పేదల కడుపు కొడుతున్న సర్కార్
ఈ-పాస్‌తో దూరమవుతున్న ఆహార భద్రత
నగదు బదిలీతో గ్యాస్ కనెక్షన్లకు కోత
నిరుపేద జిల్లాలో పేదలకు ఆహార భద్రత కరువవుతోంది. పట్టెడన్నం లేక అర్ధాకలితో అన్నమోరామ‘చంద్రా’ అంటూ అలమటిస్తున్న కుటుంబాలు జిల్లాలో అధికంగా ఉన్నాయి . వారిని ఆదుకోవలసిన ప్రభుత్వం... ఉన్న ఒక్క ఆధారమైన రేషన్ కార్డును కూడా రద్దుచేసి, వారి నోటికాడ కూడు లాక్కొంటోంది. గత ఏడాదిగా ఒక్క కొత్తరేషన్‌కార్డు ఇవ్వకపోగా, వేల కార్డులను రద్దు చేసింది. ఆధార్ సీడింగ్, ఈ పాస్ పేరుతో పేదలతో ఆటలాడుకుంటోంది. గంటల తరబడి క్యూలో నిలుచున్నా రేషన్ అందుతుందనే నమ్మకం లేకుండా పోయింది. ఏ నెల ఏ నెపంతో రేషన్ నిలిపివేస్తారో తెలియక పేదలు నిత్యం ఆందోళనకు గురవుతున్నారు. రద్దయిన కార్డులను పునరుద్ధరించుకునేందుకు పనులు మానుకుని అధికారులు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ఊరిస్తోంది తప్ప, మంజూరు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. మరో వైపు నగదు బదిలీ పేరుతో పేదలను ఇక్కట్లకు గురిచేస్తోంది.
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని 34 మండలాల్లో ఉన్న అన్ని పంచాయతీల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కొత్తగా వివాహాలు చేసుకున్న వారు వేరు కాపురం ఉంటున్నప్పుడు వారి పాత రేషన్ కార్డుల్లోని సభ్యుల జాబితానుంచి తొలగిస్తున్న అధికారులు వారు కొత్తగా దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రం మంజూరు చేయడం లేదు. దీని వల్ల వేలాది కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తీసుకున్న దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాల్సి ఉండగా అలా జరగడం లేదు. దర ఖాస్తుల ఆన్‌లైన్ కేవలం 30 శాతం మాత్రమే జరుగుతోంది.
జిల్లాలో ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తుల్లో 12,323 దరఖాస్తులకు విచారణ పూర్తి చేసినట్టు చెబుతున్న అధికారులు ఇందులో 9,387 దరఖాస్తులు మాత్రమే అర్హత కలిగి ఉన్నాయని నివేదించారు. ఇందులో కేవలం 5,561 దరఖాస్తులను మాత్రమే అప్‌లోడ్ చేశారు. అదేవిధంగా అంత్యోదయ అన్నయోజన కోసం 6,191 దరఖాస్తులు వచ్చాయి. అన్నపూర్ణ పథకానికి సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తులు మరో 177 రాగా అవి కూడా మూలన పడి ఉన్నాయి. మరో పక్క ఆధార్ అనుసంధానం ప్రహసనంలో 24,236 రేషన్ కార్డులు ఇన్‌ఏక్టివ్‌లోకి వెళ్లిపోయాయి. వీటిలో 12,348 కార్డులను ఏక్టివ్ చేసిన అధికారులు మిగతా కార్డులను వదిలేశారు. దీని వల్ల ఆయా కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం రేషన్ కార్డులు లేని వారితో పాటు ఉన్న వారికి వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వంలో కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
గ్యాస్ కనెక్షన్లదీ అదేదారి
జిల్లాలో గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు 86,190 ఉన్నాయి. గతంలో 75వేల మంది సీఎస్‌ఆర్, దీపం పథకాలకు దరఖాస్తు చేసుకోగా అంతకు ముందు 11,190 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో మొత్తం 86,190 మంది గ్యాస్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తం గ్రామ సభలు నిర్వహించి కనెక్షన్లు ఇవ్వాలని నిబంధనలు చెబుతుండగా అలా జరగడం లేదు. అయితే జన్మభూమి కమిటీలకు ఇవ్వాలన్న విషయమై స్పష్టత లేకపోవడంతో ఈ కనెక్షన్లను పెండింగ్‌లో ఉంచేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో 16,200 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. వాటి కోసం మండలాల వారీగా దరఖాస్తులు చేసుకున్నారు.
అదేవిధంగా సీఎస్‌ఆర్ పేరిట ఉచిత గ్యాస్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని కోరగా వేలాది మంది మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. వాటికి ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం లక్ష్యం నిర్ణయించలేదు. ఎంత మంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ కనెక్షన్లు ఇవ్వలేదు. మొత్తం 69,990 మంది ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 55,228 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు అర్హత ఉందని అధికారులు ప్రకటించారు. కానీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వలేదు. అలాగే డోర్‌లాక్, ఆధార్‌సీడింగ్ కారణాలతో 81వేల గ్యాస్ కనెక్షన్లు రద్దు చేశారు. వారంతా కూడా ఎదురుచూస్తున్నారు.
ఆధారుణంగా రద్దు!
Published Wed, Jun 3 2015 12:12 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement