
సూక్ష్మ పోషకాల వృద్ధిపై దృష్టి!
‘ఆహార భద్రత’ అంటే పౌరులకు ఆహార కొరత లేకుండా చేయడం. హరిత విప్లవం ద్వారా ఈ లక్ష్యం నెరవేరినప్పటికీ.. ఆ ఆహారంలో
‘ఆహార భద్రత’ అంటే పౌరులకు ఆహార కొరత లేకుండా చేయడం. హరిత విప్లవం ద్వారా ఈ లక్ష్యం నెరవేరినప్పటికీ.. ఆ ఆహారంలో సూక్ష్మపోషకాల లోపం ఏర్పడింది. ఆహార లభ్యతతో పాటు పౌష్ఠికాహారం కూడా అంతే అవసరం. ఆహారంలో జింకు, ఐరన్, విటమిన్ ఎ వంటి సూక్ష్మపోషకాల లోపం ప్రబలంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఫలితంగా చిన్నపిల్లలు అంధత్వం, రక్తహీనత, ఎదుగుదల లేమి వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. హరిత విప్లవం ప్రారంభమై ఏభయ్యేళ్లు గడచిన తర్వాత.. ఇప్పుడు ఆహార ధాన్యాల్లో పోషకాల సాంద్రత పెంపొందించడంపై భారత ప్రభుత్వం, శాస్త్రవేత్తలు దృష్టిపెడుతున్నారు.
ఈ పూర్వరంగంలో ప్రధాన పంటల వంగడాల్లో ముఖ్యమైన సూక్ష్మపోషకాల సాంద్రతను పెంచేందుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) బయోఫార్టిఫికేషన్ (జైవ పోషకాల వృద్ధి) ప్రాజెక్టును రూ.130 కోట్లతో 2004లో ప్రారంభించింది. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, కొర్రలు, బంగాళ దుంపల్లో సూక్ష్మపోషకాల సాంద్రతను పెంచేందుకు ఐసీఏఆర్ కృషి చేస్తోంది. ఈ పరిశోధనల్లో భాగంగానే.. హైదరాబాద్‌లోని భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్) జింక్, ప్రొటీన్ అధిక పాళ్లలో ఉండే సరికొత్త రెండు వరి వంగడాలను రూపొందించి, వచ్చే నెల 5న రైతులకు అందిచబోతోంది.
హై జింక్ రైస్, హై ప్రొటీన్ రైస్ వంగడాలు..
ఐఐఆర్‌ఆర్ డెరైక్టర్, బయోఫార్టిఫికేషన్ ప్రాజెక్టు నోడల్ అధికారి కూడా అయిన డా. రవీంద్రబాబు ‘సాక్షి’కి అందించిన సమాచారం ప్రకారం.. హై జింక్ రైస్, హై ప్రొటీన్ రైస్ వంగడాల (వీటికి ఇంకా పేర్లు పెట్ట లేదు) పంట కాలం 125 నుంచి 130 రోజులు. ఎకరాకు 45 బస్తాల వరకు దిగుబడి లభిస్తుంది.
బియ్యంలో సాధారణంగా 10 పీపీఎం కంటే తక్కువగానే జింకు ఉంటుంది. అయితే, హై జింక్ వంగడంతో పండించిన బియ్యంలో 25 ిపీపీఎం మేరకు జింక్ ఉంటుంది. హై జింక్ రైస్ గర్భిణీ స్త్ర్రీలకు, చిన్నారులకు ఉపయోగపడుతుంది. జింకు లోపం ఉన్న పిల్లలకు డయేరియా సోకితే వారు చనిపోయే ప్రమాదముంది. మన దేశంలో ఐదేళ్ళ లోపు చిన్నారుల్లో ఎక్కువగా జింకు లోపం ఉంటుంది. జింక్ అధికంగా ఉన్న బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించగలిగితే వీరిని కాపాడవచ్చు.
బియ్యంలో సాధారణంగా 6 శాతం మేరకు ప్రొటీన్లు ఉంటాయి. ఐఐఆర్‌ఆర్ రూపొందించిన హై ప్రొటీన్ వరి వంగడంలో 10.5 శాతం వరకూ ప్రొటీన్లు ఉంటాయి.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధనా సంస్థలో డిసెంబరు 5న ఉదయం పారిశ్రామిక సదస్సు, ప్రదర్శన జరగనుంది. ఈ సదస్సులో హైజింక్ రైస్, హై ప్రొటీన్‌రైస్ వంగడాలను ఎంపిక చేసిన రైతులకు ఉచితంగా తొలిసారి పంపిణీ చేయనున్నారు. ఈ సదస్సులో అన్ని ఐసీఏఆర్ సంస్థల ప్రతినిధులు, ఆదర్శ రైతులు, రైస్ మిల్లర్లు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. హై జింక్, హై ప్రొటీన్ వరి వంగడాలు.. వీటి ద్వారా పండించిన బియ్యం తదితర ఆహారోత్పత్తుల మార్కెటింగ్‌పై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఐఐఆర్‌ఆర్ ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉందని డా. రవీంద్రబాబు తెలిపారు.
మధుమేహ రోగులకు ఉపయోగపడే వరి వంగడాలు
పిండి పదార్థం (గ్లైసిమిక్ ఇండెక్స్- జీఐ) తక్కువగా ఉండే వరి వంగడాలు మధుమేహ రోగులకు ఉపయుక్తంగా ఉంటాయి. వరిలో సాధారణంగా గ్లైస్‌మిక్ ఇండెక్స్ 75-80 వరకు ఉంటుంది. సంపద, లలాత్, సాంబ మసూరి(బీపీటీ 5204) రకాల బియ్యంలో జీఐ 51-52 మేరకు ఉంటుందని, ఇవి టైప్-2 మధుమేహ రోగులకు అనువుగా ఉంటాయని డా. రవీంద్రబాబు తెలిపారు. ఈ రకాల బియ్యం అనేక రాష్ట్రాల్లో చాలా కాలంగా వినియోగంలో ఉన్నప్పటికీ.. వీటిలో జీఐ తక్కువగా ఉందన్న విషయం చాలా మంది వినియోగదారులకు తెలియదని ఆయన అన్నారు. ఈ వంగడాల విత్తనాలను సైతం ఐఐఆర్‌ఆర్ డిసెంబర్ 5న ఎంపిక చేసిన రైతులకు అందిస్తామన్నారు.
వీటితో పాటు ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ‘ఆర్‌ఎన్‌ఆర్ 15048’లోనూ జీఐ తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారన్నారు. ఈ వంగడంపై జాతీయ పోషకాహార సంస్థలో అధ్యయనం జరుగుతోందని, నివేదిక వచ్చాక జీఐ ఎంత ఉందో తెలుస్తుందన్నారు. నీటి కొరతను తట్టుకుని అధిక దిగుబడులనిచ్చే వరి వంగడాలను మరో రెండేళ్లలో రైతులకు అందుబాటులోకి తేనున్నామని ఆయన తెలిపారు. వాతావరణ మార్పులతో సోకే చీడపీడల్ని తట్టుకునే వంగడాలను కూడా రెండు మూడేళ్ల కాలంలో రైతులకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
- అరుణ్ కుమార్ మరపట్ల, సాగుబడి డెస్క్
రెండు, మూడేళ్లలో ప్రజాపంపిణీ ద్వారా పేదలందరికీ అందించవచ్చు
జింక్, ప్రొటీన్లు అధికంగా ఉండే నూతన వంగడాలను తొలిసారి కొద్దిమంది రైతులకు అందజేస్తున్నాం. వీటిని బాగా ప్రాచుర్యంలోకి తెస్తే రెండు, మూడేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్థకమైన ఈ బియ్యాన్ని వినియోగదారులకు అందించవచ్చు. అధిక పోషకాలతో కూడిన వరి ఆధారిత ఆహారోత్పత్తులను కూడా ప్రజలకు అందుబాటులోకి తేనున్నాం.
- డా. వి. రవీంద్రబాబు (94408 80366), డెరైక్టర్, భారతీయ వరి పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్