
9 కరువు పీడిత రాష్ట్రాలకు సుప్రీం సమన్లు
న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైనందుకు ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది కరువు పీడిత రాష్ట్రాలకు సుప్రీంకోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తగినంత సమయం లభించినా తొమ్మిది రాష్ట్రాలు ఆహార భద్రత పథకాన్ని ప్రజలకు సక్రమంగా అందించడంలో విఫలమయ్యాయని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్, హరియాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు వెళ్లాయి. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు కూడా ఆహార కమిషన్‌లను ఇంకా ఏర్పాటు చేయకపోయినా, ఇప్పటికే ఆ ప్రక్రియను మొదలుపెట్టడంతో ఆ రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కోర్టు సమన్లు ఇవ్వలేదు.