సంక్రాంతికి పేదలకు అందని రేషన్ సరుకులు
ఇంకా 34 శాతం మందికి పంపిణీకాని బియ్యం
కొద్ది నెలలుగా దిక్కులేని పామాయిల్
జాడలేని కందిపప్పు, చింతపండు, కారం పొడి
పండుగకు అదనంగా ఇచ్చే చక్కెర కూడా హుష్‌కాకి
నెలానెలా ఇచ్చే కోటాలోనూ ఈ సారి తీవ్ర జాప్యం
‘ఆహార భద్రత’పై అంతులేని అయోమయం
పట్టణ ప్రాంతాల్లో ఇంకా పూర్తికాని పరిశీలన
అర్హుల జాబితా డీలర్లకు.. ప్రజలకు అందని సమాచారం
రేషన్‌కార్డులతో వెళ్లిన వారికి రిక్తహస్తమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు పండుగ పూట సరుకుల కటకట తప్పడం లేదు. సంక్రాంతికి అదనంగా ఇవ్వాల్సిన చక్కెరేగాక నెల నెలా ఇచ్చే సరుకుల పంపిణీకీ దిక్కులేకుండా పోయింది. ఒక్కొక్కరికి ఆరు కేజీల బియ్యం అని సర్కారు ఘనంగా చెప్పుకున్నా... అసలు బియ్యమే సరిగా అందలేదు. ఇక ఉప్పు, చింతపండు, కారంపొడి వంటివాటి జాడే లేదు. ప్రతినెలా పంపిణీ చేయాల్సిన లీటర్ పామాయిల్ నాలుగైదు నెలలుగా అందడం లేదు. దీనికితోడు ఆహార భద్రతా కార్డుల పంపిణీలో అంతులేని అయోమయం నెలకొంది. వెరసి రాష్ట్ర ప్రజలకు ఈ ఏడాది పండుగ పూట కష్టాలు తప్పడం లేదు.
పామాయిల్‌కు మంగళం..
పేదింటి వంటనూనె అయిన పామాయిల్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మహస్తం పథకం కింద తొమ్మిది నిత్యావసర సరుకులను రూ. 185కే అందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అందించే లీటరు పామాయిల్ ధర మార్కెట్లో రూ. 65 వరకు ఉండగా... అందులో కేంద్ర ప్రభుత్వం రూ. 15, రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 సబ్సిడీగా భరించి రూ. 40కే పేదలకు సరఫరా చేశారు.
అయితే పామాయిల్‌పై అందించే సబ్సిడీని కేంద్రం 2013 అక్టోబర్ నుంచి నిలిపివేయడంతో... ఆ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. అప్పటి ప్రభుత్వం సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. మార్చి వరకు ఈ భారాన్ని భరించిన ప్రభుత్వం రాష్ట్రంలో గవర్నర్ పాలన అనంతరం చేతులెత్తేసింది. అప్పటి నుంచి బీపీఎల్ కుటుంబాలకు పామాయిల్ సరఫరా జరగడం లేదు. ఏడాదికి రూ. 180 కోట్ల వరకూ భారంపడే ఈ పామాయిల్ సరఫరా పునరుద్ధరణను కొత్తగా ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో సుమారు 22.5 లక్షల మంది లబ్ధిదారులకు పామాయిల్ అందకుండా పోయింది.
ఇక బీపీఎల్ కుటుంబాలకు ప్రతినెలా నాలుగు వేల టన్నుల చక్కెర సరఫరా కావాల్సి ఉంది. సంక్రాంతి పండుగకు అదనంగా అంతే మొత్తంలో చక్కెర సరఫరా చేయాల్సి ఉన్నా... ప్రభుత్వం కేటాయించనేలేదు. పైగా ప్రతినెలా ఇచ్చే చక్కెర కూడా సరిగా అందలేదు. రవాణాలో ఇబ్బందులు, గోదాముల నుంచి రేషన్ డీలర్లకు అందకపోవడం, కొన్ని ప్రాంతాలకు చక్కెర ఇంకా చేరకపోవడంతో పండుగకు ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంతా ప్రహసనమే!
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సబ్సిడీ బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం... పండుగ సమయానికి అనుకున్న లక్ష్యానికి చేరుకోలేక చేతులెత్తేసింది. ఆహార భద్రతా కార్డుల కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనకే జనవరి తొలి వారమంతా సరిపోగా... ఆ తర్వాత మొదలుపెట్టిన అర్హుల గుర్తింపు కార్యక్రమం పూర్తి ప్రహసనంగా మారింది. మొత్తంగా వచ్చిన 97 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటివరకు 90 శాతానికి పైగా పరిశీలన పూర్తి చేసినట్లుగా ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలిచ్చారు.
పరిశీలన పూర్తయి అర్హులుగా గుర్తించిన లబ్ధిదారులకు ఆరు కిలోల బియ్యం అందించడానికి ఆధార్ ప్రధాన అడ్డంకిగా మారింది. అర్హులుగా ఉన్నా ఆధార్ కార్డు లేకపోవడం, ఆధార్ సీడింగ్ జరగక డేటాబేస్‌లో పేరు లేకపోవడంతో వారిని అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదు. డేటాబేస్‌లో నిక్షిప్తం చేసిన వివరాల ప్రకారం జిల్లాల్లో కేవలం 57 శాతం నుంచి 75 శాతం వరకు మాత్రమే సీడింగ్ జరిగింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ సీడింగ్ జరిగింది కేవలం 66 శాతం మాత్రమే. మిగతా 34 శాతం మందికి ఈ సంక్రాంతి భోజనానికి దూరం అయినట్లే.
కొత్త తలనొప్పి..
ఆహార భద్రతా కార్డులకు అర్హుల జాబితాలను పౌర సరఫరాల శాఖ నేరుగా రేషన్ డీలర్లకు అందించింది. కానీ దీనిపై అర్హులకు సమాచారం లేకపోవడంతో కొత్త తలనొప్పి వచ్చింది. తాము అర్హులో కాదో తెలుసుకునే అవకాశం లేక, పాత రేషన్‌కార్డులు తీసుకెళ్లిన ప్రజలకు డీలర్లు సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో చాలా చోట్ల ప్రజలు ఆందోళన చేపడుతున్నారు.. డీలర్లతో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇక మెదక్, సిద్ధిపేట, రామచంద్రపురం, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ , రామగుండం, ఆదిలాబాద్ వంటి పట్టణాల్లో అర్హుల ఎంపిక పూర్తికాకపోవడంతో వారికి పండుగ తర్వాతే బియ్యం సహా ఇతర సరుకులు అందే పరిస్థితి నెలకొంది.
వారికి పండుగ తర్వాత పంపిణీ..
‘‘అర్హులైన ప్రతీ ఒక్కరికి బియ్యం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించాం. ఇప్పటికే మెజారిటీ స్థాయిలో పంపిణీ జరిగింది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిశీలన పూర్తికానందున జాప్యం జరుగుతోంది. వారికి పండుగ తరువాత పంపిణీ చేస్తాం. ఇక ఆధార్‌కార్డులు లేవన్న పేరుతో బియ్యం పంపిణీ ఆపొద్దని అధికారులకు స్పష్టం చేశాం. పామాయిల్ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై మం త్రి ఈటెల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేశారు. అమ్మహస్తంలోని తొమ్మిది సరుకుల్లో డిమాండ్ లేని వాటిని సరఫరా చేయడం లేదు. చక్కెర, కందిపప్పు, గోధుమ పిండి సరఫరా చేస్తున్నాం.’’
- పార్థసారథి, పౌర సరఫరాల శాఖ కమిషనర్
కొందరికే పండుగ
Published Thu, Jan 15 2015 1:47 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement
Advertisement