
సాక్షి, హైదరాబాద్: ప్రజలందరికీ పౌష్టికాహారం అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరగాల్సిన అవసరముందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, పౌష్టికత, ఆరోగ్యం అనే అంశాలపై హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు ఒకటి మొదలైంది. ఏఎన్‌హెచ్ అకాడమీ వీక్‌గా పిలుస్తున్న ఈ సదస్సును ఇక్రిశాట్, ఎన్‌ఐఎన్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసన్, సీజీఐఏఆర్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఈ సదస్సులో 35 దేశాలకు చెందిన సుమారు 3,560 మంది శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు.
వ్యవసాయం ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం ఎలా? తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఎలా? అనే అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. సదస్సు ప్రారంభం సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీజీఐఏఆర్ పరిశోధనా విభాగం అగ్రికల్చర్ ఫర్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ డైరెక్టర్ జాన్ మెక్‌డర్మెట్ మాట్లాడుతూ.. ఆహార భద్రత కోసం భారత్ దశాబ్దాల క్రితం చేపట్టిన హరిత విప్లవం మంచి ఫలితాలిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పౌష్టికాహార లభ్యతపై దృష్టి పెట్టడం అవసరమని అన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం వరి, గోధుమ వంటి ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించే విధానాలను అవలంబించిందని.. వీటిని మార్చుకుని పుష్టినిచ్చే కాయగూరలు, పప్పు దినుసులు, చేపలు, ఆకుకూరల పెంపకానికి అనువైన విధానాలను సిద్ధం చేయాలని సూచించారు.
లింగ వివక్ష కోణమూ ఉంది: కడియాల సంగీత
వ్యవసాయం, ఆరోగ్యం, పౌష్టికతల్లో లింగ వివక్ష కోణమూ ఉందని.. పొలాల్లో ఎక్కువ కాలం పనిచేసే మహిళలు పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఇది కాస్తా వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ కడియాల సంగీత తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం ముంచుకొస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఏఎన్‌హెచ్ అకాడమీ వీక్‌లో భాగంగా తాము ఆయా రంగాల్లో వస్తున్న కొత్త కొత్త అధ్యయనాల ఫలితాలను ఆచరణ రూపంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ చర్యలు కీలకమని అన్నారు.
పౌష్టికాహారం పొందేందుకు ఆదాయం ముఖ్యమైన అంశమైనప్పటికీ అదొక్కటే కారణం కాదని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం అధిక దిగుబడుల కోసం మాత్రమే కాకుండా.. పోషకాలు అందించేలా మారాల్సిన అవసరముందని చెప్పారు. ఏఎన్‌హెచ్ అకాడమీ వీక్‌కు ఆతిథ్యం ఇస్తున్న జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ భారతీ కులకర్ణి మాట్లాడుతూ, పౌష్టికాహారం విషయంలో ఎన్‌ఐఎన్ విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తోందని.. ప్రభుత్వానికి విధానపరమైన సలహాలు, సూచనలు ఇస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్‌ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త జి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment