సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ఆహార భద్రత (రేషన్) కార్డుదారుల్లో అనర్హులు అక్షరాల నాలుగున్నర లక్షల పైనే ఉనట్లు బహిర్గతమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఈ-పాస్ అమలు వాస్తవ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. గత మూడు నెలలుగా ఈ-పాస్ (వేలి ముద్రల) ద్వారా సరుకులు పంపిణీ చేస్తుండటంతో వినియోగం లేని కార్డుల చిట్టా బయటపడుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయనే కక్కుర్తితో ఆర్థికంగా ఉన్న వారు సైతం ఆహార భద్రత కార్డులు పొందారు.
కానీ, నెలసరి రేషన్ సరుకులకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వారి కోటా పక్కదారి పట్టి ప్రతి నెల వందల కోట్ల రూపాయల సబ్సిడీ బియ్యం స్వాహాకు గురైనట్లు స్పష్టమవుతోంది. ఈ -పాస్ అమలుకు ముందు ప్రతినెల సుమారు 90 నుంచి 95 శాతం వరకు కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తుండగా.... ఈ-పాస్ పూర్తి స్థాయి అమలుతో సరుకులకు దూరంగా ఉంటున్న కార్డుల సంఖ్య ఒకేసారి 60 శాతానికి పడిపోయింది. గత మూడు నెలల పరిస్థితిని పరిశీలించిన సంబంధిత అధికారగణం సరుకులకు దూరంగా ఉంటున్న కార్డుదారును అనర్హులు గుర్తించి ఏరివేసేందుకు చర్యలకు దిగుతోంది.
ఇదీ పరిస్థితి..
గ్రేటర్ హైదరాబాద్‌లో 13 లక్షలకు పైగా కార్డుదారులున్నారు. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 11 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెల్లరేషన్ కార్డులు రద్దు చేసి ఆహార భద్రత పథకం కింద దరఖాస్తులు అహ్వనించడంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. నిరుపేదలతో పాటు ఆర్థికంగా బలపడ్డ వారు సైతం దరఖాస్తులు చేసుకున్నారు.
పౌరసరఫరాల అధికారులు కనీసం క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండా కేవలం ఆధార్ అనుసంధానంతో కార్డులు మంజూరు చేస్తూ వచ్చారు. దీంతో అర్హులతో పాటు అనర్హులకు కూడా కార్డులు మంజూరయ్యాయి. ఫలితంగా కార్డుల సంఖ్య ఒకేసారి పెరిగింది. కార్డులు మంజూరైన అనర్హులు మాత్రం సరుకులకు దూరంగా ఉంటూ వస్తూన్నారు. అయితే ఆహార భద్రత పధకం కింద కార్డులోని యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటా కేటాయించడంతో చౌకధరల దుకాణాల డీలర్లకు అనర్హుల కార్డులు వరప్రసాదంగా మారాయి. గత ఏడాదిన్నర కాలంగా వినియోగం లేని కార్డులు కోటా కూడా డ్రా అవుతూ వచ్చింది. తాజాగా ఈ పాస్ అమలుతో వినియోగం లేని కార్డుల సంఖ్య బయటపడి వారి అవినీతికి అడ్డుకట్టపడినట్లయింది.
కార్డులకే పరిమితం...సరుకులకు దూరం!
Published Thu, Jun 30 2016 11:59 PM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement