులుబాటు..
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియలో నమోదుకాని వారికి తాజాగా వెసులుబాటు కల్పించనుంది. తనిఖీ ప్రక్రియకు వచ్చే అధికారులకు ‘సమగ్ర’ వివరాలు ఇవ్వడంతోపాటు సంక్షేమ పథకాల అర్హత కోసం దరఖాస్తు సమర్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వారి అక్కడికక్కడే ధ్రువీకరించి అర్హతను ఎంపికచేసే అవకాశం ఉంది.
‘సర్వే’తో ముడి
Published Fri, Oct 17 2014 2:02 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement