ఆహారభద్రతకు భరోసా చిరుధాన్యాలే | Millets Ensure Future Food Security in a Warming World | Sakshi
Sakshi News home page

ఆహారభద్రతకు భరోసా చిరుధాన్యాలే

Published Fri, Mar 11 2022 12:44 AM | Last Updated on Fri, Mar 11 2022 12:44 AM

Millets Ensure Future Food Security in a Warming World - Sakshi

ప్రపంచంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామి భారతదేశం. వీటి వైవిధ్యంలోనూ మనదే అగ్రస్థానం. కాబట్టి, 2022–23 కేంద్ర బడ్జెట్‌లో చిరుధాన్యాలకు అదనపు విలువను జోడిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడం, దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా వీటికి బ్రాండ్‌ విలువను తీసుకురానున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడం సరైన దిశగా తీసుకున్న చర్య అనే చెప్పాలి. చిరుధాన్యాల పైపొట్టు తీయడంలో ఉన్న  క్లిష్టత కారణంగా వాటి వినియోగం దేశంలో తగ్గిపోతోంది. కాబట్టి పోషక విలువలు కోల్పోకుండా చిరుధాన్యాల పొట్టు తీయడాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన యంత్రాలను రూపొందించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటి పొట్టు తినదగినది కాదు. దేశీయ చిరుధాన్యాలతోనే ఆహార, ఆరోగ్య భద్రత ముడిపడి ఉందని గుర్తించాలి.

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2023ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామి భారతదేశం. ఈ పంటల జీవవైవిధ్యంలోనూ మనదే అగ్రస్థానం. కాబట్టి, 2022–23 కేంద్ర బడ్జెట్‌లో చిరుధాన్య పంటలకు అదనపు విలువ జోడిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో వీటి వినియోగాన్ని పెంచడం, దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా వాటికి బ్రాండ్‌ విలువను తీసుకురానున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడం సరైన దిశగా తీసుకున్న చర్య అనే చెప్పాలి.

చిరుధాన్యాల్లో మూడు కీలక పంటలు (జొన్నలు, సజ్జలు, రాగులు); ఆరు మైనర్‌ పంటలు (ఊదలు, వరిగలు, కొర్రలు, అరికెలు, అండు కొర్రలు, చిన్న అండు కొర్రలు) ఉంటాయి. గోధుమ, వరిలో కంటే పోషకపదార్థాలు, మినరల్స్, విటమిన్స్‌ మూడు నుంచి 5 రెట్లు ఎక్కువగా చిరుధాన్యాల్లో ఉంటాయి. పైగా వీటి ఉత్పత్తికి చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది. చెరకు, అరటి వంటి పంటలకు అవసరమయ్యే వర్షపాతంలో 25 శాతం మాత్రమే జొన్న పంటకు సరిపోతుంది. మరీ ముఖ్యంగా, పశువుల పేడ వంటి వ్యర్థాలే దన్నుగా విస్తారమైన పొడినేలల్లో చిరు«ధాన్యాలు పండుతాయి కాబట్టి రసాయనిక ఎరువుల వాడకం కూడా తగ్గుతుంది. అందుచేత, వాతావ రణ సవాళ్లు, పర్యావరణ క్షీణత, పోషకాహార లేమి వంటి ఇబ్బందులు ఎదుర్కోవడంలో చిరుధాన్యాల సాగు కీలక పాత్ర పోషిస్తుంది.

జొన్నలు అధికంగా పండించే రాష్ట్రాల్లో రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హరియాణా, మహరాష్ట్ర, కర్ణాటక ముందువరుసలో ఉన్నాయి. ఇక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రా ల్లోని కొన్ని ప్రాంతాల్లో సజ్జలు అధికంగా పండిస్తారు. సామలను మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో అధికంగా పండి స్తారు. దేశవ్యాప్తంగా కోటి 14 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాలను పండిస్తున్నారని అంచనా. అంటే సంవత్సరానికి దాదాపు కోటి 60 లక్షల టన్నుల పంట పండుతోంది. ఆసియా చిరుధాన్యాల ఉత్పత్తిలో 80 శాతం, ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో 20 శాతాన్ని భారతదేశంలోనే పండిస్తున్నారు. భారతీయ చిరుధాన్య ఎగుమతులు 2020 సంవత్స రంలో 2 కోట్ల 60 లక్షల డాలర్లకు చేరుకున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా చిరుధాన్యాలకు బదులుగా సోయా బీన్, మొక్కజొన్న, పత్తి, చెరకు, పొద్దుతిరుగుడు వంటి పంటలు పండించడం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. వారిని  చిరు ధాన్యాల సాగువైపు మరల్చాల్సిన అవసరముంది. దేశంలో చిరు ధాన్యాలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా అధికంగా వాటి ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఉందనీ, అయితే... ఇందుకోసం పలు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందనీ నిపుణులు పేర్కొంటున్నారు. చిరుధాన్యాల ప్రాథమిక ప్రాసెసింగ్‌లో ఉన్న క్లిష్టతే వాటి వినియోగం తగ్గిపోవడానికి దారితీసిందని వీరి అభిప్రాయం. కాబట్టి పోషక విలువలు కోల్పోకుండా జొన్నల పొట్టు తీయడాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన యంత్రాలను రూపొందించడం చాలా ముఖ్యం. నాణ్యమైన జొన్నలను పండించడం, వాటిని వేగంగా వ్యాపారుల ద్వారా మార్కెటింగ్‌ చేయడం అవసరం. సన్నకారు చిరుధాన్యాల రైతులను ఎలెక్ట్రానిక్‌ అగ్రికల్చరల్‌ నేషనల్‌ మార్కెట్‌ (ఇ–ఎన్‌ఏఎమ్‌) వంటి ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంలతో అను సంధానించాల్సి ఉంది. అలాగే దేశ, ప్రపంచ మార్కెట్లలోనూ చిరు ధాన్యాల ఉత్పత్తిదారుల బేరమాడే శక్తిని పెంపొందించడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పీఓలు) ఏర్పర్చాల్సి ఉంటుంది.

నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాల ఉత్పత్తి, పంపిణీ, క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, శిక్షణలు, ప్రాథమిక ప్రాసెసింగ్‌ క్లస్టర్లు, పరిశోధనా మద్దతుతో రైతులకు ప్రోత్సాహకాలు అందించడానికి... భారత ప్రభుత్వం, జాతీయ ఆహార భద్రతా లక్ష్యసాధనా నిర్వాహక మార్గదర్శకాల్లో మార్పులు తీసుకొచ్చింది. దేశంలోని 14 రాష్ట్రాల్లో 212 చిరుధాన్యాలు పండించే జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 67 విలువ ఆధారిత టెక్నాలజీలను ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’లో  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో 77 అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, 10 జీవ రక్షణ విత్తన రకాల విడుదల సాధ్యమయింది.

చిరుధాన్య వ్యాపారులకు, చిరుధాన్యాల పొట్టు తీసే ప్రాథమిక ప్రాసెసింగ్‌ మెషిన్లకు, రైతు కలెక్టివ్‌లకు మద్దతునివ్వడానికీ; చిరు ధాన్యాలు పండించే రాష్ట్రాలకు పెట్టుబడులు అందించడానికీ 14 బిలి యన్‌ డాలర్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధిని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అత్యంత డిమాండ్‌ ఉన్న వ్యవసాయ వాతావరణ అనుకూల పంటల సాగు కోసం ‘ఒక జిల్లా ఒక పంట’ (ఓడీఓపీ) ఇనిషియేటివ్‌ని ఏర్పర్చి దీనిపై దృష్టి పెట్టడానికి చిరుధాన్యాలు పండించే 27 జిల్లాలను గుర్తించారు. 9 కోట్ల 24 లక్షల డాలర్ల వ్యయంతో, 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పీఓ లు) ఏర్పర్చేందుకు ప్రోత్సహించారు. ఈ సంస్థల్లో రైతులనే సభ్యులుగా చేసి చిరుధాన్యాల ఉత్పత్తిదారులు మార్కెట్లో సమర్థంగా పాలు పంచుకునేలా చేయడమే వీటి లక్ష్యం.

తమిళనాడులోని ధర్మపురి జిల్లా ‘మైనర్‌ మిల్లెట్స్‌ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ’ దీనికి ఒక ఉదాహరణ. వెయ్యిమంది రైతు సభ్యులకు సాంకేతిక సహాయం అందించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన 100 ఎఫ్‌పీఓలలో ఇది ఒకటి. వీరికి విత్తనాలను, యంత్రాలను సబ్సిడీ రేట్ల కింద ఇస్తారు. సముచితమైన ధరలతో రైతుల నుంచి పంట సేకరణను ఇవి చేపడతాయి. అంతకుమించి కుకీలు, పిండి, మొలకెత్తిన చిరుధాన్యాలు, రైస్‌ వంటి ఉత్పత్తులతో ‘డిమిల్లెట్స్‌’ అనే బ్రాండ్‌ పేరుతో చిరుధాన్యాలకు అదనపు విలువను చేకూరుస్తాయి.

మరోవైపున, దక్షిణ ఒడిశాలోని నియమ్‌గిరి హిల్‌ సుదూర ప్రాంతాల్లో డోంగ్రియా కోండులు అనే సాంప్రదాయిక తెగ నివసి స్తోంది. వీరు అనేకరకాల చిరుధాన్యాలను దేశీయ ఆహారంగా తీసు కుంటారు. ఈ ప్రాంతంలో తరాలుగా విత్తన సేకరణ వ్యవస్థను స్థానిక కమ్యూనిటీ విస్తృతంగా చేపడుతోంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఉనికిలో లేని అరికలను వీరు కాపాడుతూ వస్తున్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో చిరుధాన్య పంటలు పండించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోంగ్రియా కోండుల వంటి దేశీయ సన్నకారు రైతుల మార్కెట్‌ అవసరాలు తీర్చడానికి ఒడిశా ప్రభుత్వం అయిదేళ్లపాటు మిల్లెట్‌ మిషన్‌ పేరిట ఉత్పత్తులను అందించాలని ప్లాన్‌ చేసింది. దీంతోపాటుగా ఒడిశా కేంద్రంగా పనిచేసే లివింగ్‌ ఫారమ్స్‌ వంటి ఎన్జీఓలు పోషకాహార లేమి, వాతావరణ ఒత్తిడి వంటి అంశాలపై వారికి అవగాహన కలిగిస్తున్నాయి. కాబట్టి పరిస్థితులను తట్టుకునే చిరుధాన్య రకాలను ఇక్కడ విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదేవిధమైన పథకాలను ప్రవేశపెట్టాయి. 

డోంగ్రియా కోండులు వంటి ఒడిశాలోని ఆదివాసీ జాతులకు చెందిన దేశీయ ఆహార వ్యవస్థల నుంచి ధర్మపురి జొన్నల ఎఫ్‌పీఓల మార్కెట్ల వరకు... భారత గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాల పరి రక్షణకు సంబంధించి ఉత్తమ విధానాలు అమలులో ఉన్నాయి. ఆరోగ్యకరమైన చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునే దిశగా వినియో గదారులను మళ్లించడానికి.. దేశవ్యాప్తంగా నిపుణులను రంగంలోకి దింపాల్సిన అవసరం ఉంది. గత కొన్నేళ్లుగా యువ వ్యవసాయ వ్యాపారవేత్తలు స్థాపించిన 200 వరకు చిరుధాన్యాల స్టార్టప్‌ల అనుభవాల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. వర్షం సహాయంతో చిరుధాన్యాలను పండించే మహిళా రైతులకు నైపుణ్యాలు నేర్పించి వారి సమర్థతను పెంచాల్సి ఉంది. అందుచేత, మార్కెట్‌ అనుకూల తను ఏర్పర్చే విధంగా చిరుధాన్యాల సాగు విధానాలను బలపర్చి, సంస్థాగత జోక్యం చేసుకునేలా మన ప్రయత్నాలు సాగాలి. 

– అభిలాష్‌ లిఖి ‘ అదనపు కార్యదర్శి,
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement