
మరోమారు ‘బోగస్’ ఏరివేత
సింగిల్ పేర్లు, అడ్రస్‌లేని రేషన్ లబ్ధిదారులపై ఆరా
వెల్లడించిన పౌర సరఫరాలశాఖ అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు బోగస్ రేషన్ లబ్ధిదారుల ఏరివేత మొదలైంది. జిల్లాల వారీగా అధికారులు బోగస్ లబ్ధిదారుల వేటలో నిమగ్నమయ్యారు. లబ్ధిదారులకు కొత్తగా ఆహార భద్రతా కార్డులిచ్చేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో బోగస్‌కు చెక్ పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా జరిపిన పరిశీలనలో నల్లగొండ జిల్లాలో కొన్ని బోగస్ కార్డులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో అన్ని జిల్లాల్లోనూ పరిశీలనచేయాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి జిల్లాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో తెల్ల రేషన్‌కార్డుల లబ్ధిదారులు 3.30 కోట్ల మంది వరకు ఉండగా, ఈ-పీడీఎస్‌తో ఆధార్ అనుసంధానం చేసి సుమారు 50 లక్షలకు పైగా బోగస్ కార్డులను ఏరివేశారు. గతేడాది చివరికి మొత్తంగా 2.80 కోట్ల మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటే కొత్తగా కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి అభ్యర్థనల్ని పరిశీలించి వారికీ సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇటీవల కొత్తగా చేర్చిన వారితో కలిపి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2.86 కోట్లకు చేరింది. రెండు నెలల్లోనే ఈ స్థాయిలో పెరుగుదలపై దృష్టిపెట్టిన అధికారులు నల్లగొండ జిల్లాలో ప్రాథమిక పరిశీలన చేపట్టారు. ఇందులో 361 కార్డులు అడ్రస్ లేనివిగా, మరో 94 కార్డులు పేర్లు లేనివిగా గుర్తించారు. మరికొన్నింటికి సింగిల్ పేర్లు మాత్రమే ఉన్నాయి.
ప్రాథమిక విచారణలో బోగస్ కార్డులు బయటపడడంతో అన్ని జిల్లాల్లో కార్డుల వెరిఫికేషన్‌కు పూనుకున్నారు. ఇక జంట నగరాల పరిధిలో బోగస్ లబ్ధిదారులు పెద్దసంఖ్యలోనే ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. గతేడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 12 లక్షల బోగస్ కార్డుల్ని తొలగించారు. అయినప్పటికీ ఈ జిల్లాలో ఇంకా వేల సంఖ్యలో బోగస్ కార్డులు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.